ఖమ్మం, నమస్తే తెలంగాణ ప్రతినిధి ; ఆదివారం ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు హాజరై పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న సభకు భారీగా తరలివెళ్లాలని వారు పిలుపునిచ్చారు.
కేసులకు బీఆర్ఎస్ కార్యకర్తలు భయపడరు ; మాజీ ఎమ్మెల్యే షకీల్ హెచ్చరిక
బోధన్, ఏప్రిల్ 20: కేసులకు బీఆర్ఎస్ కార్యకర్తలు భయపడరని బోధన్ మాజీ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ తెలిపారు. రాజకీయ కక్షతోనే తన కుటుంబాన్ని ఎమ్మెల్యే సుదర్శన్ మానసిక వేదనకు గురిచేశాడని ఆరోపించారు. ఆదివారం బోధన్‌లోని ఓ ఫంక్షన్ హాలులో నిర్వహించిన నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. సుదర్శన్‌రెడ్డి ఆగడాలను సహించేది లేదని, బరాబర్ ఆయన అకౌంట్స్ సెటిల్ చేస్తామని హెచ్చరించారు. పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని, దీనిపై పోలీస్ కమిషనర్ స్పందించాలని కోరారు. రజతోత్సవ సభను విజయవంతం చేయాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
చరిత్రలో నిలిచిపోయేలా ఎల్కతుర్తి సభ; ఎమ్మెల్సీ తకళ్ల్లపల్లి రవీందర్రావు
మహబూబాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభ చరిత్రలో నిలిచిపోతుందని, ఆ మేరకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయని ఎమ్మెల్సీ తకళ్లపల్లి రవీందర్రావు అన్నారు. ఆదివారం ఆయన మహబూబాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. దాదాపు రెండు వేల ఎకరాల వరకు భూములను చదును చేసి సభా వేదిక, కార్యకర్తలు కూర్చునేందుకు వీలుగా సభాస్థలి ఏర్పాటు చేసినట్టు తెలిపారు. దాదాపు 50 వేల వాహనాలు వస్తాయని అంచనా వేశామని, అందుకు అనుగుణంగా పారింగ్కు స్థలం కేటాయించినట్టు చెప్పారు. సభకు నాయకులు, కార్యకర్తలు తరలివచ్చేందుకు మూడు వేల ఆర్టీసీ బస్సులు, ఆరు వేల ప్రైవేట్ బస్సులు, ఇతరత్రా వాహనాలు సమకూరుస్తున్నట్టు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ సభకు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
రజతోత్సవ సభకు రండి.; ఇంటింటికి వెళ్లి బొట్టుపెట్టి ఆహ్వానించిన ‘సీతాలక్ష్మి’
27నాటి సభ విజయవంతానికి విస్తృత ప్రచారం
కొత్తగూడెం అర్బన్, ఏప్రిల్ 20: ‘ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు రండి’ అంటూ కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి కోరారు. ఈ మేరకు తన భర్త, టీబీజీకేఎస్ నేత కాపు కృష్ణ సహా పార్టీ శ్రేణులతో కలిసి భద్రాద్రి జిల్లా కేంద్రంలోని రామవరంలో ఆదివారం విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికి వెళ్లి బొట్టుపెట్టి మరీ ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రజతోత్సవ సభలో పార్టీ అధినేత కేసీఆర్.. భవిష్యత్ ప్రణాళికపై దిశానిర్దేశం చేయనున్నారని తెలిపారు.
ఎల్కతుర్తి సభకు వేలాదిగా తరలివెళ్లాలి ; కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పిలుపు
మాచారెడ్డి, ఏప్రిల్ 20 : ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రజలు తరలివెళ్లాలని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం గజ్యానాయక్ తండా ఎక్స్‌రోడ్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో ఆదివారం నిర్వహించిన ఉమ్మడి మాచారెడ్డి మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆరు గ్యారెంటీలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్నదని విమర్శించారు. పార్టీ కార్యకర్తలు అధైర్య పడొద్దని, ప్రజలు బీఆర్ఎస్తోనే ఉన్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటాలని పిలుపునిచ్చారు.