మారేడుపల్లి, జూలై 19 : అక్రమాలు, తప్పిదాలపై ప్రశ్నిస్తే కేసులు పెట్టడమేంటి? అని బీఆర్ఎస్ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి బంధువులు చేస్తున్న కుంభకోణాలపై ‘ఏ టు జెడ్’ పేరుతో హోర్డింగ్ ఏర్పాటుచేసిన కల్యాణ్సందీప్, సాయికిరణ్‌ను ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసి శనివారం మారేడుపల్లి పోలీసులకు అప్పగించారు.
విషయం తెలుసుకున్న మన్నె క్రిశాంక్.. బీఆర్ఎస్ లీగల్సెల్తో కలిసి మారేడుపల్లి పోలీస్‌స్టేషన్ వెళ్లి ఇన్స్పెక్టర్తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి పాలనలో జరుగుతున్న అవినీతిని ఎండగట్టినందుకు తమపై కేసులు నమోదు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి కుటుంబీకులు చేస్తున్న అవినీతి, కుంభకోణాలు వాస్తవం కాదా? అని ధ్వజమెత్తారు. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రూ.300 కోట్లకు సోద కంపెనీ యజమాని, సీఎం బావమరిదికి అప్పగించడంపై కేటీఆర్ ప్రశ్నించడం తప్పా? అని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటామని హెచ్చరించారు.