(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు సభాప్రాంగణానికి లక్షలాది మంది ప్రజలు పోటెత్తారు. సభకు హాజరుకాలేని కోట్లాది మంది టీవీలు, డిజిటల్, సోషల్ మీడియా వేదికల ద్వారా చూశారు. పల్లె, పట్టణం అని తేడాలేకుండా ఆదివారం సాయంత్రం ప్రతీ ఇంటిలో కేసీఆర్ ప్రసంగం మార్మోగింది. తెలంగాణలో ప్రధాన మీడియా చానళ్లు, ఏపీ కేంద్రంగా పనిచేస్తున్న కొన్ని చానళ్లు కేసీఆర్ ప్రసంగాన్ని లైవ్‌లో ప్రసారంచేశాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తున్నదంటూ కేసీఆర్ వివరించిన విధానం ఆకట్టుకున్నదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది.
అన్ని చానళ్లలో కేసీఆరే
తెలుగులోని ప్రధాన న్యూస్ టీవీ చానళ్లలోనే కాకుండా యూట్యూబ్‌లోని తమ అఫీషియల్ అకౌంట్ల ద్వారా కూడా కేసీఆర్ ప్రసంగాన్ని లైవ్ స్ట్రీమింగ్ చేశాయి. సోషల్‌మీడియా వేదికలైన ఎక్స్, ఫేస్బుక్ ఖాతాల నుంచి కూడా ఈ స్ట్రీమింగ్‌ను కొనసాగించాయి. తెలంగాణలోనే గుండె చప్పుడుగా గుర్తింపు పొందిన ‘టీ న్యూస్’ సహా రాష్ట్రంలోని మరికొన్ని న్యూస్ చానళ్లు కేసీఆర్ ప్రసంగాన్ని తమ యూట్యూబ్ వేదికల్లో లైవ్ స్ట్రీమింగ్కు పెట్టా యి. మరో ఐదు న్యూస్ చానళ్లు స్ట్రీమింగ్ చేసి న కేసీఆర్ ప్రసంగానికి రియల్ టైమ్ వ్యూస్ 4.86 లక్షలు దాటింది. ఇవే చానళ్లకు చెందిన ఫేస్బుక్, ఎక్స్ ఖాతాల్లో మరో 3 లక్షల రియల్ టైమ్ వ్యూస్ వచ్చాయి. డిజిటల్ మీడియా, సోషల్ మీడియా ఖాతాల్లోని అన్ని అకౌంట్లలో కలిపి కనీసం 15 లక్షల వరకూ రియల్ టైమ్ వ్యూయర్ షిప్ ఉండొచ్చని మీడియా వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
వ్యూస్ కోసం మల్టిపుల్ స్ట్రీమింగ్స్
కేసీఆర్ ప్రసంగాన్ని వినాలని యావత్తు తెలంగాణ ప్రజానీకం ముఖ్యంగా యువత పెద్దఎత్తున ఆసక్తి కనబర్చారు. దీంతో వ్యూస్ కోసం కొన్ని న్యూస్ చానళ్లు యూట్యూబ్ వంటి డిజిటల్ మీడియా వేదికల్లో వేర్వేరు థంబ్ నెయిల్స్ పెట్టి కేసీఆర్ ప్రసంగాన్ని మల్టిపుల్ స్ట్రీమింగ్స్కు పెట్టాయి. అయినా ప్రతీ స్ట్రీమింగ్కు కనీసం 25 వేల నుంచి 50 వేల మంది రియల్ టైమ్ వ్యూయర్స్ రావడం విశేషమని, చాలా అరుదుగా ఇలాంటి స్పందన కనిపిస్తుందని మీడియా ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు.
ఎల్కతుర్తి సభ డిజిటల్ వ్యూసే నిదర్శనం
బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కోసం తెలంగాణ ప్రజలు ఎంతగా ఎదురుచూస్తున్నారో చెప్పడానికి డిజిటల్ వ్యూసే నిదర్శనమని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్‌పై ప్రజలకున్న ప్రేమను చెప్పడానికి ఇది చాలని ఆదివారం ఎక్స్ వేదికగా తెలిపారు. ‘కరోనా సమయంలో ఇట్లా ఎదురుచూస్తుండే.. మళ్లీ ఇప్పుడు కూడా అలాగే ఎదురుచూస్తున్నారు’ అని వెల్లడించారు. కేసీఆర్ ప్రసంగిస్తుండగా.. టీవీ 9 యూట్యూబ్ చానల్‌ను లక్ష మంది, టీన్యూస్ యూట్యూబ్ చానల్‌ను 67 వేల మంది చూసినట్టు తెలిపారు.
-వై సతీశ్‌రెడ్డి, బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి