హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): గ్రామ పంచాయతీలకు నిధుల విడుదల కోసం ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఒత్తిడి ఫలించింది. పంచాయతీలకు కేంద్ర ఆర్థిక సంఘం నిధులు రూ.220 కోట్లను విడుదల చేస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. గ్రామ పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడంలేదని బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీలో, అసెంబ్లీ బయట ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు.
అన్ని వైపుల నుంచి ఒత్తిడి రావడంతో ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. కొద్ది మొత్తంలో నిధులు విడుదల చేసిందని, పాత బకాయిలకు కూడా సరిపోవని పంచాయతీ కార్యదర్శులు చెప్తున్నారు. పెద్ద మొత్తంలో విడుదల చేస్తే అవసరాలు తీరేవని అంటున్నారు.
నిమ్స్మేకు 3స్టార్ రేటింగ్
హైదరాబాద్, ఆగస్టు 13(నమస్తే తెలంగాణ): సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి, ప్రోత్సాహానికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంఎస్ఎంఈ(నిమ్స్‌మే) కృషికి గుర్తింపుగా కెపాసిటీ బిల్డింగ్ కమిషన్(సీబీసీ) ఆ సంస్థను 3స్టార్ రేటింగ్‌తో సత్కరించింది. ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన సీఎస్టీఐ సదస్సు సందర్భంగా సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయమంత్రి డాక్టర్ జితేంద్రసింగ్ నిమ్స్‌మే డైరెక్టర్ జనరల్‌కు 3స్టార్ రేటింగ్ సర్టిఫికెట్ ప్రదానం చేశారు.