హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమాన్ని ఉధృ తం చేసిన చారిత్రక ఘట్టం నవంబర్ 29ని రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో దీక్షా దివస్‌గా నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు నిర్ణయించారు. కేసీఆర్ దీక్ష ప్రా రంభించిన ఆ రోజును స్మరించుకుంటూ ఉద్యమ జ్ఞాపకాలను గుర్తుచేసుకొనేలా ఫొటో ఎగ్జిబిషన్లు ఏర్పాటుచేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఆ రోజున రక్తదాన శిబిరాలు, రోగులకు పండ్ల పంపిణీ వంటి సామాజిక సేవా కార్యక్రమాలను పెద్దఎత్తున నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా దీక్షా దివస్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. కేటీఆర్ దిశానిర్దేశంతో తెలంగాణభవన్‌లో మంగళవారం బీఆర్ఎస్వీ ముఖ్యనేతలతో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ సమావేశమయ్యారు. కేసీఆర్ దీక్ష ప్రారంభించిన నవంబర్ 29 నుంచి దీక్ష ఫలప్రదమైన డిసెంబర్ 9వరకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. అనంతరం కేటీఆర్ సూచనలతో అన్ని విశ్వవిద్యాలయాలకు ఇన్చార్జులను నియమించారు.
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఇన్చార్జిగా మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్, ఉస్మానియా వర్సిటీకి కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, వరంగల్‌లోని కాకతీయ వర్సిటీకి కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి, కరీంనగర్‌లోని శాతవాహన వర్సిటీకి కార్పొరేషన్ మాజీ చైర్మన్ చిరుమిళ్ల రాకేశ్‌కుమార్, నిజామాబాద్‌లో ని తెలంగాణ వర్సిటీకి రాజారామ్ యాదవ్, మహబూబ్‌నగర్‌లోని పాలమూరు వర్సిటీకి కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఆంజనేయగౌడ్ను ఇన్చార్జిగా నియమించారు. హైదరాబాద్‌లో ని చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీకి బోయినపల్లి సత్యవతి, మిగిలిన వర్సిటీలకూ నాయకులను నియమించారు.