హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ) /(స్పెషల్ టాస్క్ బ్యూరో) రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంలో ఘోరమైన వైఫల్యం.. అప్పులు చేయడంలో తిరుగులేని రికార్డు.. ప్రజల తలసరి ఆదాయాన్ని మింగేసే అసమర్థ విధానాలు.. మిగులు రాష్ర్టాన్ని లోటు బడ్జెట్లోకి తోసేసిన చేతగానితనం.. తరిగిపోయిన రెవెన్యూ రాబడులు.. నేలను చూస్తున్న జీఎస్డీపీ వృద్ధిరేటు.. తరలిపోతున్న కంపెనీలు.. పడిపోయిన భూముల విలువ.. పడకేసిన పాలన.. నేరాలకు అడ్డాగా రాష్ట్రం.. దరిచేరని సంక్షేమం.. అల్లాడిపోతున్న ప్రజానీకం..
ఇవీ రెండున్నరేండ్ల రేవంత్ పాలనలో తెలంగాణలో కనిపిస్తున్న దుర్భర పరిస్థితులు. కేసీఆర్ పదేండ్ల పాలనలో సంక్షేమం, అభివృద్ధి అనే జోడెడ్లతో రెండంకెల వృద్ధిని సాధిస్తూ అన్ని రంగాల్లో రాకెట్ వేగంతో దూసుకుపోయిన ఒకప్పటి సుసంపన్న తెలంగాణ.. రేవంత్ పాలనలో ఆగమాగమయ్యిం దని తెలంగాణవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 30 నెలల పాలనలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం 30 వైఫల్యాలు ఇవేనంటూ మండిపడుతున్నారు.

ఏదైనా రాష్ట్రం ఆర్థికాభివృద్ధి సాధించిందో లేదో తెలియజేసే సూచిక తలసరి ఆదాయం. రాష్ట్రంలో ఒక వ్యక్తి సగటున ఏడాదికి సంపాదించే ఆదాయాన్ని తలసరిగా పిలుస్తారు. ఒక రాష్ట్రం ఎంత ధనికమైనదో, అకడి ప్రజల జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఇది కొలమానం.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు (2014-15)లో తలసరి ఆదాయం రూ.1,24,104గా నమోదైంది. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్.. అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెడ్లలా నడిపించారు. తలసరి ఆదాయంలో దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో రాష్ట్రాన్ని నిలబెట్టారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలన ముగిసే సమయానికి అంటే 2023-24 నాటికి తలసరి ఆదాయం రూ.3,47,299కు రికార్డుస్థాయిలో పెంచారు. అలా పదేండ్లలో రాష్ట్ర తలసరి ఆదాయం 179.84 శాతం పెరిగింది. అంటే సగటు ఏడాదికి 17.98 శాతం వృద్ధిరేటు పెంచారు. అయితే, రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన చేపట్టిన 30 నెలల కాలంలో తెలంగాణ తలసరి ఆదాయ ర్యాంకు పడిపోయింది. తలసరిలో సగటున ఏడాదికి వృద్ధిరేటు 8.25 శాతానికి దిగజారింది. గణాంకాల ప్రకారం.. 2025-26 నాటికి రాష్ట్ర తలసరి రూ.4,18,931 మాత్రమే.

ఏదైనా రాష్ట్ర ఆర్థిక బలాన్ని, నిర్ధిష్ట కాలంలో ఉత్పత్తి అయిన వస్తుసేవలను అంచనా వేసే అతి ముఖ్యమైన కొలమానం రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్డీపీ). రాష్ట్ర సరిహద్దుల లోపల సృష్టించబడిన సంపద లేదా ఆదాయాన్ని జీఎస్డీపీగా పేర్కొంటారు.
వ్యవసాయం, పరిశ్రమలు, ఐటీ, సేవారంగాల పురోగతి ఆధారంగా ఈ సంపద పెరుగుతుంది. ఏ రాష్ట్రంలోనైనా జీఎస్డీపీ వేగంగా పెరిగితే అకడ పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరిగి ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉన్నదని అర్థం. కేసీఆర్ పదేండ్లపాలనలో సగటున ఏడాదికి 18.99 శాతం వృద్ధి రేటును నమోదు చేసిన జీఎస్డీపీ.. రేవంత్ రెండున్నరేండ్ల పాలనలో వృద్ధిరేటు సగటున 8.68 శాతానికి దిగజారిపోయింది. 2014-15లో ప్రస్తుత ధరల వద్ద రూ.5.05 లక్షల కోట్లుగా నమోదైన జీఎస్డీపీ.. 2023-24 నాటికి రూ.14.64 లక్షల కోట్లకు చేరింది. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన 30 నెలల కాలంలో (2026 మే నాటికి) రాష్ట్ర ఆర్థిక వృద్ధి వేగం గణనీయంగా మందగించింది. బడ్జెట్లు, సామాజిక ఆర్థిక సర్వే గణాంకాల ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి తెలంగాణ జీఎస్డీపీ కేవలం రూ.17.82 లక్షల కోట్లకు మాత్రమే పరిమితమైంది. గతంలో డబుల్ డిజిట్ (రెండంకెల) వృద్ధిరేటుతో దూసుకుపోయిన జీఎస్డీపీ.. ప్రస్తుత కాంగ్రెస్ హయాంలో ఏడాదికి సగటున 8.4 శాతానికి దిగజారిపోయింది.

