హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): సింగరేణి కార్మికులను సీఎం రేవంత్‌రెడ్డి సర్కారు నమ్మించి నట్టేట ముంచిందని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. సింగరేణి కార్మికుల చెమటను, కష్టార్జితాన్ని దోచుకున్నదని ఒక ప్రకటనలో విమర్శించారు. 2023-24 సంవత్సరానికి సింగరేణి సంస్థ రూ.4,701 కోట్ల నికర లాభం ఆర్జిస్తే, కేవలం రూ.796 కోట్లు కార్మికులకు ఇచ్చి 33 శాతం ఇచ్చామని అబద్ధాలు చెప్పడం దుర్మార్గమని పేర్కొన్నారు. అందులో రూ.2,289 కోట్లను ఎందుకు దాచారని ప్రశ్నించారు. కేవలం రూ.2,412 కోట్లను లాభంగా చూపించి అందులో నుంచి 33 శాతం ఇచ్చి గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు.
ప్రభుత్వ దగా వల్ల ఒకో కార్మికుడు రూ.1.80 లక్షల చొప్పున కోల్పోతున్నాడని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి చెప్తున్నట్టు లాభాల్లో 33 శాతం చొప్పున కార్మికులకు ఇస్తే.. 33 శాతం (4,701 కోట్ల) వాటా కింద రూ.3.70 లక్షలు వచ్చేవని తెలిపారు. సరారు కుట్రపూరితంగా రూ.1.90 లక్షలే ఇచ్చి చేతులు దులుపుకున్నదని విమర్శించారు. నిరుడు సంస్థకు వచ్చిన నికర లాభం రూ.2,222 కోట్ల నుంచి నిరుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికులకు 32 శాతం వాటా కింద రూ.700 కోట్లను కార్మికులకు పంచిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నట్టు వారికి 33 శాతం బోనస్ ఇవ్వలేదని, ఇచ్చింది కేవలం 16.90 శాతం వాటా మాత్రమేనని తెలిపారు.