హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పోలీసులపై దాడులకు పాల్పడ్డారం టూ సోషల్ మీడియా, ఆయా పత్రికల్లో వచ్చిన ఫోటోల మార్ఫింగ్ ( Morphed Photos ) పై చట్టరిత్యా తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ( BRS MLAs), ఎమ్మెల్సీలు ( MLCs ) బుధవారం డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు మధుసూదన చారి, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, దేవి రెడ్డి సుధీర్‌రెడ్డి తదితరులు ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు.
ఎంఎల్ఏ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఏఐ మార్ఫింగ్ ఫోటోలతో ఈ ప్రభుత్వం పబ్బం గడుపుతుందని , తమపై దాడి జరిగిందని , చర్యలు తీసుకోవాలని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఫిర్యాదు చేస్తే ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదని ఆరోపించారు. కేసీఆర్ చావుకోరిన వీర్లపల్లి శంకర్ పై పోలీసులు వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ మహిళ నాయకురాళ్లతో పోలీసులు వ్యవరించిన తీరు గర్హనీయమని పేర్కొన్నారు. కేసీఆర్ ఫార్మ్ హౌస్ దాడికి యత్నించిన ఎమ్మెల్యేలు కార్యకర్తలపై కేసులు నమోదు చేయాలని కోరారు.కేసీఆర్ ఇంటికి కాంగ్రెస్ నాయకులు వెళ్లడం వల్లనే ఆ స్థలం అపవిత్రమైందని, దళితుల వల్ల కాదని స్పష్టం చేశారు. డైవర్షన్ పాలిటిక్స్ తో ప్రజల దృష్టిని మరల్చాలని చూస్తున్నారని విమర్శించారు . ప్రజా సమస్యలపై చర్చించాల్సిన విలువైన సమయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని మండిపడ్డారు.