ఆర్థికాభివృద్ధి బాగుంటేనే ఆమ్దానీ పెరుగుతుంది. ఆమ్దానీ పెరిగితేనే బడ్జెట్ పరిమాణం ఎగబాకుతుంది. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలు కేసీఆర్ పదేండ్ల పాలనలో దాదాపు మూడు రెట్లు పెరిగాయి. అయితే, కాంగ్రెస్ 30 నెలల పాలనలో బడ్జెట్ ప్రతిపాదనలు అంతకంతకు తగ్గుతూవస్తున్నాయి.

కేసీఆర్ పాలనలో ఎప్పుడూ కూడా మిగులు బడ్జెట్ ఉండగా, రేవంత్‌రెడ్డి పాలనలో లోటు బడ్జెట్ నమోదైంది. రాష్ట్ర ఏర్పాటు సమయంలో అంటే 2014-15నాటికి బడ్జెట్ ప్రతిపాదనలు రూ.1,00,637 కోట్లుగా ఉండగా, 2023-24నాటికి ఇది రూ. 2.9 లక్షల కోట్లకు చేరింది. 2026-27 నాటికి బడ్జెట్ ప్రతిపాదనలు రూ. 3.24 లక్షల కోట్లకు చేరింది. కేసీఆర్ పదేండ్ల పాలనలో బడ్జెట్ పరిమాణం 190 శాతం మేర పెరగ్గా.. కాంగ్రెస్ రెండున్నరేండ్ల పాలనలో ఇది 11.72 శాతానికే పరిమితమయ్యింది.

రాష్ట్ర వార్షిక రెవెన్యూ రాబడుల వృద్ధి రేటు కేసీఆర్ హయాంలో సగటున ఏడాదికి 32.42 శాతం నమోదుతో రెండంకెల స్థాయిలో దూసుకుపోగా, ప్రస్తుతం రేవంత్‌రెడ్డి పాలనలో రుణాల భారం, మారుతున్న ఆర్థిక సమీకరణల వల్ల వృద్ధి రేటు సింగిల్ డిజిట్‌కు (2.42 శాతానికి) పరిమితమైంది. 2014-15లో రాష్ట్ర రెవెన్యూ రాబడులు రూ. 51,042 కోట్లు మాత్రమే ఉండగా, బీఆర్ఎస్ పాలన ముగిసే సమయానికి ఈ రాబడులు బడ్జెట్ అంచనాల ప్రకారం.. రికార్డు స్థాయిలో రూ. 2,16,567 కోట్లకు చేరాయి. ఈ పదేండ్లకాలంలో మొత్తం రాబడుల వృద్ధి సుమారు 324 శాతంగా నమోదైంది. అంటే ఏడాదికి సగటున రికార్డుస్థాయిలో 32.42 శాతం వృద్ధి రేటు సాధించి, రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరిగింది. రేవంత్ రెడ్డి పాలనలోని 30 నెలల కాల పరిమితిని పరిశీలిస్తే, బడ్జెట్ అంచనాలు, కాగ్ నివేదికల ప్రకారం 2025-26 నాటికి రెవెన్యూ రాబడులు సుమారు రూ. 2,29,721 కోట్లకు పరిమితమయ్యాయి

కేసీఆర్ పాలనలో మౌలిక వసతుల కల్పన, కాళేశ్వరం వంటి భారీ సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణంపై పెద్ద ఎత్తున దృష్టి సారించారు. 2014-15లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి బడ్జెట్ నాటికి మూలధన వ్యయం కేవలం రూ.11,154 కోట్లుగా నమోదైంది.

బీఆర్ఎస్ పాలన ముగిసే సమయానికి (2023-24 నాటికి) సాగునీటి రంగానికి నిధుల ప్రవాహం, మౌలిక సదుపాయాల విస్తరణతో వార్షిక మూలధన వ్యయం రికార్డు స్థాయిలో రూ. 37,525 కోట్లకు చేరింది. అలా పదేండ్లలో మూలధన వ్యయంలో వృద్ధిరేటు 236.42 శాతంగా నమోదైంది. ఇక, రేవంత్‌పాలనలో 2025-26 బడ్జెట్ అంచనాల ప్రకారం మూలధన వ్యయాన్ని రూ. 47,267 కోట్లుగా ప్రతిపాదించారు. రెండున్నరేండ్ల కాలంలో మూలధనవ్యయంలో పెరుగుదల కేవలం 25.96 శాతంగానే రికార్డయ్యింది.


సమైక్య పాలనలో చీకట్లో మగ్గిన తెలంగాణ.. కేసీఆర్ పాలనలో వెలుగు జిలుగులీనింది. కేసీఆర్ సర్కారు తెలంగాణ స్థాపిత విద్యుత్తు సామర్త్యాన్ని పెంచడానికి విద్యుత్తు ప్లాంట్లను, థర్మల్ స్టేషన్లను యుద్ధప్రాతిపదికన నిర్మించింది. అలా రాష్ట్రం తొలినాళ్లలో 7,778 మెగావాట్లుగా ఉన్న స్థాపిత విద్యుత్తు సామర్థ్యం.. 2023నాటికి 18,567 మెగావాట్లకు చేరింది. గత బీఆర్ఎస్ సర్కారు కృషి కారణంగా ఇప్పుడు అది 23,208 మెగావాట్లకు చేరింది.

