మహబుబాబాద్ (నమస్తే తెలంగాణ), జూన్ 12 : అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్‌కు నిరుద్యోగ యువత బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు పిలుపునిచ్చారు. ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు, నిరుద్యోగుల కోసం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి రూపొందించిన ‘ఈ-క్లాస్’ యాప్‌ను శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌తో కలిసి వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్త్తామని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి, నేటికీ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ రెండున్నరేండ్ల పాలనలో రెండు లక్షల ఉద్యోగాలు కాదు కదా.. కనీసం 20వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వలేదని తెలిపారు. పోలీస్‌శాఖలోనే 19వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే డీజీపీ సీవీ ఆనంద్ కేవలం 5వేల ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇస్తామనడం విడ్డూరంగా ఉన్నదని పేర్కొన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రెండేండ్లకొకసారి వివిధ శాఖల్లో లక్షా 67వేల ఉద్యోగాలు భర్తీ చేశారని గుర్తుచేశారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించాలని రాకేశ్‌రెడ్డి చేస్తున్న కృషి అభినందనీయమని మాజీ ఎంపీ కవిత అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ బిందు, మాజీ మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్‌రెడ్డి తదితరులు పాల్గ్గొన్నారు.