KTR | హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ తుగ్లక్ విధానాలపై, నిరంకుశ పాలనపై, హామీలను ఎగవేసిన మోసపూరిత ప్రభుత్వ తీరుపై మన పోరాటం కొనసాగిద్దామని గులాబీ శ్రేణులకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. గత ఏడాది కాలంగా కాంగ్రెస్ సర్కార్ పాలనా వైఫల్యాలను ఎండగట్టిన పార్టీ శ్రేణులకు ఆయన నూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా సందేశమిచ్చారు.
‘ప్రాణ సమానులైన బీఆర్ఎస్ తోబుట్టువుల్లారా’ అంటూ ప్రారంభించిన కేటీఆర్.. గత ఏడాదిపాటు చేసిన పోరాటాలను, నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తూనే రానున్న రోజుల్లోనూ మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించేదాకా పోరాటం కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. ఏడాది కాలంగా కాంగ్రెస్ నిరంకుశ పాలనపై గులాబీ సైనికులందరూ కనబరిచిన పోరాట స్ఫూర్తికి పేరుపేరునా, ప్రతి ఒకరికీ శిరస్సువంచి సలాం చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. గెలుపు-ఓటములతో నిమిత్తం లేకుండా క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు కనబరిచిన కదనోత్సాహం.. రాష్ట్రస్థాయి నాయకత్వంలో మాటలకందని స్ఫూర్తిని నింపిందని చెప్పారు. రాష్ట్ర ప్రజల పక్షాన గులాబీ సైనికులు విరామం ఎరుగని పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు.
అబద్ధాల పునాదులపై అధికారంలోకి వచ్చిన తుగ్లక్ పాలనతో ఇబ్బందులు పడుతున్న అన్ని వర్గాల పక్షాన అలుపెరుగని పోరాటం చేస్తున్న గులాబీ శ్రేణులను ఆయన అభినందించారు. రైతన్నలు, నేతన్నలు, బడుగు బలహీనవర్గాలు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల పక్షాన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సమరభేరి మోగించారని కొనియాడారు. నిరుద్యోగుల హకుల కోసం కాంగ్రెస్ సరారును నిలదీసి, ఆరు గ్యారెంటీల గారడీని ప్రజాక్షేత్రంలో ఎండగట్టిన పార్టీ శ్రేణులను ఆయన అభినందించారు.
‘మూసీలో మూటల వేట నుంచి లగచర్ల లడాయి దాకా అన్యాయం జరిగిన ప్రతిచోటా బాధితుల పక్షాన మీరు కొట్లాడారు. తెలంగాణ ప్రజల గుండెచప్పుడును అడుగుడుగునా మీరు ప్రతిధ్వనింపజేశారు’ అని కేటీఆర్ పార్టీ శ్రేణులను కొనియాడారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు పార్టీ చేసిన పోరాటాలు.. చరిత్రపై చెరగని సంతకాలుగా నిలుస్తాయన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యలను అత్యంత సమర్థంగా తిప్పికొట్టిన సందర్భాలు పోరాటపథంలో నిలిచి ఉండే మైలురాళ్లు అని ఆయన అభివర్ణించారు. అసమర్థ, అనాలోచిత కాంగ్రెస్ విధానాలపై తెలంగాణ ప్రజల కోసం గల్లీ నుంచి ఢిల్లీ దాకా బీఆర్ఎస్ శ్రేణులు మోగించిన ‘జంగ్’ సైరన్ ముఖ్యమంత్రికి ముచ్చెమటలు పట్టించిందని గుర్తుచేశారు.
గులాబీ సైన్యం సాగించిన అలుపెరగని పోరాటాల వల్లే అదానీ ఆశజూపిన రూ.100 కోట్లను ప్రభుత్వం వెనకి ఇవ్వాల్సి వచ్చిందని కేటీఆర్ పేర్కొన్నారు. లగచర్ల గిరిజనుల వేదన దేశం ముందు కాంగ్రెస్ నియంతృత్వాన్ని ఎండగట్టిందని చెప్పారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణను కుకలు చింపిన విస్తరిలా మార్చే కాంగ్రెస్ కుట్రలను అడుగడుగునా ప్రశ్నిద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ‘పార్టీకి పునాది రాళ్లు శ్రేణులే. పార్టీ జెండాకు వెన్నెముక మీరే’ అని కేటీఆర్ స్పష్టం చేశారు. రేపటి తెలంగాణ రాజకీయ ముఖచిత్రంపై బీఆర్ఎస్ పక్షాన మెరిసే వజ్రాయుధాలు శ్రేణులేనని కొనియాడారు.