30 నెలల పాలనలోనే రేవంత్ ప్రభుత్వం తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టేసింది. డిసెంబర్ 2023 నుంచి ఇప్పటివరకూ రేవంత్‌రెడ్డి సర్కారు రూ.4.14 లక్షల కోట్ల అప్పులు చేసి రికార్డు సృష్టించింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేండ్ల పాటుసాగిన బీఆర్ఎస్ పాలనలో అప్పులు రూ.4.7 లక్షల కోట్లుగా ఉన్నాయి.

ఇందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వారసత్వంగా వచ్చిన రుణాలు రూ.69,000 కోట్లు కూడా కలిసి ఉన్నాయి. బీఆర్ఎస్ చేసిన బడ్జెటేతర అప్పులు కేవలం రూ.1.1 లక్షల కోట్లు మాత్రమే. ఎఫ్ఆర్బీఎం పరిమితికి లోబడి బీఆర్ఎస్ చేసిన అప్పులో సగానికన్నా ఎక్కువగా కాంగ్రెస్ 30 నెలల్లోనే తెచ్చేసింది. ఇక బడ్జెటేతర (నాన్-ఎఫ్ఆర్బీఎం) అప్పుల విషయానికి వస్తే.. గత ప్రభుత్వం చేసిన దానికి రెండింతల అప్పును కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండున్నరేండ్లలోనే చేసి చూపించింది.

ప్రభుత్వ రథం ముందుకు సాగాలంటే ఉద్యోగి అనే సారథే కీలకం. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాల సవరణ చేస్తేనే ఉద్యోగి పని ఉత్పాదకత పెరుగుతుంది. దీన్ని గమనించిన కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగుల వేతనాలను మొత్తంగా 73 శాతం పెంచింది. 2015లో 43 శాతం ఫిట్మెంట్తో ఇంక్రిమెంట్‌ను వర్తింపజేసింది. సీఆర్ బిశ్వాల్ కమిటీ.. కేవలం 7.5 శాతం ఫిట్‌మెంట్‌ను సిఫారసు చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీని ప్రకటించింది. కరోనా పీడించినా, ఆర్థికంగా వెలుసుబాటు లేకపోయినా.. ప్రభుత్వంపై ఏడాదికి రూ.12,595 కోట్ల అదనపు భారం పడినా.. ఉద్యోగులతో గల పేగుబంధాన్ని దృష్టిలో ఉంచుకుని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 73 శాతం మేర వేతనాలు పెంచింది. రేవంత్ ప్రభుత్వం ఇప్పటివరకూ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించలేదు.

గత పదేండ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో ఐటీ రంగంలో ఉద్యోగావకాశాలు గణనీయంగా పెరగగా.. కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత సీన్ రివర్స్ అయింది. రాష్ట్రంలో 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఐటీ రంగంలో 3,71,774 మంది ఉపాధి పొందారు. 2023-24 నాటికి ఈ సంఖ్య 9,46,285కు చేరింది.

అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం విధానపరమైన వైఫల్యాల కారణంగా ఐటీ ఉద్యోగాల్లో తగ్గుదల రికార్డయ్యింది. 2024-25లో ఐటీ రంగంలో 9,39,054 మంది ఉద్యోగులుగా ఉన్నారని అసెంబ్లీలో ప్రభుత్వమే వెల్లడించింది.

ఐటీ ఎగుమతులు ఎంత పెరిగితే, రాష్ట్ర ఖజానాకు అంత ఆమ్దానీ వస్తుంది. కేసీఆర్ పదేండ్ల పాలనలో ఐటీ ఎగుమతులు రాకెట్ వేగాన్ని తలపించాయి. రాష్ట్రం ఏర్పడిన సమయంలో 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.68,209 కోట్ల ఐటీ ఎగుమతులు జరగగా.. 2023 నాటికి ఐటీ ఎగుమతులు నాలుగు రేట్లు పెరిగి రూ.2,72,076 కోట్లకు చేరాయి.

అలా గత పదేండ్లలో ఐటీ ఎగుమతుల్లో 299 శాతం వృద్ధి రేటు నమోదైంది. అయితే, కాంగ్రెస్ పాలనలో ఐటీ ఎగుమతుల్లో వృద్ధి ఆశించిన స్థాయిలో కనిపించలేదు. 2024-25లో ఐటీ ఎగుమతులు రూ.3,12,941కి చేరుకొన్నట్టు గణాంకాల ద్వారా తెలుస్తున్నది.


రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత కొత్త పెట్టుబడులు గణనీయంగా పడిపోయాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు రూ.28,100 కోట్ల పెట్టుబడులు రాగా, 2024-25 అవి రూ.13,730 కోట్లకు పడిపోయాయి. ఈ భారీ క్షీణత కొత్త పరిశ్రమల విస్తరణపై తీవ్ర ప్రభావితం చూపుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. మరోవైపు 2024 జనవరి నుంచి 2025 అక్టోబర్ మధ్య 305 పరిశ్రమలు మూతపడ్డాయి.

