BRS President KCR | మానవ పరిణామ క్రమంలో జరిగే గుణాత్మక పురోభివృద్ధి వెనక ఎందరో మహనీయుల త్యాగాల కృషి ఉన్నదని, తెలంగాణ సాధన కోసం జరిగిన త్యాగాల క్రమం కూడా అలాంటిదేనని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. బీఎస్పీ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సోమవారం ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. `మీరు బీఎస్పీ నుంచి వచ్చిన వాళ్లు.. మీ మనసులో ఏముంటదో నాకు తెలుసు.. ఈ సందర్భంగా మీకు కొన్ని చారిత్రక విషయాలు చెప్పాలి. నాటి స్వాతంత్య్ర సాధన అనంతరం నెహ్రూ ఆధ్వర్యంలో సాగిన నూతన ప్రభుత్వంలో నాటి సంస్థానాధీశులు, దేశ్ముఖ్లే గాంధీ టోపీలు పెట్టుకుని ప్రజా ప్రతినిధులైండ్రు. 1969 ఉద్యమంలో ముల్కీ రూల్స్ కోసం పోరాటం సాగింది. సుప్రీంకోర్టు కొనసాగించాలని చెప్పినా జై ఆంధ్ర ఉద్యమం తెచ్చి అణిచివేసిండ్రు. 400 మంది చనిపోయిండ్రు… ఆ తర్వాత తెలంగాణ చైతన్యం ఆగమైంది` అని చెప్పారు.
`మనకు ఏమన్న ఎటమటమైతే ఢీలా పడిపోవడం అలవాటే…అట్లా నాడు ఉద్యమం సల్లపడింది. తెలంగాణ అశక్త అయిపోయి అసహాయ పరిస్థితిలో అన్నీ పార్టీల్లో మన నాయకులు బానిసలై పోయిండ్రు. ఆంధ్ర పాలకులకు వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడితే అణచివేత పరిస్థితి వుండే నాడు. నాకు 69 నుంచే తెలంగాణ మనసులో ఉంది. అనంతర కాలంలో అనేక అనుభవాలు ఉన్నాయ్. కష్టాలు ఎదుర్కొన్న.
ఒక్కరికి కూడా సోయి లేకుండే. తెలంగాణ కోసం పోదాం పా అంటే నువ్వంటవు గానీ అయితాదే` అని ఎనకపట్లు పడేవాళ్లు` అని కేసీఆర్ అన్నారు.
`1995లో సీఎం అయిన తర్వాత చంద్రబాబుకు ప్రపంచ బ్యాంకు పిచ్చి పట్టుకుంది.. ఆర్థిక సంస్కరణలు అమలు చేయాలని చూసేవాడు. తాగునీరు, విద్యుత్ వంటి ప్రజలకు సంక్షేమం అక్కరలేదనే భావన ఆయనకు ఉండేది. విద్యుత్ ఛార్జీలు పెంచినందుకు వ్యతిరేకంగా నేను రాజీనామా చేసిన. అనంతరం విద్యుత్ ఉద్యమ కారులను కాల్చి చంపేసిండ్రు. మనం ఎన్ని విజ్ఞప్తులు చేసినా నిర్లక్ష్యం చేసినాడు. దానికి నాకెంతో మనస్తాపం చెందిన. తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టాలని నిర్ణయించిన. నాటి 69 ఉద్యమ కారులతో చర్చలు మొదలుపెట్టి. ఇది స్ట్రీట్ ఫైటా..స్టేట్ ఫైటా అని అడిగిన వారిని. దేశంలో రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఎందో తెల్వకుంటా. రాళ్లు పట్టుకొని ఎంతదూరం ఉర్కతం.. పార్లమెంటులో చట్టం చేస్తే తప్ప రాదు అన్నప్పుడు అటువంటి విధానమే అనుసరించాలి.బహుజన సిద్ధాంతం మీద ఇంకా లోతుగా చర్చ జరగాలి. విపరీతమైన మేధోమథనం జరగాలి. స్పష్టమైన అవగాహన వచ్చేదాకా సాగాలి` అని కేసీఆర్ పేర్కొన్నారు.
