హైదరాబాద్, డిసెంబర్11(నమస్తే తెలంగాణ): వేలం పాటల ఏకగ్రీవాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా కనిపించినా.. ప్రజాక్షేత్రంలో మాత్రం గులాబీ దండు సత్తా చూపింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక పిలుపు కూడా ఇవ్వకుండానే పల్లెల్లో గులాబీ దండు సత్తా చాటింది. హోరాహోరీగా సాగిన తొలి విడత గ్రామ పంచాయితీ ఎన్నికల్లో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అధికార కాంగ్రెస్ పార్టీకి ముచ్చెమటలు పట్టించారు. ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనలు, మంత్రులు, ఎమ్మెల్యేల బెదిరింపులు, దాడులు, హత్యలు, అధికారం, డబ్బు అన్నింటినీ ఎదుర్కొని ప్రజలు గులాబీ జెండాను రెపరెపలాడించారు. గులాబీ సైన్యం పోటీచేసిన ప్రతి పంచాయతీలో పోటీ నువ్వా-నేనా అన్నట్టు సాగింది. సంఖ్యాపరంగా కాంగ్రెస్ పార్టీకి పంచాయితీల సంఖ్య కొద్దిగా మెరుగ్గా ఉన్నట్టు కనిపించినా.. ఆ పార్టీకి గ్రామాల్లో 56% వ్యతిరేక ఓట్లు పడ్డట్టు ఎన్నికల ఫలితాలను బట్టి తెలుస్తున్నది.
బీఆర్ఎస్ కార్యకర్తను కాంగ్రెస్ నాయకులు హత్య చేసిన సూర్యాపేట జిల్లా లింగంపల్లి గ్రామంలో ప్రజలు నిలబడి బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించారు. మేజర్ గ్రామ పంచాయతీకి బీఆర్ఎస్ బలపరిచిన 95 ఏండ్ల రామచంద్రారెడ్డి తిరుగులేని ఆధిక్యం కనబరిచారు. భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సొంత గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నేత మడకం జోగయ్య 84 ఓట్ల తేడాతో గెలిచారు. మంత్రి సీతక్క సొంత జిల్లా ములుగు మేజర్ గ్రామ పంచాయతీ ఏటూరునాగారంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కాకులమర్రి శ్రీలత 3,230 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ గ్రామంలో మొత్తం 8,333 ఓట్లు నమోదవ్వగా, 5,520 ఓట్లు బీఆర్ఎస్ అభ్యర్థి సాధించారు. ఈ గ్రామంలో మంత్రి సీతక సర్పంచ్ ఎన్నికల కోసం ఐదుసార్లు ప్రచారం చేసినా ప్రజలు ఆమెను నమ్మలేదని ఈ ఫలితాలతో తేలిపోయింది. 60% కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల స్వగ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. జడ్చర్ల, భద్రాచలం, షాద్నగర్, మహబూబాబాద్, ఇంకా అనేక నియోజవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ సొంత గ్రామాల్లో సర్పంచ్లను గెలిపించుకోలేకపోయారు.
కింద పడినా పైచెయ్యి అని…
తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 4,236 గ్రామ పంచాయతీల ఎన్నికలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 396 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 3,834 గ్రామ పంచాయతీలకు గురువారం ఎన్నికలు నిర్వహించారు. అర్థరాత్రి ఒంటి గంట వరకు అందిన వివరాల ప్రకారం.. 1,702 గ్రామ పంచాయతీలను అధికార కాంగ్రెస్ గెలుచుకున్నట్టు సమాచారం. కాంగ్రెస్ ఏకగ్రీవం చేసుకున్న మేజర్ పంచాయతీలను వేలం పాటల ద్వారానే కొనుగోలు చేసినట్టు తెలుస్తున్నది. ఈ వేలం పాటలపై ఎన్నికల కమిషన్కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన కొందరు అభ్యర్థులను తమ ఖాతాలో వేసుకొని తమదే పైచెయ్యి అని కాంగ్రెస్ ప్రకటించుకుంటున్నది.
56% వ్యతిరేక ఓటు
ఏ హంగూ ఆర్భాటాలు లేకుండా పోటీలో నిలిచిన గులాబీ దండు 1,345 చోట్ల విజయం సాధించినట్టు వార్తలు అందాయి. బీఆర్ఎస్ అభ్యర్థులు కేవలం 10ఓట్ల లోపు తేడాతో 50కి పైగా గ్రామాల్లో ఓటమి చవిచూసినట్టు తెలిసింది. 20 ఓట్ల తేడాతో ఓడిన గ్రామాలు 150కిపైగానే ఉన్నట్టు తెలుస్తున్నది. వచ్చే సాధారణ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తామని కలలు కంటున్న బీజేపీ కేవలం 186 గ్రామ పంచాయతీలకే పరిమితమైంది. ఏ రాజకీయ పార్టీ మద్దతు లేకుండానే పోటీ చేసిన అభ్యర్థులు 524 పంచాయతీల్లో విజయం సాధించారు. బీఆర్ఎస్, బీజేపీ, వ్యక్తిగతంగా నిలబడిన అభ్యర్థులకు పడిన ఓట్లను లెక్కలోకి తీసుకుంటే రేవంత్రెడ్డి ప్రభుత్వానికి 56% వ్యతిరేక ఓట్లు పడ్డట్టు భావిస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా కేవలం 44% ఓట్లు మాత్రమే పడ్డట్టు తొలి విడత పంచాయతీ ఫలితాలను బట్టి తెలుస్తున్నది.