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత ప్రముఖ కంపెనీలు ఇతర రాష్ర్టాలకు తరలివెళ్లిపోయాయి. కేసీఆర్ ప్రభుత్వంలో రాష్ట్రంలో భారీ పెట్టుబడికి ముందుకొచ్చిన తైవాన్ కంపెనీ ఫాక్స్‌కాన్ తమ విస్తరణకు తమిళనాడుకు తరలివెళ్లింది. రూ.15వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఆ రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో భారీ పెట్టుబడితో పాటు దాదాపు 14వేల ఉద్యోగాలను తెలంగాణ కోల్పోయినట్టయింది. కేన్స్ తమ సెమీ కండక్టర్ల పరిశ్రమను గుజరాత్‌కు తరలించింది.

బీఆర్ఎస్ హయాంలో సెమికండక్టర్ల యూనిట్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన ఈ సంస్థ.. గుజరాత్‌లోని సనంద్‌లో రూ.3,300 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు ప్రకటించింది. మెటీరియల్ సైన్సెస్‌లో ప్రపంచ అగ్రగామిగా ఉన్న కార్నింగ్ కంపెనీ హైదరాబాద్‌ను కాదని తమిళనాడులో రూ.1000కోట్లతో కొత్త ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు తరలిపోయింది. ఇదే బాటలో ప్రీమియర్ ఎనర్జీస్ సైతం ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు తరలివెళ్లింది. దీంతో రూ.1700 కోట్ల పెట్టుబడి, 2000 ఉద్యోగాలను తెలంగాణ కోల్పోయినట్టు అయింది.

ప్రతీ వర్షపు బొట్టును ఒడిసి పట్టాలనే సంకల్పంతో గత కేసీఆర్ ప్రభుత్వం వాగుల పునరుజ్జీవం పథకాన్ని ప్రత్యేకంగా చేపట్టింది. రాష్ట్రంలోని అన్ని వాగులపై కలిపి సుమారు రూ.3,850 కోట్లతో రెండు విడతల్లో 1,200 చెక్‌డ్యామ్‌లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఫేజ్ -1లో 570కుపైగా పూర్తిసింది. తద్వారా 1.25లక్షల ఎకరాలకు సాగునీటి భరోసా లభించింది.

సెకండ్ ఫేజ్‌లో 565 చెక్‌డ్యామ్‌లను నిర్మించేందుకు సైతం ప్రణాళికలను సైతం చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఈ చెక్‌డ్యామ్‌ల ప్రణాళికలన్నీ అటకెక్కాయి. గత బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన చెక్‌డ్యామ్‌లను సైతం ధ్వంసం చేస్తున్న పరిస్థితి కాంగ్రెస్ పాలనలో నెలకొనడం గమనార్హం.
బీఆర్ఎస్ పాలనలో రాష్ర్టానికి క్యూకట్టిన వేలాది పరిశ్రమలు.. కాంగ్రెస్ పగ్గాలు చేపట్టగానే ముఖంచాటేశాయి. రాష్ర్టానికి లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయంటూ రేవంత్ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. గత పన్నేండేండ్ల గణాంకాలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

2014లో రాష్ర్టానికి 174 పరిశ్రమలు రాగా, 2015 నుంచి పరిశ్రమలు తెలంగాణకు క్యూ కట్టాయి. ఇక 2021-22లో 4,008 పరిశ్రమలు తెలంగాణకు తరలిరాగా, 2024-25లో ఈ సంఖ్య సగానికి తగ్గడం గమనార్హం. మొత్తంగా బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో రాష్ర్టానికి 23 వేల కంపెనీలు రాగా, 17 లక్షల మందికి ఉపాధి లభించింది.


సమైక్య పాలకుల నిర్లక్ష్యంతో తెలంగాణ ప్రాంతంలో వరి సాగు, ధాన్యం ఉత్పత్తి చాలా తక్కువగా ఉండేది. తిండికి కూడా సరిపోను పంట ఉత్పత్తి అయ్యేదికాదు. అయితే, రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ సర్కారు చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు ఇతర నీటిపారుదల అభివృద్ధి విధానంతో, అమలు చేసిన రైతు, వ్యవసాయ సంక్షేమ పథకాలతో వరి సాగు భారీగా పెరిగింది. 2014తో పోల్చితే 2023లో 278 శాతం ధాన్యం ఉత్పత్తి పెరిగింది.


బీఆర్ఎస్ హయాంలో నిర్మిరామంగా రైతులకు ఎలాంటి ఇబ్బందిలేకుండా సాగిన ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ఓ ప్రహసనంగా మారింది. కొనుగోళ్లు సైతం అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. బీఆర్ఎస్ పదేవడ్ల పాలనలో 442శాతం ధాన్యం కొనుగోళ్లు పెరగ్గా కాంగ్రెస్ రెండున్నరేండ్ల పాలనలో కేవలం 7శాతం మాత్రమే వృద్ధి నమోదు కావడం కాంగ్రెస్ వైఫల్యానికి నిదర్శనంగా నిలుస్తున్నది.

