హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): అమెరికాలోని డాలస్ నగరంలో జూన్ 1న బీఆర్ఎస్ రజతోత్సవ సభను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొంటారని పేర్కొన్నారు. బుధవారం తెలంగాణ భవన్లో.. డాలస్‌లో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సంబురాల పోస్టర్‌ను బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల, ఎమ్మెల్యే కే సంజయ్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్‌తో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ బిడ్డలు రాష్ట్ర తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరవుతారని తెలిపారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ తన పదేండ్ల పాలనలో అనేక అద్భుతాలు సాధించి చూపారని పేర్కొన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. వరంగల్‌లోని ఎలతుర్తిలో జరిగిన రజతోత్సవ బహిరంగ సభ కనీవినీ ఎరుగని రీతిలో ఎంతో అద్భుతంగా జరిగిందని గుర్తుచేశారు. ఎన్ఆర్ఐలుగా ఉండి ప్రపంచ వ్యాప్తంగా బీఆర్ఎస్ రజతోత్సవ సంబురాలు జరిపేందుకు ముందుకు రావడం చాలా మంచి పరిణామమని అభినందించారు. అమెరికాతోపాటు యూకే, కెనడా, ఆస్ట్రేలియాలోనూ బీఆర్ఎస్ రజతోత్సవ సంబురాలు ఏడాది పొడవునా ఘనంగా జరుగుతాయని తలసాని పేర్కొన్నారు.
తెలంగాణ సాంస్కృతిక వైభవంగా సభ: మహేశ్ బిగాల
బీఆర్ఎస్ రజతోత్సవ సభలు విదేశాలలో, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా, తెలంగాణ ఆట, పాటలతో ఘనంగా జరపనున్నామని ఆ పార్టీ గ్లోబల్ ఎన్ఆర్ఐ సెల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల తెలిపారు. అందులో భాగంగా అమెరికాలోని డాలస్‌లో జూన్ 1న ఈ సభను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు.
ఈ సభకు కేటీఆర్ హాజరవుతున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్యనేతలు, అమెరికాలోని తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఉన్నారని తెలిపారు. దాదాపు 10 వేల మందికి పైగా ఈ సభకు హాజరయ్యేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో చందు తాళ్ల, అభిలాష్ రంగినేని, పుట్టా విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.