తెలంగాణ ప్రజలు ఈ రోజు ఓటింగ్‌కు వెళ్లేముందు ఆలోచించాల్సిన ముఖ్యమైన విషయం ఒకటున్నది. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రాష్ర్టాల ప్రయోజనాలను కాపాడుతున్నది ప్రధానంగా ప్రాంతీయ పార్టీలే తప్ప జాతీయ పార్టీలు కాదు. దేశానికి జాతీయ పార్టీలు అక్కరలేదని కాదు. కానీ, వాటి దృష్టి జాతీయ స్థాయి రాజకీయ శక్తులు, ఆర్థిక శక్తుల ప్రయోజనాలపై ఉన్నట్టు వివిధ ప్రాంతాల అభివృద్ధిపై గాని, అక్కడి రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక శక్తుల బాగోగులపై గాని ఉండదు. అందువల్లనే కొన్ని ప్రాంతాలను ధనిక ప్రాంతాలుగా, కొన్నింటిని అంతర్గత వలసలుగా మార్చుతారు తప్ప సమతులమైన అభివృద్ధి కోసం ప్రయత్నించరు.
ఇది ఊహాజనితం కాదని, వాస్తవమని చరిత్ర చెప్తున్నది. భారతదేశంలోనే కాదు, ప్రపంచమంతటా కూడా. ఇంకా చెప్పాలంటే, క్రీస్తుపూర్వకాలంలో పెద్ద రాజ్యాలన్నవి ఏర్పడినప్పటి నుంచి ఉన్న పరిస్థితి ఇది. అందువల్లనే ప్రాంతీయ శక్తుల ప్రతిఘటనతో ఫెడరలిస్టు వ్యవస్థలు ప్రపంచవ్యాప్తంగా క్రీస్తుపూర్వం నుంచే ఏర్పడ్డాయి. భారతదేశ వైవిధ్యతల దృష్ట్యా మన దేశ రాజ్యాంగంలోనూ ఫెడరలిస్టు లక్షణాలను రాజ్యాంగ నిర్మాతలు చేర్చారు. ఆ ఏర్పాట్లకు జాతీయ పార్టీలు భంగం కలిగించినందు వల్లనే మొదట పంజాబ్, కశ్మీర్, తమిళనాడులకు పరిమితమై ఉన్న ప్రాంతీయ పార్టీలు 1980ల నుంచి మొదలుకొని అత్యధిక రాష్ర్టాల్లో ఆవిర్భవించాయి. అప్పుడే రాష్ర్టాల వివిధ ప్రయోజనాల పరిరక్షణకు, అభివృద్ధికి అవకాశం లభించింది.
ఇది సహించలేని సెంట్రలిస్టు పార్టీలు ప్రాంతీయ శక్తులను దెబ్బతీసేందుకు ప్రాంతీయ వనరులను తమ ధనిక మిత్రుల కోసం చేజిక్కించుకునేందుకు ప్రయత్నించాయి. రాష్ర్టాలకు రాజ్యాంగంలో గల ఫెడరల్ అధికారాలను కుదించేందుకు రాజ్యాంగాన్ని, చట్టాలను సవరిస్తూ, ఇతర చర్యలు తీసుకుంటూ, పలు విధాలైన ఎత్తుగడలు వేస్తూ వస్తున్నాయి. ఈ విషయంలో కాంగ్రెస్, బీజేపీలకు ఎంతమాత్రం తేడా లేదు. ఈ అంశంపై అనేక అధ్యయనాలు ఉన్నాయి.
జాతీయ పార్టీల పేరిట ఈ విధంగా ప్రాంతీయ ప్రయోజనాలకు భంగకరంగా వ్యవహరించే సెంట్రలిస్టు శక్తులను అడ్డుకోవటం తెలంగాణ ప్రజలతో పాటు మొత్తం దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు ఒక తప్పనిసరి అవసరం. అంతేకాదు, ప్రపంచంలోని మరే దేశంలోనూ లేనంతటి వైవిధ్యత గల మన దేశ ఐక్యతా పరిరక్షణకు, పటిష్టతకు కూడా ఇది అవసరం. ఇటువంటి అవసరాలను స్వాతంత్య్రోద్యమ నాయకత్వం గుర్తించినందువల్లనే వారు దేశానికి అందుకనుగుణమైన రాజ్యాంగాన్ని రూపొందించారు.
తెలుగు సీమకు సంబంధించి ఇటువంటి నేపథ్యాలు, కాంగ్రెస్ వ్యవహారశైలి, అసమర్థతల పర్యవసానంగానే 1980ల నుంచి ఇక్కడ ఫెడరలిస్టు పార్టీల దశ మొదలైంది. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఆ దశ కొనసాగుతున్నది. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర పోరాటం కూడా సెంట్రలిస్టు కాంగ్రెస్ దశాబ్దాల పాటు ఈ ప్రాంతానికి చేసిన అన్యాయాలపై సాగించిన ఫెడరలిస్టు ప్రతిఘటనా ఉద్యమమే. ఆ విధంగా ఈ తెలుగు సీమ ఫెడరల్ ధోరణులకు 40 ఏండ్లకు చరిత్ర ఉంది. అది ఇప్పటికీ బలంగా వర్ధిల్లుతున్నది. దానిని తుద ముట్టించటం కాంగ్రెస్, బీజేపీలకు వల్ల కావడం లేదు. కాదు కూడా. ప్రాంతీయ పార్టీల మూలాలు ఇక్కడి నేలలో, ప్రజలలో, సంస్కృతిలో ఉండటం అందుకు కారణం.
ప్రాంతీయ ప్రయోజనాలన్నింటి కోసం స్థానికంగా కాని, జాతీయస్థాయిలో కాని కట్టుబడి నిలిచేది, గొంతెత్తేది, పాటుపడేది అంతిమంగా ప్రాంతీయ పార్టీలు, ప్రజల ఇంటి పార్టీలు మాత్రమే. ఈ క్రమానికి ఎప్పుడైనా కొద్ది ఒడుదొడుకులు ఎదురైనా, అంతిమంగా రక్షణలు కేవలం ప్రాంతీయ పార్టీలే. ఇది మనకు స్వాతంత్య్రం సిద్ధించిన గత 75 సంవత్సరాలుగా దేశమంతటి అనుభవం. అందువల్ల, ఈ రోజు పోలింగ్‌కు ముందు తెలంగాణ ఓటర్లు, తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాల్సిన విషయమిది.
-టంకశాల అశోక్