రైతులను రుణవిముక్తి చేయాలనే సంకల్పంతో బీఆర్ఎస్ సర్కారు రెండుసార్లు వ్యవసాయ రుణాలను మాఫీ చేసింది. 2014లో తొలిసారి, 2018లో రెండోసారి చేసింది. ఇలా రెండుదఫాల్లో రైతులకు సంబంధించి రూ. 29,144 కోట్ల రుణాలను మాఫీ చేసింది. అధికారంలోకి వస్తే రైతులకు రూ. 2 లక్షల వరకు రుణాలను మాఫీ చేస్తామని కాంగ్రెస్ సైతం ప్రకటించింది. 32వేల కోట్లు రుణాలను మాఫీ చేస్తామని గొప్పలకు పోయింది. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 20,616 కోట్లను మాత్రమే మాఫీ చేసి మిగిలినరైతులకు మొండి చేయి చూపించింది.

బీఆర్ఎస్ సర్కారు రుణమాఫీ 29,144 కోట్లు
కాంగ్రెస్ సర్కారు రుణమాఫీ 20,616 కోట్లు
మత్స్యకారులకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు రాష్ట్రంలో చేపల ఉత్పత్తి పెంచేందుకు కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మకమైన ఉచిత చేపపిల్లల పంపిణీ పథకం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్వీర్యమైంది.
2016-17 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించిన ఈ పథకం 2023-24 వరకు ఏడేండ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో 550 కోట్ల చేప, రొయ్య పిల్లలను విడుదల చేసి వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని మత్స్యకారులకు సమకూర్పించింది. అలాంటి ప్రతిష్టాత్మకమైన పథకం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిర్లక్ష్యానికి గురైందనే విమర్శలున్నాయి.
పలితంగా 5 లక్షల మత్స్యకార కుటుంబాల ఉపాధి ప్రమాదంలో పడింది. రాష్ట్రంలో 6వేల మత్స్యకార సొసైటీలు ఉన్నాయి. ఇందులో అధికారికంగా 3.75 లక్షల మంది సభ్యులున్నారు. వీరంతా కేసీఆర్ హయాం లో ఉచిత చేపపిల్లల పంపిణీ పథకంలో జీవనోపాధి పొందారు ఈ పథకం ద్వారా సుమారు 23 లక్షల టన్నుల చేపలు ఉత్పత్తి చేసి, వీటి ద్వారా రూ.32వేల కోట్ల సంపద సృష్టి జరిగి, తద్వారా మత్స్యకారులు అర్థికంగా బలోపేతమయ్యారు. ఇలాంటి పథకం కాంగ్రెస్ పాలనలో నామమాత్రంగా మారింది.

కేసీఆర్ పాలనలో శాంతిభద్రతలకు స్వర్గధామంగా ఉన్న తెలంగాణ.. నేడు శాంతిలేక, ప్రజలకు ధన, మాన, ప్రాణాలకు భద్రత లేక నేరాలకు అడ్డాగా కొనసాగుతున్నది. నాడు కట్టుదిట్టమైన శాంతిభద్రతలుంటే.. కాంగ్రెస్ అధికారం చేపట్టి నాటి నుంచి రాష్ట్రంలో రోజురోజుకూ శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయి.

రోజుకు 10 రేప్‌లు.. 4 కిడ్నాప్‌లు 3 హత్యలు జరుగుతుంటే.. హోంమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ చోద్యం చూస్తున్నారు. రాష్ట్రంలో మహిళల పట్ల నేరాల్లో 2025లో 3.16శాతం పెరుగుదల కనిపించింది. పట్టపగలే దోపిడీలో, నడిరోడ్లపై హత్యలు తెలంగాణలో సర్వసాధారణం అయ్యాయి. 18 శాతం పెరిగిన మిస్సింగ్ కేసులు, 23 శాతం పెరిగిన నమ్మకద్రోహం కేసులు, 24శాతం పెరిగిన డెకాయిటీ కేసులు ప్రజలను కలవర పెడుతున్నాయి. 2023లో జనవరి నుంచి నవంబర్ వరకూ 2,13,121 కేసులు నమోదైతే.. 2024లో 2,34,158 కేసులు, 2025లో 2,28,695 కేసులు నమోదయ్యాయి. 2023లో ఐపీసీ క్రైమ్స్ కేవలం 70,469 నమోదైతే.. 2024లో 1,69,477 కేసులు, 2025లో 1,67,018 కేసులు నమోదయ్యాయి. ఈ లెక్కలే తెలంగాణలో రెండున్నరేండ్ల నుంచి శాంతిభద్రతలు అదుపులోకి రావడంలేదని చెప్పేందుకు ఉదాహరణలుగా నిలుస్తున్నాయి.
కాంగ్రెస్ పాలనలో రోజుకు.. రేప్‌లు: 10, కిడ్నాప్‌లు: 4, హత్యలు: 3
తెలంగాణలో ఆడబిడ్డల రక్షణ కోసం అప్పటి సీఎం కేసీఆర్ ‘షీటీమ్స్’ వ్యవస్థను ఏర్పాటు చేస్తూ సంచలనాత్మక నిర్ణయం తీసుకొన్నారు. ఎవరైనా ఆకతాయులు ఆడబిడ్డల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, వేధించినా, లైంగికంగా వేధింపులకు గురిచేసినా.. ఫిర్యాదు చేసిన వెంటనే తక్షణ చర్యలు తీసుకోవడానికి దీన్ని ఏర్పాటు చేశారు.
మొదట హైదరాబాద్‌లో పైలెట్ ప్రాజెక్టుగా ఉన్న షీటీమ్స్.. అనూహ్య ఫలితాలు ఇవ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేశారు. అయితే కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తర్వాత తెలంగాణలో మహిళలపట్ల నేరాలు దారుణంగా పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోతుంది. పోకిరీలను కట్టడి చేయడంలో పోలీసులు విఫలమవుతుండటంతో షీటీమ్స్‌కు వచ్చే కేసులు సంఖ్య దారుణంగా పెరిగిపోతున్నది. 2023లో 10,766 కేసులు షీటీమ్స్‌లో నమోదైతే.. 2024 నాటికి ఆ కేసుల సంఖ్య 13,405కి పెరిగింది. అంటే సుమారు 24.51శాతం పెరుగుదల కనిపించింది. అలాగే 2025లో ఏకంగా 18,185 కేసులు ఒక్క షీటీమ్స్‌లో నమోదయ్యాయి. 20 24తో పోల్చితే 36 శాతం పెరుగుదల కనిపించింది. మొత్తంగా కాంగ్రెస్ పాలనలో ఆడబిడ్డలకు రక్షణ లేదనేది మాత్రం సుస్పష్టంగా కనిపించింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత కేసీఆర్ సర్కారు తీసుకొచ్చిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో అన్ని రంగాలు పురోభివృద్ధి సాధించాయి. ఇందులో భాగంగానే రియల్ ఎస్టేట్ రంగం సైతం రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. రాష్ట్ర ఏర్పాటు సమయంలో రిజిస్ట్రేషన్ల ద్వారా రాబడి అంతంత మాత్రంగానే ఉండేది.

