హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్ మెప్పు పొంది పదవులు పొందాలనే ఆరాటంతో కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ విద్యార్థి నాయకులు తుంగబాలు, బొమ్మెర రామ్మూర్తి, యూత్ నాయకులు వలమల్ల కృష్ణ, వీరబాబు ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిత్యం మద్యం మత్తులో ఉండే గజ్జెల కాంతం సోయిలేకుండా కేటీఆర్‌పై నోరుపారేసుకుంటున్నాడని మండిపడ్డారు. గతంలో బీఆర్ఎస్లో కొనసాగినప్పుడు ఆకాశానికెత్తిన నాయకులను నేడు రేవంత్ ప్రాపకం కోసం తూలనాడడం సరికాదన్నారు. దళిత సంఘాల ముసుగులో, ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్‌గా దందాలు, చందాలే లక్ష్యంగా పనిచేశారని ఆరోపించారు. గొప్ప నాయకులపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే గొప్పవాడినైపోతాననే భ్రమలో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గాంధీభవన్‌ను బూతుల భవన్‌గా మార్చిన ఘనత ఆయనకే దక్కిందని ఎద్దేవా చేశారు.