కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కేటాయించిన జాతీయ రహదారుల పనులను రేవంత్‌రెడ్డి మాకు అంటగ ట్టిండు. 750 కేవీ ట్రాన్స్మిషన్ లైన్‌కు సంబంధించి కేంద్రం ఇచ్చిన ప్రాజెక్టును కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అదానీ కంపెనీకి ఇచ్చిందని మరో అబద్ధపు ముచ్చట చెప్పిండు. కేంద్ర విద్యుత్తు మంత్రిత్వశాఖ ఒప్పందాలు కూడా తెలియకుండా ఇంత తెలివి తకువగా మాట్లాడితే ఏమనుకోవాలి? రక్షణశాఖ పెట్టుబడులను కూడా బీఆర్ఎస్కు అట్టగట్టడం మూడో అబద్ధం. రక్షణశాఖ మా చేతిలో ఉంటుందా? మరి రాజ్‌నాథ్‌సింగ్ ఏం చేస్తున్నట్టు?
-కేటీఆర్
హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిన్నటి ప్రెస్‌మీట్ అంతా ఫ్రస్ట్రేషన్, నిరాశ, నిస్పృహతో కనిపించిందని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రాహుల్‌గాంధీతో తిట్లు పడ్డ తర్వాత వెనకి తగ్గాల్సి వస్తుందన్న బాధతో తమను ఇష్టమొచ్చినట్టు తిట్టారని మండిపడ్డారు. అదానీతో కటీఫ్ అన్నట్టుగా రేవంత్ కటింగ్ ఇచ్చారని దెప్పిపొడిచారు. రేవంత్‌రెడ్డికి ఆయన అనుకున్న సీఎం పదవి వచ్చిందని, కావాల్సినంత దోపిడీ జరుగుతున్నదని, ఇంకా ఎందుకు తమను తిడుతున్నారో అర్థం కావడం లేదని సందేహం వెలిబుచ్చారు. అంతర్జాతీయ వివాదం 100 కోట్ల విరాళం గురించి కాదని, అదానీ అక్రమాల గురించి అని గుర్తుచేశారు. అదానీతో అన్ని ఒప్పందాలను రద్దు చేయాలనేదే బీఆర్ఎస్ ఏకైక డిమాండ్ అని స్పష్టంచేశారు. అదానీతో కేంద్రం కలిసి చేపట్టిన ప్రాజెక్టులను బీఆర్ఎస్ ప్రభుత్వానికి అంటగడుతున్నారని మండిపడ్డారు. ఎంపీగా కూడా పనిచేసిన రేవంత్‌రెడ్డికి జాతీయ రహదారుల ప్రాజెక్టులు ఎవరిస్తారో కూడా తెలియదా? అని ప్రశ్నించారు. రామన్నపేటలో ప్రజలు తిరగబడితే కొడంగల్‌లో 9 మిలియన్ టన్నుల సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టాలని చూస్తున్నారని తెలిపారు. అదానీ, అల్లుడు, అన్నలు, బావమరిది కోసమే రేవంత్ పనిచేస్తున్నారని విమర్శించారు. తెలంగాణభవన్‌లో మంగళవారం శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేశ్‌తో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
మరి నువ్వు దొంగవా రేవంత్?
