హైదరాబాద్, మార్చి 20 (నమస్తేతెలంగాణ): వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మూడో బడ్జెట్లోనూ మొండిచెయ్యి చూపిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. నాడు ఓట్ల కోసం విడుదల చేసిన అభయహస్తం నేడు తెలంగాణ ప్రజల పాలిట భస్మాసుర హస్తంగా మారిందని మండిపడ్డారు. శుక్రవారం గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఆయన నిరసన తెలిపారు. బాకీ కార్డులతో కూడిన ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ బాండ్ పేపర్లు రాసిచ్చి, 3 నెలల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ప్రస్తుత బడ్జెట్లో గ్యారెంటీ అనే పదం లేకుండా, డిక్లరేషన్ల ఊసెత్తకుండా వంచించారని దుయ్యబట్టారు. గ్యారెంటీలకు మొదటి బడ్జెట్లోనే చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి, మూడో బడ్జెట్లోనూ ఆ ప్రస్తావన లేకపోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ చేసిన మోసాన్ని తెలంగాణ ప్రజలకు తెలియజెప్పేందుకే అమరుల స్తూపం సాక్షిగా నిరసనకు దిగామని ప్రకటించారు.
రూ.2,500 కోసం మహిళల ఎదురుచూపులు
బీసీలకు ఏటా రూ.20 వేల కోట్ల చొప్పున ఐదేండ్లలో లక్ష కోట్లు కేటాయిస్తామని హామీలు గుప్పించిన రేవంత్‌రెడ్డి, మూడు బడ్జెట్లు కలిపినా రూ. 20 కోట్లు ఇచ్చే పరిస్థితిలేదని విమర్శించారు. ‘వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, గీత, చేనేత కార్మికులు, దివ్యాంగులు పింఛన్ల పెంపుకోసం, 18 ఏండ్లు నిండిన మహిళలు రూ. 2,500 కోసం, పెండ్లి చేసుకున్న ఆడబిడ్డలు తులం బంగారం కోసం, కాలేజీలకు వెళ్తున్న యువతులు స్కూటీల కోసం..అన్నదాతలు రూ.15 వేల రైతుభరోసా కోసం, రైతు కూలీలు, ఆటోవాలాలు ఏటా రూ.12వేల భృతి కోసం ఎదురుచూస్తున్నారు’ అని గుర్తుచేశారు.
ఉద్యోగాల భర్తీపై నమ్మకద్రోహం
ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఆశ చూపిన కాంగ్రెస్ నిరుద్యోగులకు నమ్మకద్రోహం చేసిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. రెండున్నరేండ్లలో 11,921 ఉద్యోగాలిచ్చి 67 వేలు ఇచ్చామని చెప్పుకోవడం సిగ్గుచేటని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ నేతలు స్కామ్‌లకు పాల్పడుతూ ప్రజాధనాన్ని లూటీ చేస్తూ పాలనను గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. ఏదేమైనా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా వదిలిపెట్టబోమని తేల్చిచెప్పారు.
బాకీ కార్డులు ప్రదర్శిస్తూ..పాటలు పాడుతూ
గన్‌పార్క్ వద్ద కేటీఆర్, హరీశ్‌తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలులో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ గన్‌పార్క్ వద్ద నిరసన తెలిపారు. మహిళలకు రూ. 2,500, రైతుభరోసా రూ.15,000, ఆటో డ్రైవర్లకు రూ.12వేలతో కూడిన బాకీ కార్డులను ప్రదర్శించారు. ‘కాంగ్రెస్ పాలన..గారడీ పాలన.. గ్యారెంటీలేని పాలన! దొంగల రాజ్యం..దోపిడీ రాజ్యం! కాంగ్రెస్ వద్దు.. గ్యారెంటీలు ముద్దు! కమీషన్లు ఫుల్లు..హామీల అమలు నిల్లు! ప్యూర్, క్యూర్, రేర్.. రేవంత్‌రెడ్డి చోర్!’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ‘లూటీ చేసినరు కొడుకో..నిన్ను నిండా ముంచినరు కొడుకో.. కాంగ్రెస్సోళ్లు కాదుర కొడుకో..వాళ్లు దండుపాళ్యం బ్యాచ్రో కొడుకో’అంటూ పాట పాడుతూ కాంగ్రెస్ తీరును ఎండగట్టారు.
బడ్జెట్లో జర్నలిస్టులకు అన్యాయం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణ ప్రజలను తీవ్ర నిరాశపరిచింది. జర్నలిస్టుల సంక్షేమం గురించి బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావనే లేకపోవడం బాధాకరం. డిఫ్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క రూ.3,24,234 కోట్ల భారీ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రకటించినప్పటికీ 60 శాతానికి పైగా ఉన్న బీసీలకు 5 శాతం నిధులు కూడా కేటాయించకపోవడం దారుణం. సమగ్ర సర్వేలో బీసీల జనాభా 40 లక్షలు పైచిలుకు తగ్గించి మోసంచేశారు. బడ్జెట్లో రూ.20 వేల కోట్లు కేటాయిస్తామన్న హామీని నిలబెట్టుకోలేదు. మంత్రి మండలిలో యాదవ, మున్నూరుకాపు, రజక, లంబాడీలకు స్థానం కల్పించకుండా, కార్పొరేషన్ల చైర్మన్ల పదవుల్లో బీసీలను నియమించకుండా నయవంచన చేశారు. యువతకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని విస్మరించారు. వృత్తివిద్యా కోర్సులు, ఫీజు రీయింబర్స్మెంట్ ప్రస్తావనలేదు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి.
– వద్దిరాజు రవిచంద్ర, రాజ్యసభ సభ్యుడు
రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రైవేశపెట్టిన బడ్జెట్‌తో 6 గ్యారెంటీలు, 11 డిక్లరేషన్లు మోసపూరితమేనని తేలింది. ఇది అంకెల గారడీ కాదు.. అంకెలనే మార్చడం. ఇదే కాంగ్రెస్ దగాకోరు తనానికి నిదర్శనం. దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజలను దగా చేసే బడ్జెట్ ప్రైవేశపెట్టలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ‘కష్టాలు.. కన్నీళ్లు.. కూల్చివేతలు, పేల్చివేతలు. ఈ బడ్జెట్ తెలంగాణను తిరోగమనంలోకి నెట్టివేసేలా ఉంది. ఈ బడ్జెట్‌తో పేదలు, మహిళలు, రైతులకు ఎలాంటి న్యాయం జరుగదు. రైతుభరోసా పెంపుపై స్పష్టత ఇవ్వలేదు. రూ.12 వేల హామీ కూడా అమలవుతుందో, లేదో.
-మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
ఆర్థిక మంత్రి భట్టివిక్రమార్క అసెంబ్లీలో గోల్మాల్ బడ్జెట్ ప్రవేశ పెట్టారు. అంకెల గారడీతో పేదలు, మహిళలు, నిరుద్యోగులను వంచించారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలుపై బడ్జెట్లో స్పష్టత లేదు. ప్రజలకు పనికొచ్చే పథకాలకు కేటాయింపులులేవు కానీ స్కామ్‌లు చేసే ప్రాజెక్టులకు కేటాయింపులు చేశారు.
– మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి