హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతున్నదని, రక్షించాల్సిన పోలీసులే అక్రమంగా కేసులు పెడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే మెదజ్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి విమర్శించారు. ఇద్దరు వ్యక్తులు ఎదురెదురుగా కానీ, కనీసం ఫోన్లో కానీ మాట్లాడుకోకపోయినా కూడా అక్రమంగా బీఆర్ఎస్ నేతలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇటీవల మెదక్ పట్టణ కన్వీనర్, మాజీ కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులుపై ఇదే తరహాలో అట్రాసిటీ కేసు పెట్టారని, దానిని తక్షణం ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ పద్మాదేవెందర్‌రెడ్డి ఆధ్వర్యంలో డీజీపీ శివధర్‌రెడ్డిని కలిశారు. డీజీపీకి వినతిపత్రం ఇచ్చారు.
కేసు వివరాలు తెలుసుకొని.. వాస్తవాలను ఆరా తీస్తానని బీఆర్ఎస్ నేతలకు డీజీపీ హామీ ఇచ్చారు. అనంతరం డీజీపీ కార్యాలయం బయట నేతలు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం రావణకాష్టంగా మారుతున్నదని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్నచోట పోలీసుల అరాచకాలు పెరిగిపోతున్నాయని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. ఎలాంటి సంబంధం లేకపోయినా బీఆర్ఎస్ నేతలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రికి చిత్తిశుద్ధి ఉంటే.. లా అండ్ ఆర్డర్‌ను కంట్రోల్ చేయాలని, అక్రమ కేసులను అరికట్టాలని, ముందస్తు అరెస్టులు ఆపాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెడుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదో అర్థమవుతున్నదని చెప్పారు. ‘ఇది ప్రజాస్వామం.. అందరికీ ప్రశ్నించే హక్కు ఉంటుంది. చేతనైతే మా ఫిర్యాదులపై కూడా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని, డీజీపీని కోరుతున్నాం’ అని పేర్కొన్నారు.
పోలీసులకు ఇదెక్కడి ద్వంద్వ నీతి?
మెదక్ జిల్లాలో పోలీసులు ఏపక్షంగా వ్యవహరిస్తున్నారని, తాము కూడా కాంగ్రెస్ నేతలపై ఫిర్యాదులు చేస్తుంటే.. వారిపై కేసులు ఎందుకు పెట్టడం లేదని మెదక్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి ప్రశ్నించారు. ఇదెక్కడి ద్వంద్వ నీతి అని నిలదీశారు. ఎలాంటి మాటలు లేకపోయినా.. ఎదురుగా మాట్లాడుకోకపోయినా మెదక్ పట్టణ మాజీ కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం దారుణమని మండిపడ్డారు. ప్రశ్నించిన ప్రతి ఒక్కరిపై కేసులు పెడుతున్నారని, ఇలాంటి బెదిరింపులకు భయపడేదిలేదని చెప్పారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు షేరి సుభాష్‌రెడ్డి, శశిధర్‌రెడ్డి, మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లిఖార్జున్‌గౌడ్ పాల్గొన్నారు.