ఇచ్చోడ, ఏప్రిల్ 9 : సాధారణంగా తమ ఇంట్లో పెళ్లి ఉంటే బంధువులు, గ్రామస్థులకు పెండ్లికార్డులు పంచుతూ ఆహ్వానిస్తారు. కానీ.. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) గ్రామస్థులు మాత్రం తమ ఇంటి పార్టీ బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం ప్రత్యేకంగా ఆహ్వానపత్రికను పెండ్లి పత్రికలా తయారుచేసి ఊరంతా పంచారు. బుధవారం మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి ఇంటింటికీ తిరిగి మహిళలకు బొట్టుపెట్టి బీఆర్ఎస్ రజతోత్సవ ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ నెల 27న హనుమకొండలో నిర్వహించే 25 ఏండ్ల గులాబీ పండుగకు ప్రతి ఒకరూ వచ్చి విజయవంతం చేయాలని కోరారు. కేసీఆర్ పాలనలో ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందాయని, మళ్లీ తెలంగాణలో కేసీఆర్ పాలనే రావాలని ప్రజలు కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్ పాల్గొన్నారు.