హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): ‘ప్రధాని మోదీజీ నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి బాధ్యులు ఎవరు’? అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు. లీకేజీతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, విద్యార్థి లోకానికి ఇది చీకటి రోజని పేర్కొన్నారు. ఈ మేరకు రోజురోజుకూ దేశం ఎటు పోతుంది? అని మంగళవారం ఎక్స్ వేదికగా నిలదీశారు. రాజస్థాన్‌లో నీట్ పేపర్ లీక్ అయిందని నిర్ధారించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ.. పరీక్షను రద్దు చేసినట్టు ప్రకటించడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో మైనర్ బాలికపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడి దురాగతాల నుంచి కోలుకోకముందే నీట్ లీకేజీ అత్యంత ఆందోళనకరమని మండిపడ్డారు. బీజేపీ పాలనలో ఇది మొదటిది కాదని, గతంలోనూ ఇలాంటి లీకులు జరిగాయని విమర్శించారు. బీజేపీ నేతలకు వ్యాపారాలు, ఎన్నికలు, మత కల్లోలాల మీద ఉన్న శ్రద్ధ విద్యార్థుల భవిష్యత్తు మీద లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ పాలనలో లీకేజీలు: తుంగ బాలు
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే నీట్ పరీక్ష పేపర్ లీక్ కావడం బాధాకరమని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు పేర్కొన్నారు. విద్యార్థులు రేయింబవళ్లు చదివి పరీక్షలు రాస్తుంటే, ప్రశ్నాపత్రాల లీకేజీలతో వారి శ్రమ వృథా అవుతుందని వాపోయారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి పరీక్షల నిర్వహనలో నిర్లక్ష్యం, అవినీతి, లీకేజీలు ఎక్కువ అయ్యాయని విమర్శించారు. ఒక్క నీట్ మాత్రమే కాకుండా అనేక పరీక్షలోనూ ఇదే తంతు జరుగుతుందని మండిపడ్డారు. పేపర్ లీకేజీ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
లోపాలు బట్టబయలు: నారాయణ
నీట్ పరీక్ష నిర్వహణలో అధికారుల లోపాలు మరోసారి బయటపడ్డాయని సీపీఐ జాతీయ నాయకుడు డాక్టర్ కే నారాయణ విమర్శించారు. ప్రశ్నాపత్రాల లీకేజీతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పాలకులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా విద్యార్థుల జీవితాలు అగమ్యగోచరంగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. లీకేజీలో పాత్ర ఉన్న ప్రైవేట్ విద్యాసంస్థలు, అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పరీక్షను పారదర్శకంగా, సజావుగా నిర్వహించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలం చెందాయని మండిపడ్డారు. విద్యారంగాన్ని నాశనం చేస్తున్న కార్పొరేట్ శక్తులను నియంత్రించాలని నారాయణ కోరారు.
విద్యార్థులతో చెలగాటం: ఏఐఎస్ఎఫ్
నీట్ పరీక్షలో రాజస్థాన్‌లో పేపర్ లీకేజీ ముమ్మాటికి ఎన్టీఏ అధికారుల వైఫల్యమేనని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, కార్యదర్శి పుట్టలక్ష్మణ్ ఆరోపించారు. మంగళవారం ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో వారు మాట్లాడుతూ.. విద్యార్థుల జీవితాలలో ఎన్టీఏ అధికారుల చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు.
డబుల్ ఇంజిన్ సరార్లో డబుల్ టైం ‘నీట్’ పేపర్ లీక్: సంతోష్‌నాయక్
కేంద్రంలోని బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్‌లో డబుల్ టైం నీట్ పేపర్ లీకైందని సేవాలాల్ విద్యార్థిసేన రాష్ట్ర అధ్యక్షుడు గుగులోత్ సంతోష్‌నాయక్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) కలిసి దేశంలోని లక్షలాది మంది విద్యార్థుల భవితవ్యాన్ని ప్రమాదంలోకి నెట్టాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా 22 లక్షల మంది నీట్ రాయగా, తెలంగాణ నుంచి 70 వేల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. ఎన్ఎంసీ నిబంధనలను సడలిస్తూ, వైద్య ప్రమాణాలను పాటించకుండా మెడికల్ కాలేజీలకు ఇష్టానుసారంగా అనుమతులు ఇస్తూ వైద్య విద్యను, ప్రజల ప్రాణాలను బీజేపీ ప్రభుత్వం ప్రమాదంలోకి నెట్టిందని విమర్శించారు.
‘నీట్’పై నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలి: వైద్య సంఘాల డిమాండ్
పేపర్ లీక్ వ్యవహారంపై నిష్పక్షపాతంగా విచారణ చేయాలని వైద్య సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు తెలంగాణ జూనియర్ వైద్యుల సంఘం, హెల్త్ కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్ఆర్డీఏ), ఫైమా డాక్టర్ల అసోసియేషన్ మంగళవారం విడుదల చేసిన వేర్వేరు ప్రకటనల్లో తీవ్రంగా ఖండించాయి. పేపర్ లీక్ మాఫియా కారణంగా నీట్ యూజీ-2026 ప్రవేశ పరీక్ష రాసిన లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తంచేశాయి.