BRS Party | హైదరాబాద్ : ఉమ్మడి మహబూబ్నగర్ స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల బరిలో బీఆర్ఎస్ పోటీ చేయనున్నట్లు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రకటించారు. ఒకట్రెండు రోజుల్లో అభ్యర్థిని ఖరారు చేస్తామని తెలిపారు.
మొత్తం ఓట్లు 1445 మంది ఉండగా, బీఆర్ఎస్ తరపున పార్టీ బీ ఫారం మీద గెలిచింది 1006 మంది అని పేర్కొన్నారు. వివిధ కారణాల చేత అనర్హత వేటు, మరణించిన వారు పోగా 850 పై చిలుకు ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీ వారేనని తెలిపారు. దీంతో స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీనే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నిర్ణయించిన అభ్యర్థి గెలుపు కోసం అందరం కలసికట్టుగా కృషిచేద్దాం అని నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు.