RS Praveen Kumar | హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరోసారి నిప్పులు చెరిగారు. హైదరాబాద్‌లో డ్రగ్స్ ఫ్యాక్టరీని ముంబై పోలీసులు సీజ్ చేసిన ఘటనపై ఆర్ఎస్పీ స్పందించారు.
తెలంగాణ సీఎం, హోంమంత్రి గాఢ నిద్రలో ఉన్నారా? అవును ఆయన నిజంగానే గాఢ నిద్రలో ఉన్నారని ఆర్ఎస్పీ ధ్వజమెత్తారు. హైదరాబాద్ చర్లపల్లిలో మహారాష్ట్ర పోలీసులు నెలరోజులు నిఘా పెట్టి, రూ. 12 వేల కోట్ల విలువైన నిషేధిత డ్రగ్స్ తయారు చేస్తున్న సీక్రెట్ ఫ్యాక్టరీ గుట్టురట్టు చేసేదాక, తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ పోలీసులకు తెలవదంటే రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఎంత అధ్వాన్నంగా తయారైందో ఊహించుకోవచ్చు అని ఆర్ఎస్పీ పేర్కొన్నారు.
డ్రగ్స్ మాఫియాలో మీ కాంగ్రెస్ నాయకుల హస్తం ఉండకపోతే ఇన్ని రోజులు ఈ దందా నిరంతరాయంగా ఎట్ల జరుగుతది? ఇట్లాంటి దేశ, అంతర్జాతీయంగా డ్రగ్స్ సరఫరా జరుగుతుంటే, మీరేమో ప్రతిపక్ష నాయకుల మీద ఫేక్ కేసులు పెట్టే పనిలో ఉన్నారు? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ మరో పంజాబ్‌గా మారకముందే, రాజీనామా చేసి పదవి నుండి తప్పుకోండి అని రేవంత్‌కు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచించారు.