జగిత్యాల, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ)/కరీంనగర్ కార్పొరేషన్/ హుజూరాబాద్/జమ్మికుంట/వరంగల్ ప్రతినిధి: బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పాల్గొన్న ప్రజాఆశీర్వాద సభలు పార్టీ శ్రేణులు, ప్రజలతో పోటెత్తాయి. కరీంనగర్లో కదనభేరి కవాతు చేయగా, చొప్పదండి ప్రజలు నీరాజనం పలికారు. హుజూరాబాద్ జనం ఉర్రూతలూగగా, పరకాల జనజాతరను తలపించింది. కరీంనగర్, చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర మండలం పత్తికుంటపల్లిలో, హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంటలో, పరకాల నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం జరిగిన ప్రజాఆశీర్వాద సభలు విజయవంతం అయ్యాయి. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గంగుల కమలాకర్, సుంకె రవిశంకర్, పాడి కౌశిక్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలకు ఊరూరూ కదిలిరాగా సభా ప్రాంగణాలన్నీ జనసంద్రాన్ని తలపించాయి. మహిళలు, వృద్ధులు, రైతులు, యువత పెద్ద ఎత్తున సభకు తరలివచ్చి జననేత, సీఎం కేసీఆర్‌కు నీరాజనం పట్టారు.
సభా ప్రాంగణాలు కిక్కిరిసిపోగా, వేలాది మంది రోడ్లపైనే బారులుదీరి కనిపించారు. కరీంనగర్‌లోని ఎస్సార్ఆర్ కళాశాల మైదానంలోని సభా ప్రాంగణమంతా జనంతో నిండిపోయింది. నగరంలోని 60 డివిజన్ల నుంచి మహిళలు భారీగా తరలివచ్చారు. కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ గ్రామాల నుంచి సభకు వచ్చే దారులన్నీ గులాబీమయం అయ్యాయి. గంగాధ మండలం పత్తికుంటపల్లిలో నిర్వహించిన చొప్పదండి నియోజకవర్గ ప్రజాఆశీర్వాదసభకు జనసందోహం పోటెత్తింది. నియోజకవర్గంలోని గంగాధర, రామడుగు, చొప్పదండి, బోయిన్పల్లి, మల్యాల, కొడిమ్యాల మండలాల నుంచి పలు వాహనాల్లో ప్రజలు భారీగా తరలివచ్చారు. కేసీఆర్ తొలిసారి గంగాధర సభలో పాల్గొనడంతో ఆయనను చూసేందుకు ప్రజలు ఉత్సాహం చూపారు.
హుజూర్నగర్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన ప్రజాఆశీర్వాద సభకు ఇసుకేస్తే రాలనంత జనం పోటెత్తారు. ‘జై తెలంగాణ.. జై కేసీఆర్.. జై కౌశికన్న’ అన్న నినాదాలు మిన్నంటాయి. ప్రముఖ కళాకారుడు మిట్టపల్లి సురేందర్ బృందం ఆట, పాటలు జనాన్ని ఆలోచింపజేశాయి. ముఖ్యంగా ‘దేఖ్ లేంగే.., రామక్క..’ పాటలు ఉర్రూతలూగించాయి. కళాకారులతోపాటూ ప్రజలూ నృత్యాలు చేస్తూ సందడి చేశారు. పరకాలలో జరిగిన బీఆర్ఎస్ ప్రజాఆశీర్వాదసభ జనంతో కిటకిటలాడింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగిస్తున్నంత సేపు జనం నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ధరణిని, రైతుబంధును తీసేసే కాంగ్రెస్ కావాలా అన్నప్పుడు.. వద్దు, వద్దు అంటూ జనం నినాదాలు చేశారు. కళాకారులతో కలిసి ప్రజలు ఆడిపాడారు. చప్పట్లతో కోరస్ కలిపారు.