KCR | వరంగల్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అధికారం పోయిందనే ఆత్రుత లేకుండా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని గౌరవించాలనే సమగ్ర వివేచన, సమున్నత వ్యక్తిత్వంతో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పటిదాకా వ్యవహరించారు. అవతలి పక్షం ఎన్ని పిల్లిమొగ్గలేసినా, ఎన్ని పిల్లచేష్టలు చేసినా తెలంగాణ ఇంటి పెద్ద పాత్రను పోషించారు. కాంగ్రెస్ సర్కార్‌కు కావలసినంత సమయం ఇచ్చారు. ఐదేండ్ల టర్మ్‌కు రెండేండ్లు తక్కువకాలమేమీ కాదు. ఈ రెండేండ్లలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తెలంగాణ శాశ్వత ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగించే నిర్ణయాలు తీసుకున్నది. ఫలితంగా పాలమూరుపై మళ్లీ వలస డేరా పడబోతున్నదనే సంకేతాలు, తెలంగాణ నీటివాటాను గద్దల్లా తన్నుకుపోవాలనే కుట్రలు జరుగుతున్నా రేవంత్‌రెడ్డి సర్కార్ ప్రేక్షకపాత్ర పోషిస్తున్నదనే గ్రహింపు కేసీఆర్ ధర్మాగ్రహానికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. ఇది ఇలాగే కొనసాగితే స్వరాష్ట్ర సాకార ఫలితం ఎండమావే అవుతుందని గ్రహించి మళ్లీ బెబ్బులిలా రంగంమీదికి వచ్చారు.
ఆదివారం తెలంగాణభవన్‌లో జరిగిన బీఆర్ఎస్ఎల్పీ, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ తిరిగి ఉద్యమయోధుడిగా తనదైన శైలిలో సింహమై గర్జించారు. ‘ఇది నా రాష్ట్రం- వీళ్లు నా ప్రజలు, నా నేలకు అన్యాయం జరిగినా.. నా ప్రజలకు అపద వచ్చినా నేను చూస్తూ ఊరుకోను.. సహించను’ అని కేసీఆర్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. కృష్ణమ్మ పరుగులకు నురుగుల హారం కట్టాలని ప్రతినబూనారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు, వైఎస్ మెడలు వంచి దేవాదులకు శంకుస్థాపన చేయించడం, కదనభేరీ మోగించి కర్ణాటక బకాయిని చెల్లించేలా చేయడం, జూరాల కాలువల నిర్మాణం చేపట్టేలా చేయడం తదితర అంశాలపై నాడు ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ ఏ పాత్ర పోషించారో.. ఇప్పుడు అదే ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల ప్రజల చిరకాల స్వప్నం నెరవేర్చేందుకు నడుం కట్టారు. ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలకు పూనుకోకపోతే వెల్లువెత్తే ప్రజా ఉద్యమ ధాటికి తునాతునకలు కావలసిందేననే రీతిలో సమరనాదం చేశారు. 90% పూర్తయిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తిచేయకుండా, రెండేండ్లుగా తట్టెడు మట్టి తీయకుండా తాత్సారం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ అసలు నైజాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగట్టే కార్యాచరణకు శ్రీకారం చుట్టారు.