BRS | హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): ఎల్కతుర్తి సభకు కొనసాగింపుగా వివిధ దేశాల్లో ఏడాది పొడవునా బీఆర్ఎస్ రజతోత్సవాలను నిర్వహిస్తామని బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల తెలిపారు. జూన్ 1న అమెరికాలోని డాలస్‌లో గల పెప్పర్ అరేనాలో అట్టహాసంగా వేడుకలు నిర్వహించనున్నట్టు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. వేడుకలకు ముఖ్య అతిథిగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఆహ్వానించినట్టు పేర్కొన్నారు.
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవల సభ చరిత్రలో నిలిచిపోతుందని, ఈ సభ ఘన విజయంతో తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారనే విషయం రుజువైందని తెలిపారు. బీఆర్ఎస్ 25వ వసంతంలోకి అడుగుపెట్టడం తెలంగాణకు గర్వకారణమని యూఎస్ఏ ఐడ్వెజరీ బోర్డు చైర్మన్ తన్నీరు మహేశ్ పేర్కొన్నారు. డాలస్ వేడుకల విజయవంతానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని, తెలంగాణ వైభవం ఉట్టిపడేలా సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తామని వెల్లడించారు.