BRS | హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన గురువారం తెలంగాణభవన్‌లో పార్టీ ప్రతినిధులతో సమావేశం జరుగనున్నది. మంత్రు లు, ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, జడ్పీ, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు ఇలా మొత్తం 279 మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.
ఆవిర్భావ సందేశం… దిశానిర్దేశం
22 ఏండ్ల కింద జలదృశ్యం వేదికగా పురుడుపోసుకున్న టీఆర్ఎస్ గత సంవత్సరం విజయదశమినాడు బీఆర్ఎస్గా రూపాంతరం చెందింది. 14 ఏండ్ల స్వరాష్ట్ర ఉద్యమ ప్రస్థా నం, ఎనిమిదిన్నరేండ్లుగా రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అప్రతిహత కొనసాగింపు, అనతికాలంలోనే తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిన నేపథ్యంతోపాటు భవిష్యత్ కార్యాచరణపై పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నా రు. బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన తరువాత దేశవ్యాప్తంగా ఆయా రాష్ర్టాల్లో పార్టీకి వ స్తున్న ఆదరణ, అనంతర కార్యాచరణ వంటి అంశాలను శ్రేణులకు వివరించనున్నారు. బీజే పీ, కాంగ్రెస్ సహా పలు పార్టీలు బీఆర్ఎస్పై కావాలని బురదజల్లే కుట్రలు ఎలా చేస్తున్నారు? వాటిని ఎలా తిప్పికొట్టాలి? క్షేత్రస్థాయిలో ప్రజలతో పార్టీ శ్రేణులు ఎలా మసలుకోవాలి? వంటి అంశాలపై అధినేత, సీఎం కేసీఆర్ పలు సూచనలు చేయనున్నారు.
కీలక తీర్మానాలు
బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన తరువాత జరగుతున్న మొదటి ప్రతినిధుల సభ కా వటంతో నేటి సమావేశం ప్రాధాన్యత సంతరించుకున్నది. ఈ నేపథ్యంలో కీలక రాజకీయ తీర్మానాలు, పార్టీ పరిపాలనా తీర్మానాలు ఉం డే అవకాశాలున్నాయి. దళితబంధు పథకం, రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహావిష్కరణ నేపథ్యంలో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపే తీర్మానం ఉండొచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఎన్నికల సన్నద్ధత.. రూట్‌మ్యాప్
ఇది ఎన్నికల సంవత్సరం కావడంతో నేడు జరిగే ప్రతినిధుల సమావేశం కీలకం కానున్నది. ఈనెల 30న బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయ ప్రారంభోత్సవం, జూన్1న అమరవీరుల స్మృతి చిహ్నం నిర్మాణ ప్రాముఖ్యతను విస్తృతంగా ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి? అనే అంశంపై సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.