హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): అమెరికాలోని డాలస్ నగరం ఇటు రాష్ట్ర ఆవిర్భావ సంబురం.. అటు బీఆర్ఎస్ రజతోత్సవ సంరంభానికి ముస్తాబవుతున్నది. ఇందుకోసం డాలస్‌లోని డాక్టర్ పెప్పర్ ఎరీనాలో బీఆర్ఎస్ ఎన్నారై గ్లోబల్ సెల్ ఆధ్వర్యంలో అదిరిపోయే ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం, రాష్ట్ర సాధనకు నాయకత్వం వహించిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాలను ప్రవాస తెలంగాణ వాసులు తమ ఇంటి పండుగగా నిర్వహించేందుకు ఏర్పాట్లలో తలమునకలయ్యారు.
జూన్ 1వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు (భారత కాలమానం ప్రకారం జూన్ 2వ తేదీ, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం) బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు నిర్వహించాలని బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్నారై సెల్ నిర్ణయించిన విషయం తెలిసిందే. పార్టీ రజతోత్సవాల నేపథ్యంలో ఏడాది పొడవునా కార్యక్రమాలు నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్నారై సెల్ సైతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ వాసులను బీఆర్ఎస్ రజతోత్సవాల్లో భాగస్వామ్యం చేస్తున్నది. ఖండాంతరాల్లో దాదాపు అన్ని దేశాల్లో ఉన్న బీఆర్ఎస్ ఎన్నారై విభాగాలు బీఆర్ఎస్ రజతోత్సవాన్ని నిర్వహించేందుకు ముందుకు వచ్చాయి. అమెరికా, బ్రిటన్, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, మలేషియా తదితర దేశాలు, పలు గల్ఫ్ దేశాల్లోనూ బీఆర్ఎస్ రజతోత్సవాలను నిర్వహిస్తామని ముందుకు వచ్చాయి.
గత నెల 27వ తేదీన హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో పార్టీ ఆవిర్భావ రజతోత్సవ వేడుకలకు పార్టీ అధినేత కేసీఆర్ అంకురార్పణ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, అన్ని వర్గాలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వంచించిన తీరుతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో నాటి ఉద్యమ పరిస్థితులను మననం చేసుకోవడం, కేసీఆర్ నాయకత్వంలో పదేండ్లపాటు అద్భుతంగా పురోగమించిన తెలంగాణను స్మరించుకోవడం, భవిష్యత్ కార్యాచరణకు రంగం సిద్ధం చేసుకోవడం కోసం ప్రవాస తెలంగాణీయులు సమాయత్తం అవుతున్నారని జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని ఎన్నారైలు నిర్ధారణకు వస్తున్నారు. 14 ఏండ్లపాటు సుదీర్ఘ కాలం పోరాటం చేసి స్వరాష్ర్టాన్ని సాధించి, పదేండ్ల పాటు తెలంగాణను అన్నిరంగాల్లో దేశంలోనే నంబర్ 1గా నిలిపిన బీఆర్ఎస్ పాలనకు, రాష్ట్రంలో ప్రస్తుత కొనసాగుతున్న పాలనలో అన్నివర్గాలు, అన్ని రంగాలు పడుతున్న యాతనకు ప్రవాస తెలంగాణీయులు ఆవేదన చెందుతున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ డాలస్‌లో రజతోత్సవాలను నిర్వహిస్తామని తేదీ ప్రకటించగానే ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాల్లో (యూఎస్ఏ)ని పలు దేశాల్లో ఉన్న తెలంగాణ ఎన్నారైలు సభకు హాజరయ్యేందుకు ఆసక్తిని చూపటమే కాకుండా స్వచ్ఛందంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నట్టు నిర్వాహకులు పేర్కొన్నారు. ఆయా దేశాల్లో ఉన్న తెలంగాణ బిడ్డలు నాడు ఉద్యమంలో పాల్గొనేందుకు ఎట్లా అయితే ఆసక్తిని చూపారో… ఈ రజతోత్సవాలకు హాజరయ్యేందుకు అంతటి ఆసక్తిని చూపుతున్నారని తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాల ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయని బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల తెలిపారు. అమెరికాలోని డాలస్ నగరంలోని డాక్టర్ పెప్పర్ అరినాలో జరుగుతున్న ఏర్పాట్లను ఆయన మంగళవారం పరిశీలించారు. తెలంగాణ ఆత్మను ఆవిష్కరించే రీతిలో పలు కార్యక్రమాలను చేపడుతున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్న నేపథ్యంలో యూఎస్ఏలో పలు ప్రాంతాల్లో ఉన్న తెలంగాణవాసులే కాకుండా తెలుగువారు పెద్దఎత్తున పాల్గొనేందుకు ఆసక్తిని చూపుతున్నట్టు ఆయన తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక కళాపరిషత్ ఆధ్వర్యంలో తెలంగాణ ధూం..ధాం నిర్వహించనున్నామని తెలిపారు. యూఎస్ఏలోని తెలంగాణ, తెలుగు ప్రజలు, బీఆర్ఎస్ అభిమానులు సహా తెలంగాణకు చెందిన పలు ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొనేందుకు ఇప్పటికే తమ సన్నద్ధతను తెలిపారని చెప్పారు. బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్నారై సెల్ యూఎస్ఏ అడ్వైజరీ బోర్డు చైర్మన్ తన్నీరు మహేశ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ అమెరికాలోని వివిధ రాష్ట్రాల బీఆర్ఎస్ మద్దతుదారులు, అనుబంధ సంఘాల సమన్వయంతో నిర్వహించే కార్యక్రమం చరిత్రలో నిలుస్తుందని తెలిపారు. గతనెల ఎల్కతుర్తిలో నిర్వహించినట్టుగానే డాలస్‌లో వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు. బీఆర్ఎస్ యూఎస్ఏ నాయకులు శ్రీనివాస్ సురభి, హరీశ్‌రెడ్డి, శ్రీనివాస్ సురకంటి పాల్గొన్నారు.