హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి చెందిన ఇద్దరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై కేంద్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం ఫిర్యాదు చేసింది. రాజ్యసభలో బీఆర్ఎస్ ఫ్లోర్‌లీడర్ కేఆర్ సురేశ్‌రెడ్డి, డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, మాజీ ఎంపీ బాల్క సుమన్ మంగళవారం ఢిల్లీలో కేంద్ర సిబ్బంది పాలనా వ్యవహారాలు, శిక్షణా శాఖ (డీవోపీటీ) మంత్రి జితేంద్రసింగ్‌కు ఫిర్యాదుచేశారు. రాష్ట్రంలో కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్‌లు కాంగ్రెస్ ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తూ ప్రధాన ప్రతిపక్షంపై అనవసరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
అనంతరం సురేశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారులు పూర్తిగా బాధ్యతలు మర్చిపోయి ప్రవర్తిస్తున్న తీరును కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. దీనిపై కేంద్ర మంత్రి స్పందిస్తూ.. ఆల్ ఇండియా సర్వీసు అధికారులు ఎవరు అధికారంలో ఉన్నా నిబంధనలకు లోబడి విధులు నిర్వహించాల్సిందేనని చెప్పారని, ఈ అంశాన్ని తీవ్ర పరిగణించడంతోపాటు సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. కొత్త ప్రభుత్వానికి అధికారులు సలహాలు, సూచనలు ఇవ్వొచ్చు… కానీ, కార్యకర్తల్లా వ్యవహరించడం సరికాదని పేర్కొన్నారు. ఐఏఎస్, ఐపీఎస్‌లు తమ బాధ్యతలను సజావుగా నిర్వహించాలని హితవు పలికారు.
రాష్ట్రంలో నెలకొన్న ఎరువుల కొరత సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో ఏనాడూ ఎరువుల కొరత రాలేదని గుర్తుచేశారు. అఖిల భారత సర్వీసులకు చెందిన ఐఏఎస్, ఐపీఎస్‌లు నియమ నిబంధనల ప్రకారం కాకుండా కాంగ్రెస్ కార్యకర్తల మాదిరిగా వ్యవహరించడం సరికాదని పేర్కొన్నారు. ప్రధాన ప్రతిపక్షానికి చెందిన నాయకులపై అనవసరమైన విమర్శలు చేయడం, అక్రమ కేసులు బనాయించడం తీవ్ర అభ్యంతరకరమని ఆక్షేపించారు.
కొంతమంది అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి బానిసలుగా, భక్తులుగా, కాంగ్రెస్ కండువా కప్పుకున్నట్టుగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. ఈనెల 1న రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌కార్డుల పంపిణీ చేపట్టగా.. గత ప్రభుత్వంలో రేషన్‌కార్డులు ఇవ్వలేదని డీఎస్ చౌహాన్ పేర్కొనగా, తాను 12 ఏండ్ల క్రితం సబ్ కలెక్టర్‌గా ఉన్నప్పుడు రేషన్‌కార్డులు జారీ చేస్తే.. మళ్లీ ఇప్పుడే రేషన్‌కార్డులు పంపిణీ చేస్తున్నారని హరిచందన వ్యాఖ్యానించారని గుర్తుచేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఇద్దరు అధికారులు మాట్లాడారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో అధికారులు గత ప్రభుత్వ తీరును విమర్శించడం సరికాదని స్పష్టంచేశారు. ఐఏఎస్, ఐపీఎస్‌ల ప్రతిష్టను దెబ్బతీసేలా.. సీఎం రేవంత్‌రెడ్డి తొత్తులుగా అధికారులు ప్రవర్తించడం ఆక్షేపణీయమని పేర్కొన్నారు. రాష్ట్రంలో కొంతమంది అధికారులు తమ తీరు మార్చుకోవాలని హితవుపలికారు. లేకుంటే తీవ్ర పర్యావసనాలు ఉంటాయని హెచ్చరించారు.
రాష్ట్రంలో కొంతమంది ఆల్ ఇండియా సర్వీసు అధికారులు తమ స్థానాన్ని, స్థాయిని మరిచి కాంగ్రెస్ ప్రభుత్వ తొత్తులుగా వ్యహరిస్తున్నారని బాల్క సుమన్ మండిపడ్డారు. గత ప్రభుత్వంలో రేషన్‌కార్డులు ఇవ్వలేదని, కొత్త ప్రభుత్వం వచ్చాకే ఇస్తున్నట్టు చెప్పడం దుర్మార్గమని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఆరున్నర లక్షల రేషన్‌కార్డులు జారీ చేశామని తెలిపారు. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కాంగ్రెస్ కార్యకర్తల్లా పనిచేస్తున్న అధికారులను విడిచిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించే ఉన్నత పదవిలో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్‌లు కాంగ్రెస్ ప్రచారాస్ర్తాలుగా మారడం దారుణమని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు అనుకూలంగా ప్రకటనలు చేసిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తున్న అధికారులను వదిలిపెట్టేది లేదని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ హెచ్చరించారు. రాష్ట్రంలో అన్ని శాఖల్లో పనిచేస్తున్న అధికారులు రాజ్యాంగబద్ధంగా పనిచేయాలని కోరారు. అధికారులు ప్రభుత్వ కార్యక్రమాల్లో సంబంధిత ప్రొగ్రామ్‌ల గురించి మాట్లాడితే ఎలాంటి ఇబ్బంది లేదని, అయితే, రాజకీయ విమర్శలకు దిగడం అంటే నిబంధనలను ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ఇప్పుడు కాంగ్రెస్ నాయకుల మెప్పు కోసం మాట్లాడుతున్న అధికారులపై తప్పకుండా చర్యలు ఉంటాయని హెచ్చరించారు.