హనుమకొండ, మే 27: హనుమకొండ చౌరస్తా కేంద్రంగా చిరు వ్యాపారం చేసుకుంటున్న వారి దుకాణాలను ముందస్తు సమాచారం లేకుండా మంగళవారం బల్దియా అధికారులు, ట్రాఫిక్ పోలీసులు కూల్చివేశారు. 40కి పైగా షాపులను కూల్చివేయగా రూ. 50వేల నుంచి రూ.2లక్షల వరకు నష్టం జరిగిందని దుకాణాదారులు కన్నీటి పర్యంతమయ్యారు.
‘ఏండ్లుగా ఇక్కడ దుకాణాలు నడుపుకుంటూ జీవనోపాధి పొందుతున్నాం.. మా బతుకులు ఆగం చేయొద్దని వేడుకొన్నప్పటికి కనికరం చూపలేదు’ అని విలపించారు. రోజూ కూరగాయలు అమ్ముకుంటేనే కుటుంబ పోషణ జరుగుతుందని, ఇప్పుడు ఏమి చేయాలో అర్థం కావడం లేదని ఓ మహిళ విలపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం, బల్దియా అధికారులు చిరు వ్యాపారులపై దాడులు చేసి వ్యాపార సముదాయాలను కూల్చివేయడాన్ని బీఆర్ఎస్ చిరు వ్యాపారుల సంఘం నాయకులు నాయిని రవి, ఎండీ ఇస్మాయిల్ ఖండించారు. అధికారులు, ప్రజాప్రతినిధులను కలిసి చిరు వ్యాపారుల సమస్యలు, జీవనోపాధి విషయమై చర్చిస్తున్నప్పటికీ పట్టించుకోకుండా దాడులు చేయడం సరికాదని తెలిపారు. చిరువ్యాపారుల ఉపాధి, భద్రత చట్టం ఉన్నా వారి హకులను పాలకులు కాలరాస్తున్నారని మండిపడ్డారు.