హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణ హక్కుల సాధనలో బీఆర్ఎస్ పార్టీ, కార్యకర్తలు ఎప్పటికీ రాజీపడబోరని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి స్పష్టంచేశారు. శుక్రవారం తెలంగాణ భవన్లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం అనంతరం పలువురు బీఆర్ఎస్ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. అభివృద్ధి సంక్షేమాన్ని సమపాళ్లలో అందించిన కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోవడాన్ని కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పారు. కేసీఆర్ పాలనలో బాధితులకు ఏ పథకమైనా నేరుగా ఆన్లైన్ ద్వారానే అందించామని గుర్తుచేశారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంక్షేమ పథకాలకు ఎలాంటి అడ్డంకులు రాలేదని చెప్పారు. కాంగ్రెస్ వచ్చీరాగానే దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తున్నదని విమర్శించారు.
డిసెంబర్ 9నే రైతుబంధు, రైతుబీమాపై స్పష్టత ఇస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి.. నేటికీ వాటి అమలుపై సరైన చర్చ పెట్టలేదని ఆరోపించారు. ప్రజాపాలన దరఖాస్తులు రోడ్లపై పారేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ లోపాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు పట్టుదలతో ఉన్నట్టు చెప్పారు. ప్రజల ఆకాంక్షలే తమకు ముఖ్యమని, కేసీఆర్ ఆదేశాల మేరకు భవిష్యత్తు కార్యచరణ ఉంటుందని పేర్కొన్నారు. అయితే, కొత్త ప్రభుత్వం స్థిరపడేందుకు కొంత సమయం ఇవ్వాలని కేసీఆర్ సూచించినట్టు గుర్తుచేశారు. పార్లమెంట్ నియోజకవర్గాల సమావేశాల్లో వచ్చే అభిప్రాయాలను నేరుగా కేసీఆర్‌కు పంపుతున్నామని, ప్రధాన సమస్యలు, కొత్త అంశాలపై కేసీఆర్ కార్యకర్తలకు ఫోన్ చేసి ఆరా తీస్తున్నారని జగదీశ్‌రెడ్డి తెలిపారు.
వచ్చే ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అన్నిస్థానాల్లో గెలుస్తుందని జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. వరసగా ఆయా పార్లమెంట్ స్థానాల నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ సమావేశాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లి.. పార్టీ గెలుపుకోసం కృషి చేస్తామని తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటాలనే ధీమా కార్యకర్తల్లో కనిపిస్తున్నదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం దివాళాకోరు విధానాలే తమకు కలిసి వస్తాయనే నమ్మకం కార్యకర్తల్లో ఉన్నదని చెప్పారు. అభ్యర్థుల ఎంపికపై అన్ని కోణాల్లో సమాలోచనలు చేస్తున్నామని వెల్లడించారు. అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్ చర్చించి తుది నిర్ణయం ప్రకటిస్తారని పేర్కొన్నారు. తమకు ప్రజలు అప్పగించిన ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా నిర్వహిస్తామని అన్నారు.
కాంగ్రెస్ ప్రోత్సహిస్తున్న భౌతిక దాడులు, ప్రోటోకాల్ సమస్యలపై రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో లీగల్ కమిటీలు వేస్తున్నట్టు తెలిపారు. తప్పుడు కేసుల్లో బాధితులకు పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎంపీలుగా తాము పార్లమెంటులో విభజన సమస్యలపై నిరంతరం పార్లమెంటులో కొట్లాడామని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు తెలంగాణ సమస్యలపై ఎన్నడూ మాట్లాడలేదని గుర్తుచేశారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఓటు అడిగే హకు బీఆర్ఎస్కే ఉన్నదని స్పష్టంచేశారు. ఈ సమావేశంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, గాదరి కిశోర్, చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు తదితరులు పాల్గొన్నారు.