‘నేను ప్రశ్నిస్తే సైకోనా? తెలంగాణ వనరులను దొంగకు దోచిపెడితే మరి నువ్వు దొంగవా?’ అని కేటీఆర్ నిలదీశారు. ‘అదానీ రాష్ట్రం వదిలి వెళ్లాడు అని సీఎం అనుంగు పేపర్లోనే వార్త వచ్చింది. ఏదో నిన్న రాహుల్‌గాంధీ ఫోన్ చేసి తిట్లు తిట్టడంతో అట్ల యాక్షన్ చేసిండు. అదానీ వ్యవహారానికి సంబంధించి రెండేండ్ల్ల కిందటే హిండెన్‌బర్గ్ రిపోర్ట్ వచ్చిం ది. రాహుల్‌గాంధీ ఏమో అదానీ దొంగ అంటుంటా రు. రేవంత్‌రెడ్డి మాత్రం ఆయనతో రూ.12,400 కోట్ల ఒప్పందాలు చేసుకుంటారు. కేంద్రం ఇచ్చిన ప్రాజెక్ట్‌లను మేము ఇచ్చామని చెప్తున్నవ్.. నీకు ఏమైనా పరిజ్ఞానం ఉన్నదా? కేసీఆర్ ఏం తప్పు చేసిండని ఆయనను తిడుతున్నవ్? అదానీకి రెడ్ సిగ్నల్ ఇవ్వటమే ఆయన చేసిన తప్పా? బొగ్గు పాలసీ విషయంలో దేశంలో కేంద్రాన్ని నిలదీసిన ఒకే ఒకడు కేసీఆర్. నీలా కాళ్లు పట్టుకోవటం, మసా కొట్టటం, గౌతమ్ భాయ్ అంటూ చుట్టూ తిరిగే రకం కాదు మేము. రాహుల్‌గాంధీ ఫోన్‌చేసి తిట్లు తిడితే రేవంత్ తప్పు ఒప్పుకున్నారు. బీఆర్ఎస్ దెబ్బకు గత్యంతరం లేక ఫీచేముడ్ అన్నందుకు సంతోషం. కానీ, మూసీని మురికికూపంగా మార్చే అంబుజా సిమెంట్ పరిశ్రమ ఏర్పాటుకు ఎందుకు అనుమతిచ్చారు? అదానీతో మొత్తం ఒప్పందాలు రద్దు చేసుకోవాలి. మూసీ ప్రాజెక్ట్‌ను కూడా ఏ పాలసీ లేకుండా ఎలా ఇస్తారు?. నువ్వు తప్పు చేసి మా మీద రుద్దే ప్రయత్నం చేస్తున్న శాడిస్ట్ ముఖ్యమంత్రివి. ఏం చేస్తావో చేసుకో. నీకు భయపడేవాళ్లం కాదు మేము’ అని కేటీఆర్ ధ్వజమెత్తారు.
జాతీయ ప్రాజెక్టులు మేమిచ్చినమా?
అదానీకి ప్రధాని ఇచ్చిన ప్రాజెక్టులను రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్ ఖాతాలో వేసే కుట్రచేశారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘మూడు జాతీయ రహదారుల కాంట్రాక్టులట.. బీఆర్ఎస్ ప్రభుత్వం అదానీకి ఇచ్చిందట. ఎన్హెచ్ఏఐ రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ కింద పనిచేసే ముఖ్యమైన సంస్థ. జాతీయ రహదారుల నిర్మాణానికి ఒప్పందాలు ఈ సంస్థ ప్రధాన బాధ్యత. ఈశాఖ మంత్రి నితిన్ గడ్కరీ.. ఆయన కేటాయించిన పనులను మాకు అంటగట్టారు. 750 కేవీ ట్రాన్స్మిషన్ లైన్ ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అదానీ కంపెనీకి ఇచ్చిందని మరో అబద్ధపు ముచ్చట చెప్పిండ్రు. విద్యుత్తు ప్రాజెక్ట్ కూడా కేంద్రం ఇచ్చిందే. కేంద్రంలోని విద్యుత్తు మంత్రిత్వశాఖ 750 కేవీ విద్యుత్తు ప్రసరణ ప్రాజెక్టుల కోసం ఒప్పందాలు కేటాయిస్తుంది. ఇవి తెలియకుండా మాట్లాడితే ఏమనుకోవాలి’ అని కేటీఆర్ దుయ్యబట్టారు. ‘రక్షణశాఖ పరిధిలోకి వచ్చే పెట్టుబడులను బీఆర్ఎస్కు అట్టగట్టడం మూడో అబద్ధం. రక్షణశాఖకు ఇచ్చిన ప్రాజెక్టులను మేమిచ్చామంటున్నరు. రక్షణశాఖ మా చేతిలో ఉంటుందా? ముఖ్యమంత్రి చెప్పే అబద్ధాలను మీడియా కూడా ప్రశ్నించాలి. డ్రైపోర్ట్ కూడా కేంద్ర, రాష్ట్రానికి సంబంధించిన అంశం. కేంద్రం అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని కూడా మేము ఎవ్వరికీ ఇవ్వలేదు. కానీ ఇచ్చినట్టు చూపించారు’ అని కేటీఆర్ మండిపడ్డారు.
అరెస్టులు, నిర్బంధాలేనా ప్రజాపాలన?
