హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): 2023 అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతున్న బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థులకు బీఫారాలను అందజేసింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే అభ్యర్థులు, పార్టీ ఇన్చార్జిలతో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. తెలంగాణ భవన్‌కు చేరుకొన్న సీఎం తొలుత తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలవేసి, ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో తొలివిడతలో 69 మందికి బీఫారాలు అందజేశారు. మిగిలిన అభ్యర్థులకు సోమవారం సాయంత్రంలోపు అందజేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా బీఫారాలు అందుకున్న అభ్యర్థులకు సీఎం కేసీఆర్ ఎన్నికల సన్నద్ధతపై దిశానిర్దేశం చేశారు. బీఫారాలు, ఎన్నికల ప్రచారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ప్రతీ అభ్యర్థికి రెండేసి బీఫారాలు ఇస్తామని, ఏదైనా కారణంతో ఒక ఫారం చిరిగిపోయినా.. ఇంకు పడి చెడిపోయినా ఇంకో ఫారాన్ని వాడుకోవచ్చని తెలిపారు. రెండో ఫారాన్ని ఎమ్మెల్యేలు జాగ్రత్తగా భద్రపర్చుకోవాలని సూచించారు. బీ ఫారంతోపాటు రూ.40 లక్షలకు సంబంధించిన చెక్కును కూడా అందజేస్తున్నామని, చెక్కును ఎన్నికలకు సంబంధించిన అధికారిక ఖాతాలో వేసుకోవాలని తెలిపారు.
అభ్యర్థులంతా మర్యాదగా నడుచుకోవాలని కేసీఆర్ సూచించారు. ఎన్నికల రంగంలోకి వెళ్లే సమయంలో అభ్యర్ధులందరూ ఆచితూచి వ్యవహరించాలని, అణకువతో ఉండాలని తెలిపారు. నామినేషన్ దాఖలు సందర్భంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. రాజకీయాలు అన్నాక మంచి, చెడు ఉంటాయని, కార్యకర్తలను, పార్టీ మేలుకోరేవారిని సమన్వయం చేసుకొంటూ వెళ్లాలని సూచించారు. ప్రజల్లోకి వెళ్లినప్పుడు కోపతాపాలు తగ్గించుకోవాలని తెలిపారు. అందరితో కలుపుగోలుగా ఉంటూ.. సర్దుబాటు చేసుకొని విజయతీరాలకు చేరుకోవాలని సూచించారు.
‘చిల్లర పనుల వల్ల కొంత మంది ఎంత గొప్ప అవకాశాలు కోల్పోతారో.. నా అనుభవంలో నేనే చూసిన. అనేక మంది దగ్గరదాకా పోయి దెబ్బతిన్నవాళ్లున్నారు. ఇలాంటి పరిస్థితి రావొద్దంటే ఏ సందర్భంలోనైనా సంస్కారవంతంగా.. ఓపికగా ఉండ టం, మంచిగా ప్రవర్తించడం గొప్ప గుణం’ అని అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. ఏవైనా అరమరికలుంటే తీసేయాలని, వెంటనే తొలగించుకోవాలని అభ్యర్థులకు సూచించారు. ఇది తాను వ్యక్తిగతంగా చేస్తున్న ముఖ్యమైన విజ్ఞప్తి అని పేర్కొన్నారు. ఎన్నికల్లో ప్రజలు మనల్ని జాగ్రత్తగా గమనిస్తుంటారని, చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
‘చాలా సందర్భాల్లో.. చాలా సమావేశాల్లో మళ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీట్లిస్తామని చెప్పాం. మీరంతా విజయం సాధిస్తారన్న గొప్ప ఆత్మవిశ్వాసాన్ని నేను గతంలో ప్రకటించిన’ అని అభ్యర్థులనుద్దేశించి కేసీఆర్ వ్యాఖ్యానించారు. 4-5 స్థానాలు మినహా.. అదికూడా విధిలేని పరిస్థితుల్లోనే సిట్టింగ్‌లను మార్చామే తప్ప మళ్లీ అందరికీ అవకాశం ఇచ్చామని తెలిపారు. అవకాశం రానివాళ్లతో మాట్లాడి తొందరపడొద్దని చెప్పామని అన్నారు. ‘ఎమ్మెల్యేగా ఎన్నికవడమే ఫైనల్ కాదు.. ఇప్పుడు పార్టీ అధికారంలో ఉన్నది.. మళ్లీ అధికారంలోకి రాబోతున్నది.. ఎన్నో అవకాశాలుంటాయని చెప్పినం.’ అని కేసీఆర్ తెలిపారు.
