హైదరాబాద్ మే 11 (నమస్తే తెలంగాణ) : ఉత్తర అమెరికాలోని డాలస్‌లో జూన్ 1న బీఆర్ఎస్ రజతోత్సవం, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్టు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఈ వేడుకలకు బీఆర్ఎస్ యూఎస్ఏ సెల్ సభ్యులందరూ పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆదివారం రాత్రి 350 మంది బీఆర్ఎస్ యూఎస్ఏ సెల్ మెంబర్స్‌తో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ర్టాల్లో 25 ఏండ్లు మనుగడ సాగించిన పార్టీల్లో బీఆర్ఎస్ ఒకటి అని పేర్కొన్నారు. ఏప్రిల్ 27న వరంగల్‌లో బీఆర్ఎస్ రజతోత్సవ సభను అట్టహాసంగా నిర్వహించుకున్నామని తెలిపారు. ఇదే స్ఫూర్తితో డాలస్‌లో ఈ కార్యకమాన్ని తలపెట్టామని పేర్కొన్నారు.
ఇందులో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ముఖ్యనేతలు పాల్గొంటారని వెల్లడించారు. తెలంగాణ వైభవం ఉట్టిపడేలా అట్టహాసంగా సాంస్కృతిక కార్యకమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఉద్యమ పార్టీగా ప్రస్థానాన్ని పారంభించిన బీఆర్ఎస్ నిరంతరం పోరాడి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిందని చెప్పారు. పదేండ్లు అధికారంలో ఉండి.. రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో కృషి చేశామని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రతిపక్ష పాత్రలో ప్రజల గొంతుకగా సమస్యలపై ఎక్కడికక్కడ గొంతెత్తుతున్నామని చెప్పారు. డాలస్‌లో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సంబరాలను, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.