హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో లక్షలాది మంది అభ్యర్థులు రాసే టెట్ పరీక్ష ఫీజును వెంటనే రద్దు చేయాలని బీఆర్ఎస్ నేత కే వాసుదేవరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఫీజులు లేకుండానే పరీక్షలు నిర్వహించాలని కోరారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మంగళవారం మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నేత సంజీవ్‌తో కలిసి ఆయన మాట్లాడారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టెట్ పరీక్షకు ఒక పేపర్‌కు రూ.200, మూడు పేపర్లకు రూ.300గా ఉండేదని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఒక పేపర్ కు రూ.1,000, రెండు పేపర్లకు రూ.2,000గా నిర్ణయించడం దారుణమని విమర్శించారు. దరఖాస్తుదారులు ఒక రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని అభయహస్తం మ్యానిఫెస్టోలో పెట్టారని, ఆ హామీ మేరకు టెట్‌తోపాటు ఏ ఉద్యోగ పరీక్షకూ ఫీజులు వసూలు చేయొద్దని గుర్తుచేశారు.
బుధవారం నుంచి టెట్ దరఖాస్తులు ప్రారంభంకానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫీజుల రద్దు ప్రకటన జారీ చేయాలని కోరారు. లేకుంటే టెట్ అభ్యర్థులతో కలిసి ఉద్యమిస్తామని వెల్లడించారు. మాజీ మంత్రి హరీశ్‌రావుపై మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన వ్యాఖ్యలను వాసుదేవరెడ్డి ఖండించారు. రాజకీయ వ్యాఖ్యలు మాని రైతుల శ్రేయస్సుకు పాటుపడాలని డిమాండ్ చేశారు.
టెట్ దరఖాస్తు ఫీజు తగ్గించాలి : ఏఐవైఎఫ్
హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ) : ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) దరఖాస్తు ఫీజును తగ్గించాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్రసమితి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఫీజు తగ్గించిన తర్వాతే దరఖాస్తులను స్వీకరించాలని, 33 జిల్లాల్లో పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరింది. ఈ మేరకు మంగళవారం ఏఐవైఎఫ్ రాష్ట్ర వరింగ్ ప్రెసిడెంట్ నెర్లకంటి శ్రీకాంత్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీమాన్, రాష్ట్ర ప్రధానకార్యదర్శి కే ధర్మేంద్ర తదితరులు రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ సంస్థ డైరెక్టర్ ఎం రాధారెడ్డికి వినతిపత్రం అందజేశారు.
కేసీఆర్ ప్రభుత్వంలో టెట్ ఒక పేపరు దరఖాస్తు ఫీజు రూ.200, రెండు పేపర్లకు రూ.300 ఫీజుగా ఉండేదని తెలిపారు. కానీ, ప్రస్తుత ప్రభుత్వం టెట్ పేపర్1కు రూ.1,000, రెండు పేపర్ల ఫీజును రూ.2 వేలకు పెంచడం సరికాదని పేర్కొన్నారు. ఏడు లక్షల మంది నిరుద్యోగుల సమస్యను పరిగణనలోకి తీసుకొని పెంచిన టెట్ ఫీజులను తగ్గించాలని విజ్ఞప్తి చేశారు.