(నాగ్‌పూర్ నుంచి నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి): ఆరెంజ్ సిటీ అదిరిపోయింది. భౌగోళికంగా టైగర్‌జోన్‌గా ముద్రపడిన నాగ్‌పూర్‌లో గులాబీ సింహనాదం చేసింది. ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినా దం మహారాష్ట్ర రాజకీయాల్లో కాక రేపుతున్నది. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మహారాష్ట్ర రాజకీయ పార్టీలకు కంటిమీక కనుకు లేకుండా చేస్తున్నారని నాగర్పూర్ మహానగరం తేల్చిచెప్పింది. గురువారం మహారాష్ట్రలోని నాగపూర్‌లో బీఆర్ఎస్ పార్టీ సొంత కార్యాలయా న్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం సురేశ్ భట్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు. రాడిసన్ బ్లూ హోటల్లో మీడియాతో మాట్లాడారు. నాగ్‌పూర్ తరువాత పుణె, ఔరంగాబాద్, ముంబై సహా పలు ప్రాంతాల్లో బీఆర్ఎస్ సొంత పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఇందులో రెండుమూడు చోట్ల ఇప్పటికే లాంఛనాలు పూర్తయ్యాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
ఆర్ఎస్ఎస్ గడ్డపై ఎగిరిన గులాబీ జెండా
‘నాగ్‌పూర్ నిర్దేశిస్తుంది.. మోదీ ఆచరిస్తాడు’ అని దేశమంతా విశ్వసిస్తున్నది. ‘కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి.. బీజేపీ విర్రవీగే స్థలం నుంచే వీరవిహారం మొదలుపెట్టాలని బీఆర్ఎస్ అధినేత నిర్ణయించారా? అంటే గురువారం నాగ్‌పూర్‌లో చోటుచేసుకున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. గత నెల 22 నుంచి మహారాష్ట్రలో బీఆర్ఎస్ చేపట్టిన పార్టీ సభ్యత్వ నమోదుతోపాటు పార్టీ సంస్థాగత నిర్మాణం జోరుగా సాగుతున్నది. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం ఉన్న నాగ్‌పూర్ నుంచే బీఆర్ఎస్ తన శాశ్వత కార్యకలాపాలను ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడం మహారాష్ట్ర బీఆర్ఎస్ శ్రేణులను విశేషంగా ఆకర్షిస్తున్నది. బీజేపీని, మోదీని గట్టిగా ఎదురించే నాయకుడిగా కేసీఆర్ కనిపిస్తున్నారని, అందుకే తక్కువ కాలంలోనే బీఆర్ఎస్ భారీగా విస్తరించిందని స్థాని క నేత సత్యవాన్ పుల్దేవ్ విశ్లేషించారు.
బీఆర్ఎస్ ‘దీక్షా’భూమి
దేశంలో రైతు ఆత్మహత్యలకు మహారాష్ట్ర కేరాఫ్‌గా మారింది. మహారాష్ట్ర సరిహద్దునే ఉన్న తెలంగాణ అనతికాలంలోనే అద్భుత ప్రగతి సాధించింది. రైతుబంధు, రైతుబీమా, సాగుకు పుష్కలమైన సాగునీరు, రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్తు వంటి విప్లవాత్మక విధానాలు తమకూ కావాలని మహారాష్ట్ర రైతులు కోరుతున్నారు. మహారాష్ట్రలోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు తెలంగాణ మాడల్ అమలు కావాలని డిమాండ్ చేస్తున్నారు. అంబేద్కర్ ప్రబోధించిన దీక్షభూమిలో సీఎం కేసీఆర్ తమ జీవితాల్లో వెలుగులు నింపేందుకు అడుగుపెట్టారనే అభిప్రాయం మహారాష్ట్ర వ్యాప్తంగా ఉన్నదని బండారీ జిల్లా లాక్నే తాలూకాకు చెందిన దెక్సెన్ గన్వాన్ పేర్కొన్నారు.
మరాఠీలో తెలంగాణ సంక్షేమ సౌరభం
తెలంగాణ బిల్లుకు పార్లమెంట్లో ఆమో దం పొందినప్పటి నుంచి సీఎం కేసీఆర్ సారధ్యంలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ పథకాల సమహారంగా రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీని నాగ్‌పూర్ ఆడిటోరియం లో ప్రదర్శించారు. మరాఠీ భాషలో రూపొందించిన ఈ డాక్యుమెంటరీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
మండుటెండను లెక్క చేయక
నాగ్‌పూర్‌లో గురువారం ఉదయం నుంచి 9 గంటల నుంచే భానుడి భగభగ మొదలైంది. అయినా సురేశ్ భట్ ఆడిటోరియానికి మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రముఖులు చేరుకున్నారు. సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని ఆసాంతం విన్నారు. ఆడిటోరియంలో 2500 మంది కూర్చునేందుకు సీట్లు ఉం డగా, అవి సరిపోక చాలామంది నిలబడే కేసీఆర్ ప్రసంగం విన్నారు. వందల మందికి ఆడిటోరియం గ్రౌండ్ ఫ్లోర్లో కుర్చీలు వేశారు. వారి కోసం ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేయటం చేశారు. కేసీఆర్ ప్రసంగిస్తున్నంతసేపు ఆడిటోరియం చప్పట్లతో దద్దరిల్లింది. తెలంగాణలో అ మలవుతున్న రైతు సంక్షేమ పథకాలను వివరిస్తున్నప్పుడు ‘అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్’ అని నినదించారు. సమావేశానికి వచ్చిన వారందరికీ భోజనాలు. నీళ్లు.. చల్ల ప్యాకెట్లను పంపిణీ చేశారు. నాగపూర్ విమానాశ్రయం నుంచి బీఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయం మీదుగా కవీశ్వరుడు సురేశ్భట్ ఆడిటోరియం దా కా దాదాపు ఐదారు కిలోమీటర్ల దూరం దారికి ఇరువైపులా బీఆర్ఎస్ కటౌట్లు, జెండాలను ఏర్పాటుచేశారు.
Cmkcr
బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్
జాతీయ రహదారి 44కు అనుకొని నాగపూర్‌లోని గాంధీభాగ్లో నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని పార్టీ అధినేత కేసీఆర్ గురువారం ప్రారంభించారు. బుధవారం నుంచి ఇక్కడ వేదపండితులు సంప్రదాయబద్ధంగా గణపతి హోమం, వాస్తు హోమం, చండీహోమాన్ని నిర్వహించారు. సీఎం కేసీఆర్ గురువారం ఆ పూజలో పాల్గొన్నారు. అనంతరం కార్యాలయ ప్రాంగణంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. నాగ్‌పూర్ డివిజన్ బీఆర్ఎస్ కిసాన్ సమితి అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ వాడోద్కర్ను కుర్చీలో కూర్చొబెట్టి ఆశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్, పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, ఎంపీలు సంతోష్‌కుమార్, బీబీ పాటిల్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ దండె విఠల్, బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్, బీఆర్ఎస్ మహారాష్ట్ర కిసాన్ సమితి అధ్యక్షుడు మాణిక్ కదం, మాజీ ఎమ్మెల్యే శంకరన్న దోండ్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రవణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.