హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): బనకచర్ల ప్రాజెక్టు అక్రమం, అన్యాయమని, ఈ ప్రాజెక్టును బీఆర్ఎస్ పార్టీ నిర్దంద్వంగా వ్యతిరేకిస్తున్నదని ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ ఉపనేత, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర స్పష్టంచేశారు. రాష్ట్ర సచివాలయంలో గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో బుధవారం ఏర్పాటుచేసిన అఖిలపక్ష సమావేశానికి బీఆర్ఎస్ పక్షాన వద్దిరాజు రవిచంద్ర హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అఖిలపక్ష ఎంపీల సమావేశం ఏర్పాటుచేసిన రాష్ట్ర ప్రభుత్వం.. సమస్యను ఎలా పరిష్కరించాలన్న దానిపై దృష్టిపెట్టాల్సిందిపోయి మాజీ సీఎం, తెలంగాణ సాధకుడైన కేసీఆర్‌పై నిందలు వేసే పని పెట్టుకున్నదని విమర్శించారు. మొత్తం సమావేశంలో బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకొని మాట్లాడేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నించారని తెలిపారు. కేంద్రప్రభుత్వాన్ని, బీజేపీని రేవంత్‌రెడ్డి పల్లెత్తు మాట కూడా అనలేదని చెప్పారు. ఎప్పుడో జరిగిన అపెక్స్ కౌన్సిల్లో.. సముద్రంలోకి వెళ్లే నీటిని సద్వినియోగం చేసుకునే అంశంపై కేసీఆర్ మాట్లాడిన విషయాలను వక్రీకరించి కేసీఆర్, హరీశ్‌రావు, బీఆర్ఎస్ పార్టీపై బురదజల్లే ప్రయత్నం చేశారని ఆరోపించారు. కేవలం కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ అఖిలపక్ష సమావేశం సాగిందని అన్నారు. ఇది రాజకీయ సమావేశం కాదని, గాంధీభవన్‌లో పెట్టిన అఖిలపక్ష సమావేశంలా మాట్లాడవద్దని తాను సీఎంకు, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని హెచ్చరించానని తెలిపారు. బనకచర్ల వంటి కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి కేసీఆర్ ప్రభుత్వం ఎక్కడా ఒప్పుకోలేదని అన్నారు.
బనకచర్ల ప్రాజెక్టును ఎట్టిపరిస్థితుల్లోను అడ్డుకోవాల్సిందేనని, దీనికోసం బీఆర్ఎస్ ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని వద్దిరాజు పేర్కొన్నారు. అఖిలపక్ష భేటీలో ఆయన మాట్లాడుతూ..బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలని, కేంద్ర ప్రభుత్వం ముందు గట్టిగా వాదనలు వినిపించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టుపెట్టేలా ప్రభుత్వ వైఖరి ఉండవద్దని కుండబద్దలు కొట్టారు. ఇరు రాష్ట్రాల్లో ఏదైనా కొత్త ప్రాజెక్టు నిర్మించాలంటే ఏపీ విభజన చట్టం ప్రకారం.. అపెక్స్ కౌన్సిల్లో ప్రాజెక్టు వివరాలను పెట్టి, చర్చించి, అనుమతి పొందాల్సి ఉంటుందని అన్నారు. గతంలో ఏపీ ప్రభుత్వం ఇదే కారణం చూపించి, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి, తుమ్మిళ్ల, భక్త రామదాస్, డిండి వంటి ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర జలశక్తి శాఖకు, కృష్ణా గోదావరి బోర్డులకు ఫిర్యాదు చేసిందని ఈ సందర్బంగా గుర్తుచేశారు. ఇప్పుడు అదే ఏపీ ప్రభుత్వం విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తూ.. అపెక్స్ కౌన్సిల్లో చర్చించకుండా.. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖలు టీవోఆర్ జారీ చేయడానికి సిద్ధమైనట్టు తనకు తెలిసిందని అన్నారు. పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ (ఈఏసీ) దీనిపై చర్చించాయని, కేంద్ర జలశక్తి శాఖ కూడా ప్రాజెక్టు ప్రీఫీజిబిలిటీ రిపోర్టు (పీఎఫ్ఆర్)ను ఆమోదించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్టు కూడా తెలిసిందని పేర్కొన్నారు.
ఏపీ సర్కార్ విభజన చట్టాన్ని ఉల్లంఘించి చేపట్టిన నిర్మాణంపై చర్చించడానికి కేంద్రం అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయకుండా.. ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టడం శోచనీయమని వద్దిరాజు పేర్కొన్నారు. వెంటనే అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర జలశక్తి శాఖకు సీఎం లేఖ రాయాలని సూచించారు. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించేందుకు త్వరలో అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని చెప్పారు. దీనిపై చర్చించేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని అన్నారు. ఆ సమావేశాల్లోనే పోలవరం, బనకచర్ల ప్రాజెక్టులు నిలిపివేయాలన్న అంశంపై ఏకగ్రీవంగా తీర్మానం చేసి.. కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు. అవసరమైతే తెలంగాణ ప్రభుత్వం పోలవరం, బనకచర్ల ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో పోరాటం చేయాలని సూచించారు. ఈ అంశాలపై రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు స్పందించాలని ఆయన డిమాండ్‌చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన అఖిలపక్షంలో తాము స్పష్టంగా బనకచర్లను వ్యతిరేకిస్తున్నట్టు చెప్పామని, అయితే, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పదేపదే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్‌పై నిందలు వేసేలా మాట్లాడారని వద్దిరాజు తెలిపారు. సీఎం అబద్ధపు మాటలపై తాను నిరసన వ్యక్తం చేసినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలపై మాట్లాడాల్సిన సందర్భంలో వ్యక్తిగత దూషణలు మంచిది కాదని, రాష్ట్రం సాధించిన వ్యక్తిపై నిందలు వేయడం సరికాదని చెప్పి సమావేశం నుంచి తాను వాకౌట్ చేసినట్టు వివరించారు.