`14 ఏండ్లు రాష్ట్ర సాధన కోసం, 10 ఏండ్లు ప్రగతి సాధన కోసం నా ఉద్యమం సాగింది. కోటానుకోట్ల మంది బహుజనుల చైతన్య స్రవంతి కోసం మీరు ఆలోచన చేసినవాళ్లు. మనకు నిర్దిష్టమైన అవగాహన ఉండాలి. ఒకసారి కమిట్ అయినంక వెనక్కు రావద్దు. ఈ నడుమ జరిగిన రివ్యూ లో మనవాళ్లు చెప్పిన అంశాలు ఆశ్చర్యం కలిగించింది. దళిత బంధు పథకంతో మనకు దెబ్బ పడ్డదని అంటున్నారు కానీ అట్లాంటి ఆలోచన సరికాదు. దళిత బంధు పొందిన కుటుంబాలు బాగుపడ్డాయి. దళిత సమాజం దీన్ని పాజిటివ్ గా ఎందుకు తీసుకోలేకపోయిందో బహుజన యువ మేధావులు విశ్లేషించాలి. దళిత శక్తితోపాటు బహుజన శక్తి కలిసిపోవాలే అనే సిద్ధాంతం కోసం కాన్షీరాం పోరాటం చేసిండు. దాన్ని మనం కొనసాగించాలే` అని కేసీఆర్ చెప్పారు.
`బహు జనుల్లో సామాజిక చైతన్య స్థాయి మరింతగా పెంచాల్సి ఉన్నది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దాడులు జరిగేది దళితుల మీదనే. పాలకుల మీద ఐకమత్యం తో పోరాటం చేసి హక్కులు సాధించు కోవాలే. కలెగలిసి పోవాలంటే ఏంచేయాలో ఆలోచన చేయాలి. అగ్రవర్ణాల్లోని పేదలతో కూడా కలుపుకు పోవాలి. ప్రతీప శక్తులమీద పోరాడుతూనే కలిసివచ్చే శక్తులను కలుపుకపోవాలి. వారి శక్తిని మనం ఉపయోగించుకోవాలి. 20 శాతం ఉన్న దళితులు ఐక్యంగా నిలబడితే సాధించలేనిదేమీ లేదు.
రాజకీయాల్లో అనేక కష్టాలు వస్తాయి. తట్టుకొని నమ్మిన సిద్ధాంతం కోసం ముందుకు సాగాలి.
ఇండియా లో ఏరాష్ట్ర సెక్రటేరియట్ కు పెట్టలే.. దేశానికే ఆదర్శంగా మన సచివాలయానికి డా బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టినం` అని కేసీఆర్ అన్నారు.
`తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో నేను తిన్న తిట్లు ఎవరూ తినలే. నా మీద దండకాలు కూడా రాసిండ్రు… ఎన్ని కష్టాలెదురైనా ప్రలోభాలు పెట్టినా తెలంగాణ వాదాన్ని వదల్లేదు. అవసరమైన పంథాను ముందుపెట్టి తెలంగాణ కోసం పోరాటం లో కేంద్రాన్ని గజ్జున వణికించినం. శూన్యం నుంచి సుడిగాలి ని సృష్టించినం.. గిటువంటి సమస్యలెన్నో చూసినం ఇదో లెక్కగాదు. మీలాంటి యువత నాయకత్వం ఎదిగితే.. ఈ చిల్లర వచ్చిపోయే వాళ్ల ఇట్లాంటి స్వార్థ పరుల అవసరం వుండదు. వచ్చే ఎన్నికల వరకు మీరంతా నాయకులుగా ఎదగాలే. దేశంలో ఇంతవరకూ దళిత బంధు వంటి పథకాన్ని తేలే ఎవ్వరూ. అనేక చర్చలు మేధోమథనం అనంతరమే రైతుబంధు తెచ్చినం. సాగునీటి ప్రాజెక్టులను తెచ్చినం. తద్వారా రాష్ట్రంన్లో మూడు కోట్ల టన్నులకు ధాన్యం ఉత్పత్తి చేరుకుంది. నాటి ఉద్యమ కాలంలో అనివార్యంగా కొన్ని మాటలు అనాల్సి వచ్చిందే తప్ప ఎట్లబడితే అసభ్యంగా దుర్భాషలకు, బూతులకు దిగలే. నేను పరుష పదాలతో దురుసు మాటలతో తిట్టలేదు. పబ్లిక్ లైఫ్ అన్నప్పుడు ఓడినా గెలిచినా ఒక్కతీరుగా వుండాలే` అని కేసీఆర్ తెలిపారు.
`మన ప్రజలు మన రాష్ట్రం అనే పద్ధతిలోనే ముందుకుసాగాలె.. అధికారం ఉంటే ఒకతీరు లేకుంటే ఓ తీరు ఉండొద్దు. అగాధంలో ఉన్న తెలంగాణకు బీఆర్ఎస్ పాలనలో ధైర్యం వచ్చింది..ఇవి ఎక్కడ పోవు.. వచ్చేటయిన ఎక్కువిస్తాడేమో నని ఆశకు పోయి మోసపోయిండ్రు. కాంగ్రేస్ పార్టీ ఇచ్చిన హామీలకు నమ్మి అటు మల్లిండ్రు…ఇప్పుడు ప్రజలకు అర్థమైతున్నది వాస్తవం. ఒకసారి ఓడితే నష్టమేమీ లేదు` అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.