ఉస్మానియా యూనివర్సిటీ, మే 1: బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్చార్జి క్రిశాంక్‌ను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ హాస్టళ్ల మూసివేతపై సోషల్ మీడియాలో ఫేక్ సర్క్యులర్లు ఉంచారంటూ కేసు నమోదు చేసి ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
తన సంతకం ఫోర్జరీ చేయడంతోపాటు, ఫేక్ సర్క్యులర్ ప్రచారం చేసిన క్రిశాంక్, ఇతర బీఆర్ఎస్వీ నాయకులపై చర్యలు తీసుకోవాలని చీఫ్ వార్డెన్ మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనపై ఐపీసీ 469, 465, 468, 417, 471, 505 (1) (బీ),(సీ) సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన ఓయూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఎన్నికల ప్రచారంలో పాల్గొని కొత్తగూడెం నుంచి హైదరాబాద్ వైపు వస్తుండగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్గేట్ వద్ద నల్గొండ పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ తరలించారు. అనంతరం క్రిశాంక్‌ను ఓయూ పోలీసులకు అప్పగించగా, క్రిశాంక్‌ను వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు.
వైద్య పరీక్షలు పూర్తయిన అనంతరం ఈస్ట్‌మారేడ్‌పల్లిలోని మెజిస్ట్రేట్ నివాసానికి తరలించేందుకు అన్నీ సిద్ధం చేశారు. కానీ మెజిస్ట్రేట్ అందుబాటులో లేకపోవడంతో అప్పటి వరకు క్రిశాంక్‌ను నల్లకుంట పోలీస్‌స్టేషన్‌లో ఉంచినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. క్రిశాంక్ వాంగ్మూలాన్ని నమోదు చేసిన అనంతరం సాయంత్రం 5.40నిమిషాల సమయంలో అరెస్టు విషయాన్ని కుటుంబసభ్యులకు సమాచారం అందించినట్టు తెలిసింది. రిమాండ్ రిపోర్టులో క్రిశాంక్‌పై 2011 నుంచి నమోదైన దాదాపు 14 కేసులూ బనాయించడం గమనార్హం.
డీజీపీ సమాధానం చెప్పాలి
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి భయంతోనే దాడులు, దౌర్జన్యాలు, పార్టీ ఫిరాయింపులకు తెరలేపారు. కాంగ్రెస్ గెలవకపోతే సీటుకు ఎసరు వస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్ని వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నాడు. బీఆర్ఎస్ నేతలపై, యూట్యూబ్ చానళ్లపై అక్రమ కేసులు బనాయించి బెదిరింపులకు పాల్పడుతున్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్చార్జి క్రిశాంక్ అరెస్టుతో కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకం పరాకాష్టకు చేరింది. క్రిశాంక్ అరెస్టుపై డీజీపీ సమాధానం చెప్పాలి. లేనిపక్షంలో ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం.
– మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి
క్రిశాంక్‌ను విడుదల చేయాలి
బీఆర్ఎస్ను రాజకీయంగా ఎదుర్కోలేక ఆ పార్టీ నాయకులను అరెస్టులతో బెదిరించి ఎన్నికల్లో లబ్ధిపొందాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. విద్యార్థుల సమస్యలపై ప్రశ్నించడం నేరం కాదు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుంది. అక్రమంగా అరెస్ట్ చేసిన క్రిశాంక్, నాగేందర్‌ను తక్షణమే విడుదల చేయాలి.
-ఉప్పు కృష్ణ, విద్యార్థి సంఘం నాయకుడు, చౌటుప్పల్
అన్యాయం.. అక్రమం.. దుర్మార్గం
ఎక్స్ వేదికగా కేటీఆర్
గల్లీ కాంగ్రెస్ వైఫల్యాలపై.. ఢిల్లీ బీజేపీ అరాచకాలపై.. గళమెత్తినందుకే ఈ దౌర్జన్యమని, ప్రశ్నించినందుకే ఈ దుర్మార్గమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు మండిపడ్డారు. మన్నె క్రిశాంక్ అరెస్ట్ అన్యాయం, అక్రమం, దుర్మార్గమని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ అంటే ఒక ఉద్యమ గొంతుక అని, ఒక చైతన్య ప్రతీక అని, యువతరానికి ప్రతిబింబమని బుధవారం ఎక్స్ వేదికగా కేటీఆర్ స్పందించారు.
కాంగ్రెస్ – బీజేపీ కలిసి చేస్తున్న ఈ కక్ష సాధింపులకు మూల్యం చెల్లించక తప్పదని స్పష్టం చేశారు. ఈ నియంతృత్వ.. నిర్బంధాలకు.. తెలంగాణ ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదన్నారు. నాడు ఎమర్జెన్సీ చూశాం.. నేడు అప్రకటిత ఎమర్జెన్సీ చూస్తున్నామని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాసినందుకు ఆనాడు పాలక పక్షానికి పట్టిన గతే రేపు కాంగ్రెస్ – బీజేపీలకు పట్టడం ఖాయం.. తథ్యమని కేటీఆర్ పేర్కొన్నారు.