MLC Kavitha | తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్షగా నిలబడేది గులాబీ జెండా మాత్రమేనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ బాగుండాలని బీఆర్ఎస్ నాయకులు కోరుకుంటారని.. కానీ కాంగ్రెస్, బీజేపీ నాయకులు మాత్రం తమకు ఓట్లు బాగా రావాలని అనుకుంటున్నారని విమర్శించారు. ఆ రెండు పార్టీలు ప్రజల మధ్య చీలక తీసుకొచ్చి ఓట్లు పొందేందుకు ప్రయత్నాలు చేస్తుంటాయని మండిపడ్డారు. వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ ప్రాంగణాన్ని పార్టీ శ్రేణులతో కలిసి గురువారం నాడు ఎమ్మెల్సీ కవిత పరిశీలించారు.
కాంగ్రెస్‌ది చేతగాని ప్రభుత్వమని ప్రజలకు తెలిసిపోయిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. 16 నెలల కాంగ్రెస్ పాలనలో 16 పనులు కూడా కాలేదని విమర్శించారు. దేశానికే సేవలు అందించడానికి టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెందామని వివరించారు. పరిణితి చెందడం ప్రకృతి ధర్మమని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారిందంటే అది ప్రజల కోరుకున్న రెవల్యూషన్ అని చెప్పారు. రజతోత్సవం ఎందుకు చేసుకుంటున్నారని కొంతమంది వెకిలి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు అవాకులు, చెవాకులు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు. కాంగ్రెస్ నేతలు మాట్లాడే మాటలను ప్రజలు క్షమించరని చెప్పారు.
బీఆర్ఎస్ పార్టీలోని మహిళా నాయకత్వాన్ని పటిష్టం చేయడానికి కేసీఆర్ రోడ్ మ్యాప్ ఇచ్చారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తెలంగాణ ప్రజల విజయాన్ని ప్రపంచానికి చాటడానికే బీఆర్ఎస్ రజతోత్సవ సభ అని చెప్పారు. తెలంగాణ అస్తిత్వం కోసం 2001లో కేసీఆర్ పడికిలి బిగించి ఉద్యమాన్ని మొదలుపెట్టారని గుర్తుచేశారు. ఉద్యమం మొదలుపెట్టినప్పుడు ఉత్పన్నమైన అన్ని అనుమానాలను కేసీఆర్ పటాపంచలు చేశారన్నారు. ఒక రక్తం చుక్క కూడా చిందించకుండా రాష్ట్రాన్ని సాధించిన ధీరుడు కేసీఆర్ అని కొనియాడారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా గుండె ధైర్యంతో బీఆర్ఎస్ పార్టీని, తెలంగాణను కాపాడుతూ వచ్చారని అన్నారు. తెలంగాణ ఉట్టిగనే రాలేదు… కేసీఆర్ మేధస్సును కరిగిస్తే వచ్చిందని అన్నారు. తెలంగాణ రాజకీయ కుట్రలను చేధించి తెలంగాణ వాదాన్ని ప్రజల్లో నిలబెట్టారని అన్నారు. తెలంగాణ నవ యువకుల కోసం రజతోత్సవ సభ జరుగుతుందని స్పష్టం చేశారు. సభకు యువత పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. కుంభమేళా తరహాలో రజతోత్సవ సభ జరగబోతుందని చెప్పారు.
మహిళలకు నెలకు 2500, తులం బంగారం, స్కూటీలు ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసిందని కవిత విమర్శించారు. కాంగ్రెస్ చేతిలో మోసపోయిన ప్రతీ ఒక్కరు సభకు రావాలని ఆహ్వానించారు. మహిళా సాధికారతకు కేసీఆర్ బాటలు వేశారని.. మున్సిపాలిటీల్లో, మార్కెట్ కమిటీల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించారని.. బీసీ, ఎస్సీ, ఎస్టీ ఆడబిడ్డల కోసం ప్రతి జిల్లాలో హాస్టల్‌తో కూడిన డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేశారని తెలిపారు. కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్ వంటి విప్లవాత్మక కార్యక్రమాలు చేపట్టారని పేర్కొన్నారు. మహిళలు భారీ ఎత్తున సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు. రైతులు గుండెలపై చేయి వేసుకొని పడుకునే పరిస్థితిని కేసీఆర్ సృష్టిస్తే.. కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టి లక్షలాది ఎకరాలు ఎండిపోయేలా చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ రైతులంతా గులాబీ దండులా రజతోత్సవ సభకు కదలిరావాలని కోరారు. తెలంగాణలోని ప్రజాస్వామ్యులంతా కూడా సభకు కదిలిరావాలని.. సోషల్ మీడియా సైనికులు కూడా హాజరుకావాలని పిలుపునిచ్చారు.