హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): మహిళా కలెక్టర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగ్గారెడ్డిని తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్ సోషల్‌మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. జగ్గారెడ్డి అనుచిత వ్యాఖ్యలపై మహిళా కమిషన్, ఐఏఎస్ సంఘాలు, మహిళా సంఘాలు కూడా స్పందించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణభవన్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగ్గారెడ్డి అణగారిన వర్గానికి చెందిన మహిళా కలెక్టకర్ను అవమానించడమే కాకుండా ప్రెస్‌మీట్ పెట్టి మూడేండ్ల క్రితం నాటిదని చెప్పుకోవడానికి సిగ్గుండాలని మండిపడ్డారు. మూడేండ్ల క్రితం సంగారెడ్డి జిల్లాకు మహిళా కలెక్టర్ రాలేదని, మూడు నెలల క్రితమే ఆయన ఈ అనుచిత వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. కలెక్టర్‌ను తిట్టానని స్వయంగా జగ్గారెడ్డే బహిరంగసభలో చెప్పుకున్నారంటే, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఐఏఎస్ అధికారులను, మహిళలను అలాగే తిట్టాలని ప్రోత్సహించినట్టే కదా! అని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ఉన్నవారిని బట్టలు విప్పి కొడతానని వ్యాఖ్యానించడం ద్వారా జగ్గారెడ్డి మహిళలను మరోసారి అవమానించారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
శంకర్‌పై కేసుకు ఆధారాలేమిటి?
జగ్గారెడ్డి అనుచిత వ్యాఖ్యలను ఎక్స్‌లో పోస్ట్ చేసినందుకు జర్నలిస్ట్ శంకర్ మీద ఏ ఆధారంతో కేసు నమోదు చేశారని సతీశ్‌రెడ్డి పోలీసులను ప్రశ్నించారు. వీడియో మూడేండ్ల కిందటిదని పోలీసులు ఎలా ధ్రువీకరించారని, దీనిపై డీజీపీ, సంగారెడ్డి ఎస్పీ, సీఐ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తప్పుడు కేసులు పెట్టిన అధికారులను వదిలిపెట్టేదిలేదని, వారు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా వాస్తవాలే మాట్లాడుతున్నదని, కేసీఆర్, కేటీఆర్ ఏనాడూ ఫేక్ వార్తలు, మార్ఫింగ్ చేయాలని నేర్పలేదని పేర్కొన్నారు.