ఆ తర్వాత జోరందుకున్నది. 2014 నుంచి 2023 వరకు రిజిస్ట్రేషన్ల ద్వారా రాబడి ఏకంగా 416 శాతం పెరగడం గమనార్హం. కాంగ్రెస్ అభివృద్ధి వ్యతిరేక విధానంతో రియల్ ఎస్టేట్ తిరోగమనంలోకి చేరింది. ఫలితంగా రిజిస్ట్రేషన్ల రాబడిలో కేవలం 4.62శాతమే వృద్ది నమోదైంది.

బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి విధానాలతో రాష్ట్రంలో భూముల విలువ భారీగా పెరిగింది. అప్పటి వరకు ఎకరా ఐదారు లక్షలు పలికేది.. ఆ తర్వాత ఎకరం ధర కనీసం 30 లక్షలైంది. రోడ్డు పక్కన ఉన్న స్థలం అయితే కోటి పలికింది. ఇలా 2014 నుంచి 2023 వరకు భూముల విలువ 500 శాతం పెరిగింది.

అయితే, ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ సర్కారు అసమర్ధ విధానాలు, కబ్జా పర్వాలు, హైడ్రా కూల్చివేతలు వంటి కారణాలతో భూముల విలువ అమాంతం పతనమయ్యింది. దీంతో అన్ని రంగాలతో పాటు రియల్ ఎస్టేట్ రంగం సైతం కుప్పకూలింది. దీంతో భూముల విలువలు 33శాతం మేర పడిపోయాయి.

సుపరిపాలనకు రహదారి గొప్ప మార్గం. రాష్ట్రంలో ఉన్న మెజార్టీ రోడ్లన్నీ బీఆర్ఎస్ హయాంలో నిర్మించినవే కాగా, కాంగ్రెస్ సర్కారు అధికారం చేపట్టి రెండున్నరేండ్లు పూర్తి కావస్తున్నా.. ఒక్క కొత్త రహదారి పనులను కూడా ప్రారంభించలేదు. కనీసం రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) భూసేకరణ కూడా పూర్తి చేయలేకపోయింది. బీఆర్ఎస్ అధికారం చేపట్టిన తర్వాత రహదారులను భారీ ఎత్తున నిర్మించింది. గ్రామాల్లోని రోడ్లు, మండలాల నుంచి జిల్లాలకు, జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్‌కు వెళ్లే రహదారులను భారీ ఎత్తున నిర్మించడంతో అన్ని రహదారుల రోడ్డు నెట్ వర్క్ 1,11,730 కిలోమీటర్లకు చేరింది.
బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన రోడ్లు 1,11,730 కిలోమీటర్లు
కాంగ్రెస్ హయాంలోకొత్తగా నిర్మించిన రోడ్లు 0
పేదింటి ఆడబిడ్డల పెండ్లి ఆ కుటుంబాలకు భారం కాకూడదన్న ఉదాత్త లక్ష్యంతో అధికార పగ్గాలు చేపట్టిన ఆరు మాసాల్లోనే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు అప్పటి కేసీఆర్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అప్పటి నుంచి 2023 డిసెంబర్ చివరి వరకు 12 లక్షల మంది పెండ్లి చేసుకున్న ఆడబిడ్డలకు ఈ స్కీంను వర్తింపజేశారు. దరఖాస్తు చేసిన ఆరు వారాల్లోగా లబ్దిదారుల ఖాతాల్లో రూ. లక్ష చొప్పున జమచేశారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బృహత్తర పథకానికి పెండింగ్ గ్రహణం పట్టుకున్నది.

లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ బంగారం దేవుడెరుగు రూ. లక్ష సైతం సక్రమంగా ఇవ్వడంలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2024లో సుమారు 68 వేల దరఖాస్తులు రాగా 39వేలు, 2025లో 90 వేల అర్జీలు అందగా 59,500 పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తంగా 2025 డిసెంబర్ నాటికి సుమారు 1.90 లక్షల అర్జీలు రాగా 95 వేలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ గణంకాలే ఈ స్కీం అమలులో సర్కారు చిత్తశుద్ధిలేమికి అద్దంపడుతున్నాయి.

నేత కార్మికుల ఆకలిచావులు అరికట్టడం.. నిరుపేద ఆడబిడ్డల కండ్లల్లో పండుగ ఆనందం నింపే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం 2017లో బతుకమ్మ చీరల పంపిణీకి శ్రీకారం చుట్టింది. సుమారు కోటి మంది మహిళలకు బతుకమ్మ కానుక పేరిట చీరలు పంపిణీ చేసేవారు. ఇందుకోసం యేటా రూ. 350 కోట్లు నేతన్నలకు చెల్లించేవారు. కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ బృహత్తర పథకాన్ని అటకెక్కించింది. 30 నెలల్లో ఇందిరమ్మ చీరల పేరిట ఒకే విడుత పంపిణీ చేశారు. గతేడాది నవంబర్‌లో పంచాయతీ ఎన్నికల ముందర సమైక్య సంఘాల్లోని 50 లక్షల మంది గ్రామీణ మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఇందుకు రూ. 450 కోట్లు ఖర్చుచేశారు.

బీఆర్ఎస్ పాలనలో 5 కోట్లు చీరలు
కాంగ్రెస్ పాలనలో 50 లక్షలు
చీరలు తేడా : 4.5 కోట్లు చీరలు
వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, డయాలసిస్, ఎయిడ్స్ పేషెంట్లు ఆత్మగౌరవంతో బతుకాలన్న ఉద్దేశంతో కేసీఆర్ సర్కారు ఆసరా పింఛన్లను అమలు చేసింది. సమైక్య పాలనలో ఇచ్చిన పింఛన్ మొత్తం ఎంత మాత్రం సరిపోవట్లేదని తొలుత ఐదు రెట్లు, అనంతరం పది రెట్లు పెంచింది. అలా మొత్తంగా 44.70 లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్లు అందించింది. అయితే పింఛన్ మొత్తంతో పాటు లబ్ధిదారుల సంఖ్యను పెంచుతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ సర్కారు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్ లబ్ధిదారుల్లో కోతలు విధిస్తున్నది. మొదట డబుల్ పింఛన్ల పేరిట, తర్వాత ఫేస్ రికైగ్నెజేషన్, ఆ తర్వాత ఫోరెన్సిక్ అడిట్ పేరిట సుమారు 2.52 లక్షల మందికి కోత విధించింది. ప్రస్తుతం 42.18 లక్షల మందికే పింఛన్లు అందజేస్తున్నారు.

బీఆర్ఎస్ పాలనలో: 44.7 లక్షలు
కాంగ్రెస్ పాలనలో: 42.18 లక్షలు
పింఛన్లలో కోత: 2.52 లక్షలు
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ప్రతీ గ్రామంలో పల్లె ప్రకృతి వనాలు, పెద్ద ఎత్తున మొకలు నాటే డ్రైవ్‌ల వల్ల ప్రారంభ దశలో పచ్చదనం అత్యంత వేగంగా (3.14% వార్షిక వృద్ధితో) దూసుకుపోయింది. దేశంలోనే అత్యధికంగా పచ్చదనం పెంచుకున్న రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ (ఐఎస్ఎఫ్ఆర్), సామాజిక ఆర్థిక సర్వేల ప్రకారం.. తెలంగాణకు హరితహారం ద్వారా అడవుల పునరుద్ధరణ, సామాజిక అడవుల పెంపకం చేపట్టారు. పట్టణ ఉద్యానవనాలు ఏర్పాటు చేశారు.

2014లో తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో గ్రీన్ కవర్ (అటవీ, వృక్ష విస్తీర్ణం) సుమారు 24.05 శాతంగా ఉండేది. కేసీఆర్ తలపెట్టిన హరితహారం ద్వారా బీఆర్ఎస్ పదేండ్ల పాలన ముగిసే సమయానికి (2023-24 నాటికి) రాష్ట్రంలో పచ్చదనం 31.75 శాతానికి పెరిగింది. అంటే మొత్తం పచ్చదనం విస్తీర్ణం 7.70 శాతం మేర పెరిగింది. ఈ పదేండ్లలో దాదాపు 290 కోట్లకు పైగా మొకలు నాటారు. రాష్ట్రంలో పగ్గాలు చేపట్టిన తర్వాత పచ్చదనం పెంచడంలో మునుపటి దూకుడును కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించలేకపోయింది. ఫలితంగా పచ్చదనంలో వృద్ధిరేటు కేవలం 0.73 శాతం మాత్రమే నమోదైంది.

