హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, వారి కుటుంబ సభ్యులపై అసత్య ఆరోపణలు చేసిన మహాన్యూస్ చానల్‌పై ఆ పార్టీ మహిళా నేతలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని సైబర్ క్రైమ్ కార్యాలయంలో డీసీపీకి ఫిర్యాదు అందజేశారు. మహాన్యూస్ చానల్, దాని సీఈవో పవన్ మారెళ్ల, క్రైమ్ రిపోర్టర్ మహేశ్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని కోరారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల గౌరవానికి భంగం వాటిల్లేలా అసత్య, అసభ్యకరమైన కంటెంట్‌ను మహాన్యూస్ ప్రసారం చేసిందని పేర్కొన్నారు. మహా న్యూస్ తమ యూట్యూబ్ చానల్ (https://www.youtube. com/@ mahaanews)లో ఓ వీడియోలో తీవ్రమైన పదజాలం, అశ్లీల వ్యాఖ్యలు, అసత్య ఆరోపణలు చేశారని ఫిర్యాదులో తెలిపారు. ఇవి బాధితుల వ్యక్తిగత ప్రతిష్ఠను కించపరిచేలా ఉండటం వల్ల ఐటీ చట్టం, భారతీయ న్యాయ సంహిత, పౌర నిందల చట్టాల కింద ఫిర్యాదు చేయాల్సిన నేరంగా పేర్కొన్నారు.
మహాన్యూస్, సీఈవో పవన్ మారెళ్ల, రిపోర్టర్ మహేశ్‌లపై సంబంధిత చట్టాల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని మహిళా నేతలు తమ ఫిర్యాదులో కోరారు. కేటీఆర్‌పై విష ప్రచారానికి సంబంధించి పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపించాలని, ఆ యూట్యూబ్ చానల్‌కు నోటీసులివ్వాలని, వీడియో డిజిటల్ ఫోరెన్సిక్ విశ్లేషణ చేయాలని విజ్ఞప్తిచేశారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా చట్టపరమైన చర్యలు ప్రారంభించాలని కోరారు. ఇలా మీడియా వేదికలను దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేటీఆర్‌పై విష ప్రచారం బీఆర్ఎస్ కార్యకర్తలు, పార్టీ మద్దతుదారుల్లో తీవ్ర మనోవేదన కలిగించిందని తెలిపారు. గౌరవనీయ నేతలపై ఇలాంటి దుష్ప్రచారం జరగడాన్ని ఖండిస్తూ, ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో బీఆర్ఎస్ లీగల్ సభ్యులు జక్కుల లక్ష్మణ్, ఉపేంద్ర, పార్టీ మహిళా నాయకులు పావనిగౌడ్, నిరోష, సుశీలారెడ్డి, సునీత, శ్రవంతి, కవిత ఉన్నారు.
బీఆర్ఎస్ లీగల్ సెల్‌కు చెందిన న్యాయవాదులు, బీఆర్ఎస్ మహిళా నేతలు ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్లగా తొలుత ఫిర్యాదు తీసుకోవడానికి సైబర్ క్రైమ్ పోలీసులు నిరాకరించారు. న్యాయవాది లక్ష్మణ్.. పోలీస్ రూల్స్, రెగ్యులేషన్స్, బీఎన్ఎస్ సెక్షన్‌లోని నిబంధనలు వివరించిన అనంతరం ఫిర్యాదు కాపీ తీసుకున్నారు. అనంతరం కంప్లయింట్‌ను ఆన్లైన్ చేశారు. విచారణ చేపడతామని తెలిపారు.