‘వేములవాడలో ఎమ్మెల్యే అభ్యర్థిని వాస్తవంగా మార్చాల్సిన అవసరం లేకుండె. ఉన్న ఎమ్మెల్యే గెలిచేవారు. గెలుస్తారన్న నమ్మకం ఉండె. ఆయన మీదు న్న న్యాయపరమైన చిక్కువల్లే మార్చి వేరే అభ్యర్థిని పెట్టాం. కూర్చోబెట్టి మాట్లాడితే వారు అర్థం చేసుకొని సహకరిస్తున్నారు. అక్కడ మంచి సర్దుబాటు జరిగింది’ అని కేసీఆర్ పేర్కొన్నారు. ‘కోవా లక్ష్మి క్రితంసారి కొద్ది తేడాతో ఓడిపోయారు. అప్పుడు ఓడిపోవాల్సింది కాదు. అక్కడ నుంచి గెలిచిన ఆత్రం సక్కుతో మాట్లాడాం.. మీకు అనేక అవకాశాలుంటాయని చెప్పాం. అక్కడ కూడా ఇద్దరి మధ్య సర్దుబాటు జరిగింది’ అని వివరించారు. చాలా సీట్లల్లో పెద్ద హడావుడి లేకుండా చక్కగా విజయవంతంగా సర్దుబాటు చేశామని వివరించారు.
మంత్రి శ్రీనివాస్‌గౌడ్, వనమా వెంకటేశ్వర్రావు, గద్వాల ఎమ్మెల్యే సహా మరికొంత మంది మీద కేసులు వేశారు. రకరకాల కుయుక్తులు పన్నారు. ఎన్నికల్లో ఓటమిపాలై.. మనతో గెలువలేక మన శత్రువులు ట్రిక్స్ ప్లే చేస్తున్నారు. ప్రజల్లో గెలిచినా మనల్ని సాంకేతికంగా దెబ్బతీయాలని చూస్తున్నారు. గద్వాలలో కృష్ణమోహన్‌రెడ్డి 29-30వేల మెజార్టీతో గెలిచిండు. ఘన విజయమది. కానీ సాంకేతిక కారణం చూపించి ఎన్నికను రద్దుచేయించే ప్రయత్నం జరిగింది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మంచి మెజార్టీతో గెలిచిండు. ఇక్కడ కూడా సాంకేతికపరమైన అంశాలతో న్యాయస్థానం ముందుకు కేసు వెళ్లింది. ఇటు వంటి విషయాల్లో ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. నామినేషన్ పత్రాలు నింపే ముందు, అఫిడవిట్లు దాఖలు చేసేముందు, ఎన్నికల నిబంధనలు పాటించడంలో జాగ్రత్తలు పాటించాలి.
బీఫారాలు, నామినేషన్లు, అఫిడవిట్లకు సంబంధించి మనకు సహకరించేందుకు 20 మందితో కూడిన న్యాయకోవిదులు, అడ్వొకేట్స్ బృందం ఉన్నది. అభ్యర్థులంతా న్యాయవాది, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ భరత్‌కుమార్‌తో మాట్లాడుకోవాలి. ఏవైనా అనుమానాలుంటే నివృత్తి చేసుకోండి. అంతా తమకే తెలుసు అని అనుకోవద్దు. ఎన్నికలకు, ఎన్నికలకు మధ్య నిబంధనలు మారుస్తుంటరు. కొత్త నిబంధనలు వస్తున్నాయి. అంతా పాతదే ఉంటది.. మాకు అంతా తెలుసులే. మేం గతంలో పోటీ చేసినం అని అనుకోవద్దు. పార్టీ లీగల్ టీం, న్యాయవాది భరత్‌కుమార్ 24 గంటలపాటు అందుబాటులో ఉంటారు. ఏ రకమైన సహకారం కావాలన్నా అందిస్తారు. రాష్ట్ర పార్టీకి.. ఎన్నికల సంఘానికి భరత్‌కుమార్ వారిధిగా వ్యవహరిస్తారు. భరత్‌కుమార్‌తోపాటు 20 మంది న్యాయవాదుల టీం, ఆడిటర్లు ఉంటారు. అభ్యర్థులు అనుమానాలున్నా.. సందేహాలు వచ్చినా ఒక్క ఫోన్‌చేస్తే వారు నిమిషాల మీద న్యాయవాదులను పంపిస్తరు. అవసరమైతే సమస్య తీవ్రతను బట్టి భరత్కుమారే వస్తరు. హెలికాప్టర్‌ను కూడా రెడీగా పెట్టినం.
హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): ఎన్నికల్లో ఎక్కడా పొరపాట్లు జరుగకుం డా జాగ్రత్తపడాల్సిన బాధ్యత అభ్యర్థులదేనని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. ‘నామినేషన్ వేసే రోజే ఫారంలను నింపాలనుకోవడం తప్పు. ఆదివారమే బీ ఫారాలిస్తున్నం. సోమవారం కూడా కొంత మందికి ఇస్తం. ఇప్పుడే నింపిపెట్టుకోవాలె’ అని సూచించారు. ఫారం నింపేటప్పుడు అప్డేటెడ్ ఓటర్‌లిస్టును పరిగణనలోకి తీసుకోవాలని తెలిపారు. ఓటరు జాబితాలో పేరు ఎలా ఉంటే అలాగే రాయాలని, ఓటరు జాబితానే ప్రామాణికమని వివరించారు.
నామినేషన్ సందర్భంగా ఉండే అన్ని నిబంధనలను పాటించాలని, అభ్యర్థులపైన ఏమైనా పోలీసు కేసులుంటే సంబంధిత పోలీసు స్టేషన్ల నుంచి వివరాలు లిఖితపూర్వకంగా తీసుకోవాలని కేసీఆర్ సూచించారు. అభ్యర్థుల నేర చరిత్రను ప్రజలకు చెప్పాలని ఎన్నికల సంఘం నిబంధన పెట్టిందని, ఈ నేపథ్యంలో నేర చరిత్ర, కేసులు ఏమైనా ఉంటే వాటిని పత్రికల ద్వారా వెల్లడించాల్సి ఉంటుందని తెలిపారు. పార్టీ, అభ్యర్థి వేర్వేరుగా పత్రికల్లో మూడుసార్లు ప్రకటనలు ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. అఫిడవిట్ విషయంలో కూడా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. అభ్యర్థి పేరుపై, ఆయన భార్య, మైనర్లుగా ఉండే పిల్లలపై ఉండే ఆస్తులు, అప్పుల వివరాలన్నీ అఫిడవిట్లో చేర్చాలని, ఫిక్స్డ్ డిపాజిట్లు, షేర్లు, వాహనాలు, బంగారం, బీమా వివరాలు.. ఇలా ఆర్థికపరమైన ప్రతి అంశాన్ని అఫిడవిట్లో పేర్కొనాలని తెలిపారు. అభ్యర్థులందరూ పాత బకాయిలు, పన్నులు చెల్లించాలని సూచించారు. ఇంటి పన్నులు, వాహనాలకు సంబంధించిన ట్రాఫిక్ జరిమానాలు, ప్రభుత్వ నివాసాల్లో ఉంటే వాటికి సంబంధించి బకాయిలను చెల్లించాలని, మంత్రు లు తమకు ప్రభుత్వం కేటాయించే వాహనాలకు సంబంధించి ఏమైనా బకాయిలుంటే వాటిని తీర్చేయాలని ఆదేశించారు. పాత బకాయిలను సొంత నిధులతోనే చెల్లించవచ్చని, వీటిని నామినేషన్ దాఖలుకు ముందే చెల్లించాలని సూచించారు. నామినేషన్ సందర్భంగా అనవసరనమైన ఆర్భా టం వద్దని, ఈసీ నిబంధనల మేరకు ముగ్గురు లేదా నలుగురితో కలిసి నామినేషన్ వేసుకోవాలని తెలిపారు. ఎన్నికల సమయంలో పోలింగ్, కౌం టింగ్ ఏజెంట్లను జాగ్రత్తగా ఎంచుకోవాలని అభ్యర్థులకు అధినేత కేసీఆర్ సూచించారు.
పార్టీ అభ్యర్థులంతా నామినేషన్ దాఖలు చేసే సమయానికి ఈ ఎన్నికలకు సంబంధించి డబ్బు ఖర్చు చేయడానికి సంబంధించి ప్రత్యేక ఖాతాను తెరువాలి. ఈ ఖాతా నుంచే ఎన్నికలకు సంబంధించిన ప్రతీ లావాదేవీని నిర్వహించాలి. ఈ ఖాతా నుంచే ఎన్నికల నామినేషన్‌కు సంబంధించిన డిపాజిట్ సొమ్మును చెల్లించాలి. పార్టీ తరఫున ప్రతీ అభ్యర్థికి బీ ఫారంతోపాటు 40 లక్షలను పార్టీ ఫండ్‌గా అధికారికంగానే ఇస్తున్నాం. ఈ సొమ్మును ఎన్నికల ఖర్చుకు ఉపయోగించుకోవాలి. ఆచితూచి ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టే క్రమంలో ఖర్చు లెక్కలను ఎన్నికల సంఘం వ్యయ పరిశీలకులు కూడా పరిశీలిస్తారు. వారికి పార్టీ అభ్యర్థులు పూర్తిగా సహకరించాలి. ఎన్నికల సంఘం సూచించిన ఖర్చుకన్నా తక్కువే ఖర్చు చేయాలి.