భువనగిరి అర్బన్, అక్టోబర్ 9: కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో భాగంగా కల్యాణలక్ష్మి చెక్కుతోపాటు తులం బంగారం ఎప్పుడిస్తారని బీఆర్ఎస్ నాయకులు నిలదీశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని ఓ గార్డెన్లో బుధవారం ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ భువనగిరి పట్టణ అధ్యక్షుడు ఏవీ కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. కల్యాణలక్ష్మి చెక్కులతోపాటు తులం బంగారం వెంటనే అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏవీ కిరణ్‌కుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అని ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చి పది నెలలు గడుస్తున్నా ఏ ఒక్క హామీ సరిగ్గా అమలు చేయలేదని విమర్శించారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా గత ప్రభుత్వం ఇచ్చిన మాదిరిగానే ప్రజలకు కల్యాణలక్ష్మి చెక్కులను అందిస్తున్నదని దుయ్యబట్టారు. వానకాలం రైతుబంధును ఇప్పటికీ ఇవ్వలేదని, ఏకకాలంలో రెండు లక్షల రైతు రుణమాఫీ చేయలేదని మండిపడ్డారు. హామీల అమలులో కాలయాపన చేస్తే బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.