హైదరాబాద్, మే 16(నమస్తే తెలంగాణ): అన్ని రకాల వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సంఘం అధ్యక్ష, కార్యదర్శులు సుదర్శన్‌రావు, సాగర్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం కేవలం సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పినట్టు ప్రచారం జరుగుతున్నదని, దీనిపై స్పష్టమైన ప్రకటన విడుదల చేయాలని కోరారు. బోనస్ చెల్లించని పక్షంలో రైతాంగాన్ని కూడగట్టి పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో వడ్లకు క్వింటాల్‌కు రూ. 500 బోనస్ ఇస్తామని ప్రకటించిందని, కానీ ఇప్పుడు కేవలం సన్న వడ్లకు మాత్రమే ఇస్తామనడం విడ్డూరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు 80శాతం దొడ్డు వడ్లను పండిస్తే కేవలం 20శాతం మాత్రమే సన్న వడ్లును పండిస్తారని తెలిపారు. ఇందులో అత్యధికం సన్న, చిన్నకారు రైతులే ఉంటారని వాపోయారు. రైతాంగానికి నష్టం జరగకుండా అన్ని రకాల వడ్లకు ఒకే రకంగా బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు. యాసంగి పంటకు కూడా బోనస్‌ను వర్తింపజేయాలని కోరారు.