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అక్రమంగా అరెస్టు చేయడం, నిర్బంధించడమేనా ప్రజాపాలన అంటే? అని కేటీఆర్ ప్రశ్నించారు. ‘శైలజ అనే విద్యార్థిని చనిపోతే వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు మా పార్టీ నేత కోవ లక్ష్మి వెళ్తా ఉంటే ఆమెను హౌస్అరెస్ట్ చేసిండ్రు. అనిల్‌జాదవ్, జాన్సన్‌నాయక్ లాంటి నేతలను కూడా అరెస్టు చేసిండ్రు. వాళ్లు పోతే నీకు ఏమైందయ్యా. ఇంటర్నెట్ షట్‌డౌన్, అక్రమ అరెస్టులు, నిర్బంధాలు ఇదేనా ప్రజాపాలన? ఏడాదిలో అదానీ, అల్లుడు, అన్న, బావమరది సృజన్‌రెడ్డికి అమృతం పంచటం కోసం తప్పా.. నువ్వు చేసిన మంచి పనేంది? అసలు అదానీ చెక్ ఇచ్చి 38 రోజులు అయినా ఇప్పటి వరకు ఎందుకు క్యాష్ చేయలేదు? అంటే చెక్ చూపించి వెనక నుంచి ఆ డబ్బు దొబ్బేసే కుట్ర చేస్తున్నారు. అదానీ ఫ్రాడ్ అని రేవంత్‌రెడ్డికి నిన్ననే తెలిసిందా? మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో అదానీని గజదొంగ అంటివి. మహారాష్ట్ర లోగజదొంగ తెలంగాణలో సుద్దపూస అయ్యిండా? ఆయన చెక్ ఇవ్వలేదు. అది క్యాష్ కాలేదు. ఏదో తమాషా చేసిండు. అదానీతో రూ.12,440 కోట్ల పెట్టుబడులు అని చెప్పిండ్రు. అందులో పంప్డ్ స్టోరేజ్ పాలసీ అంట. అసలు తెలంగాణలో పంప్డ్ స్టోరేజీ పాలసీ ఉన్నదా? ముఖ్యమంత్రి చెప్పిన వాటిల్లోనే రెండు అంశాలు బయటపడ్డయి. రాష్ట్రంలో పంప్డ్ స్టోరేజీ పాలసీ లేదు. కొడంగల్‌లో అల్లుడి కోసం భూములు తీసుకుంటుండనుకున్నం.. కానీ ఇప్పుడు అదానీ కోసమని తెలిసింది. రామన్నపేటలో సిమెంట్ పరిశ్రమను ప్రజలు వద్దన్నా పెడుతూ మూసీని కలుషితం చేస్తారట. మళ్లీ కొడంగల్‌లో కూడా అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ పెడుతారట’ అని కేటీఆర్ నిప్పులు చెరిగారు.
ఎవరు పిచ్చోడో వాళ్లే తేల్చుకోవాలి
‘మీడియా మిత్రుడు ఒకరు నిన్న మేఘా సంస్థను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని హైదరాబాద్ వాటర్ బోర్డు రిపోర్ట్ ఇచ్చిందని సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నిస్తే.. ఎవడో పుల్లయ్య, మల్లయ్య చెప్పిండు అన్నడు. ఎల్లయ్య, మల్లయ్య చెప్పలేదు. ప్రభుత్వంలోని నీ శాఖనే చెప్పిందన్న సోయి కూడా లేదు. ముఖ్యమంత్రికి అంతా కన్ఫ్యూజనే. రేవంత్‌రెడ్డి రాష్ర్టాన్ని బద్నాం చేసేలా తప్పుడు ప్రచారం చేస్తుంటే మీడియా ఆ ట్రాప్‌లో పడొద్దు. రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి మధ్య సయోధ్య ఉన్నదా? ఆయన పిచ్చోడా, ఈయన పిచ్చోడా? వాళ్లే తేల్చుకోవాలి’ అని కేటీఆర్ దుయ్యబట్టారు.
చీకట్లో రాహుల్ కాళ్లు పట్టుకోడానికే..
