ఫర్టిలైజర్‌సిటీ, జూలై 15: బీఆర్ఎస్ సోషల్ మీడియా యాక్టివిస్ట్ దుర్గం శశిధర్‌గౌడ్ అలియాస్ నల్లబాలుకు మంగళవారం గోదావరిఖనిలోని అదనపు జిల్లా న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్స్ ఖాతాలో బీఆర్ఎస్ చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేయడంతో శశిధర్‌పై కరీంనగర్, గోదావరిఖని, రామగుండం, హైదరాబాద్‌లో ఐదు వేర్వేరు కేసులను నమోదు చేశారు. సుమోటోగా కేసు నమోదుచేసిన కరీంనగర్ సైబర్‌క్రైం పోలీసులు జూన్ 29న అరెస్టు చేశారు. 30న శశిధర్‌ను కరీంనగర్ కోర్టులో హాజరుపరుచగా, రిమాండ్ విధించారు. ఈక్రమంలో గోదావరిఖనిలోని అదనపు జిల్లా న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.
ఎఫ్ఐఆర్పై విమర్శలు
అధికార పార్టీ ఒత్తిడి మేరకు పోలీసులు అత్యుత్సాహంతో భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లో లేని సెక్షన్లను సైతం శశిధర్‌పై నమోదు చేశారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. బీ352(2) సెక్షన్ చట్టంలో లేకున్నా ఎఫ్ఐఆర్ (146/2025)లో నమోదు చేయడంపై సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.