సీసీసీ నస్పూర్, మార్చి 7: పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. గురువారం మంచిర్యాల జిల్లా నస్పూర్‌లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన చెన్నూర్, మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాల ముఖ్య కార్యకర్తల సమావేశానికి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్యతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు.
ఈ మూడు నెలల పాలనలో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకతను మూటగట్టుకున్నదని అన్నారు. అధినేత కేసీఆర్ ప్రాణాలకు తెగించి తెలంగాణ రాష్ర్టాన్ని తెచ్చారని, పదేండ్లలో ప్రగతి పథంలో నడిపించి దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిపారని గుర్తుచేశారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలతో గద్దెనెక్కిందని, ప్రజలంతా కేసీఆర్ పాలననే గుర్తుచేసుకుంటున్నారని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించడానికి బీజేపీతో కాంగ్రెస్ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుందని ఆరోపించారు.
బాల్క సుమన్ మాట్లాడుతూ.. కక్షసాధింపుతో పెట్టే అక్రమ కేసులకు భ యపడేది లేదని అన్నారు. కార్యకర్తలకు పార్టీ ఎప్పు డూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలను బీఆర్ఎస్ పార్టీ సీరియస్‌గా తీసుకుందని, ఈ నెల 13న చెన్నూర్ నియోజకవర్గం, 14న బెల్లంపల్లి నియోజకవర్గాల్లో కార్యకర్తల సమావేశాలతోపాటు సోషల్ మీడియా వర్క్‌షాప్ నిర్వహించనున్నట్టు తెలిపారు.