ప్రజల డబ్బు వెచ్చించి ప్రత్యేక విమానాల్లో ఢిల్లీ వెళ్లినప్పుడు ప్రజలకు న్యాయం చేయాలని కేటీఆర్ సూచించారు. ‘రాష్ర్టాభివృద్ధి కోసం ఢిల్లీకి పోతే మంచిదే. 28 సార్లు ఢిల్లీకి పోయి రూ. 28 కూడా తేలేదు. నువ్వు పెద్ద బృందంతో వెళ్లి పెట్టిన ఖర్చు కూడా పడ్తల్ కాకపోతే ఎట్లా? బీజేపీతో చీకటి ఒప్పందం, రాహుల్ గాంధీని కలిసి ఆయనకు మూటలు ఇచ్చి కుర్చీ కాపాడుకునేందుకే నువ్వు ఢిల్లీ వెళ్లేది. రేవంత్ ఢిల్లీ వెళ్లేది చీకట్లో రాహుల్ కాళ్లు పట్టుకోడానికే తప్ప ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం కాదు’ అని దెప్పిపొడిచారు.
మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు అదానీవట!
మైక్రోసాఫ్ట్ సంస్థ నుంచి రెండు దఫాలుగా 37 వేల కోట్ల పెట్టుబడులు తెచ్చామని కేటీఆర్ గుర్తుచేశారు. మైక్రోసాప్ట్ నుంచి ఒకసారి రూ.15 వేల కోట్లు, రెండోసారి రూ. 16 వేల కోట్ల పెట్టుబడులు పట్టుకొచ్చామని వివరించారు. కానీ ఈ ముఖ్యమంత్రి మాత్రం అది అదానీ డాటా సెంటర్ అని రిలీజ్ చేశారని, మైక్రోసాప్ట్ డాటా సెంటర్ పెట్టుబడిని అదానీ డాటా సెంటర్ అని అబద్ధపు ప్రచారం చేశారని మండిపడ్డారు. ‘నీకు సబ్జెక్ట్ తెలియక ఏది పడితే అది మాట్లాడితే రాష్ట్ర గౌరవం మంటగలుస్తుంది. గతంలో కూడా విప్రో చైర్మన్ సత్యనాదెళ్ల అని చెప్పి నవ్వులపాలైనవ్. మైక్రోసాఫ్ట్ వచ్చాక హైదరబాద్‌కు అమెజాన్ వచ్చింది. అమెజాన్ రూ.36 వేల కోట్లు పెట్టుబడులు పెట్టింది. మొత్తం రూ.67 వేల కోట్ల విదేశీ పెట్టుబడులను మేము తీసుకొచ్చినం. పదేండ్లపాటు కష్టపడి సృష్టించిన తెలంగాణ రాష్ట్ర సంపద నాలుగుకోట్ల తెలంగాణ పేదలకు దకాలె తప్ప పెద్దలకు, గద్దలకు కాదన్నది మా సిద్ధాంతం’ అని కేటీఆర్ తేల్చిచెప్పారు.
అదానీని నీలా రహస్యంగా కలవలేదు
దావోస్‌లో అదానీ చేసిన ప్రతిపాదనలను బీఆర్ఎస్ ప్రభుత్వం తిరస్కరించిందని కేటీఆర్ గుర్తుచేశారు. ‘నేను అదానీని కలిశానని ఫొటో రిలీజ్ చేశారు. బరాబర్ దావోస్‌లో కలిసిన. ఆ ఫొటో నేనే ట్విట్టర్లో పెట్టిన. నీలా ఇంటికి పిలిపించుకొని నాలుగు గంటలు రహస్యంగా కలవలేదు. వందకోట్లు నజరానా తీసుకోలేదు. కోహినూరు హోటల్లో కాళ్లు పట్టుకోలేదు. నాకు నీలా లుచ్చా పనులు చేసే అలవాటు లేదు. ఏదీ చేసినా బజాప్తా చేస్తా. అదానీని మేము ఏరోజూ ఎంకరేజ్ చేయలేదు. అదానీకి తెలంగాణలో ఏంట్రీలేదని బరాబర్ చెప్పినం. మీలా వందల ఎకరాల భూములను అప్పగించేందుకు, వేల కోట్ల పెట్టుబడుల ఒప్పందాల పేరుతో దోచిపెట్టే కుట్రచేయలేదు. నీలా ఆయన కాళ్లు ఒత్తుకుంటా ఉండే అలవాటు నాది కాదు’ అని ధ్వజమెత్తారు.