హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారత్-పాకిస్థాన్ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ ఎన్నారై యూఎస్ఏ డిమాండ్ చేసింది. బీఆర్ఎస్ ఎన్నారై యూఎస్ఏ ప్రతినిధి శ్రీధర్‌రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ ప్రస్థానం తెలియని వ్యక్తి ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం సిగ్గుచేటు అని మండిపడ్డారు. కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్.. తేజస్వీ వ్యాఖ్యలను ఖండించాల్సిందిపోయి.. సమర్థించడం ఏంటి? అని ప్రశ్నించారు.
పార్లమెంట్లో 8 మంది బీజేపీ, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నా.. రాష్ట్ర గౌరవం కాపాడటంలో పూర్తిగా విఫలమయ్యారని దుయ్యబట్టారు. ఈ అంశంలో సీఎం రేవంత్‌రెడ్డి మౌనం అనుమానాలకు తావిస్తున్నందని పేర్కొన్నా రు. అట్లాంటా, డల్లాస్, హ్యూస్టన్, ఆస్టిన్, లూవిల్లే, చికాగో, లాస్ ఏంజిల్స్, బే ఏరియా, డెట్రాయిట్, షార్లెట్, అలబామా నగరాల్లో బీఆర్ఎస్ ఎన్నారై డివిజన్ల ప్రతినిధులు సమావేశమై తెలంగాణ ఏర్పాటుపై తేజస్వీ వ్యాఖ్యలను ముక్తకంఠంతో ఖండించారు.