కేసీఆర్ చేపట్టిన చర్యల ఫలితంగా రాష్ట్ర ఏర్పాటుకు ముందు వరకూ గోదావరి నుంచి 90 టీఎంసీలను కూడా పూర్తిస్థాయిలో వాడుకోలేని విషమ పరిస్థితి నుంచి పదేండ్లు పూర్తికాకముందే గరిష్ఠంగా 400 టీఎంసీలకు పైగా గోదావరి జలాలను వినియోగించుకునే స్థాయికి ఎదిగామంటే బీఆర్ఎస్ హయాంలో నీటిపారుదల రంగంలో సాధించిన ప్రగతి ఎంతో అర్థం చేసుకోవచ్చు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత గోదావరి బేసిన్లో, కృష్ణాబేసిన్‌లోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేశారు. అంతేకాదు కాళేశ్వరం, చనాకా కొరాట బరాజ్, సమ్మక్క సారక్క బరాజ్, భక్తరామదాసు, తుమ్మిళ్ల, పాలమూరు రంగారెడ్డి వంటి అతిభారీ ఎత్తిపోతల పథకాలను చేపట్టి దాదాపు 80శాతం పనులు పూర్తి చేశారు. 27,325 చెరువులను మిషన్ కాకతీయ ద్వారా పునరుద్ధరించి దాదాపు 9.61టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచారు. ఆర్బీఐ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 2014-15లో 1.31 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు కాగా, 2022-23లో ఇది 2.29 కోట్ల ఎకరాలకు పెరిగింది.
ఇక నాడు కేవలం 62.49 లక్షల ఎకరాలకు మాత్రమే నీటి పారకం ఉండగా, 2022-23లో 159.97 లక్షల ఎకరాలకు పెరిగింది. అంటే 156 శాతం నీటి పారకం వసతి పెరిగింది. బీఆర్ఎస్ హయాంలో భూగర్భ జల మట్టం సగటున 4.14మీటర్లు పెరిగింది. ఇక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ప్రగల్బాలు పలకడమే తప్ప ఆచరణలో అడుగు కూడా ముందుకు పడడం లేదు. రానున్న ఐదేండ్ల కాలంలో 30లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామని హామీనిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా రాబోయే మూడేండ్లలో కేవలం 15.26లక్షల ఎకరాలకే నీరందిస్తామని తాజాగా బడ్జెట్లో ప్రకటించింది. లక్ష్యాన్ని సగానికి కుదించుకోవడం కాంగ్రెస్ వైఫల్యానికి ప్రతీకగా నిలుస్తుంది.
తెలంగా ణ రాష్ట్ర ఆవిర్భా వం నుంచీ అప్పటి సీఎం కేసీఆర్ సంక్షేమ రంగంలో వినూత్న సంస్కరణలకు నాందిపలికారు. పదేండ్ల పాలనలో దేశంలో ఎక్కడా లేని విధంగా, గతంలో ఏ రాజకీయ పార్టీ చేపట్టని విధంగా కనీవినీ ఎరగని రీతిలో రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, గురుకుల విద్యాలయాలు, ఉచిత విద్యుత్తు, గొర్ల పంపిణీ, చేపల పంపిణీ, దళితబంధు, గృహలక్ష్మీ, బీసీ బంధు, మైనార్టీబంధు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ పథకాలు ఉదాహరణగా నిలుస్తాయి. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలన్నీ ప్రత్యక్షంగా ఆయా వర్గాలకు లబ్ధి చేకూర్చడంతోపాటు, పరోక్షంగా రాష్ట్ర ప్రగతికి దోహదపడ్డాయి. ప్రతి పైసాకు రెట్టింపు ప్రతిఫలం దక్కింది.
వినూత్న పథకాలకు, సంక్షేమానికి మారుపేరుగా నిలిచిన తెలంగాణలో ప్రస్తుత రేవంత్ పాలనలో అందుకు పూర్తిగా భిన్నమైన పరిస్థితి నెలకొన్నది. ఆరు గ్యారెంటీలని చెప్పి అరచేతిలో వైకుంఠం చూపించి కాంగ్రెస్ ప్రజలను మోసం చేసింది. ఫ్రీ బస్సు మినహా ఏఒక్క గ్యారెంటీ సక్రమంగా అమలైన పరిస్థితి లేకుండా పోయింది. ఇదిలా ఉంటే గత కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన పథకాలను ఒక్కొక్కటిగా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా రద్దు చేస్తూ వస్తున్నది. కొన్ని పథకాలను పేరుకు అమలు చేసినా అందులోనూ కోతలు విధిస్తున్నది.
పైసా ఖర్చు చేయకుండా, ఇసుమంత శ్రమ పడకుండా రేవంత్ ప్రభుత్వం క్రెడిట్ చోరికి పాల్పడుతున్నది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిధులు కేటాయించి, శంకుస్థాపనలు చేసి, సింహభాగం పనులు పూర్తి చేసిన భారీ ప్రాజెక్టులను.. కేవలం రిబ్బన్ కటింగులు చేసి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకుంటున్నది. హైదరాబాద్ నడిబొడ్డున నిర్మించిన ఫె్లైఓవర్లు మొదలు కొని.. పల్లెల్లో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుల వరకు దాదాపు 27కు పైగా మెగా ప్రాజెక్టులు బీఆర్ఎస్ విజన్‌కు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తుండగా, వాటిపై తమ ముద్ర వేసుకోవడానికి కాంగ్రెస్ సర్కారు విఫలయత్నం చేస్తున్నదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.