BRS Party | నాగర్‌కర్నూల్ : అందరూ కలిసికట్టుగా పార్టీ కోసం పని చేయాలని గులాబీ సైనికులకు నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బల్మూర్ మండలంలో గులాబీ జెండా రెపరెపలాడుతుంది. జడ్పిటిసి, ఎంపీపీతో పాటు మెజారిటీ గ్రామాల్లో సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకుందాం అని జనార్ధన్ రెడ్డి చెప్పారు. తెలంగాణకు కేసీఆర్ పాలననే శ్రీరామరక్ష అని గ్రామాల్లో ప్రతి ఒక్కరిని చైతన్యం చేయండి అని కోరారు.
అచ్చంపేట నియోజకవర్గంలోని తుమన్పేట గేట్ దగ్గర బీఎంఆర్ గార్డెన్స్‌లో బల్మూర్ మండల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అచ్చంపేట బీఆర్ఎస్ పార్టీ సమన్వయకర్త, నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, సీనియర్ నాయకులు పోకల మనోహర్ పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. అచ్చంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సమన్వయకర్తగా బల్మూర్ మండలంలో ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటాను. రాబోయే రోజుల్లో బల్మూర్ మండలంలోని ప్రతి గ్రామ పార్టీ నాయకులను, కార్యకర్తలను కలుస్తా, ఏ సమస్య ఉన్న నా దృష్టికి తీసుకురండి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రూపు రాజకీయాలు లేకుండా సమన్వయంతో పార్టీ కోసం కష్టపడి పనిచేయండి. పార్టీలో వ్యక్తులు వస్తుంటారు.. పోతుంటారు, పార్టీలు మాత్రం శాశ్వతంగా ఉంటాయి. పార్టీను కాపాడే శక్తి ఒక్క కార్యకర్తలకు మాత్రమే వుంటుంది అని, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అచ్చంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఒక బలమైన సంకేతం ఇచ్చారు. అందరూ సమన్వయంతో వుండండి, ప్రలోభాలకు లొంగకుండా పార్టీ కోసం నిబద్ధతతో పని చేయండి, పార్టీలో మంచి గుర్తింపు ఉంటుంది అని అన్నారు.
అచ్చంపేట నియోజకవర్గంలో అన్ని మండలాల వారీగా పార్టీ కార్యకర్తల మీటింగ్‌లు పెడుతున్నాము. కార్యకర్తలకు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నాం అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 20 నెలలు అవుతుంది, అధికారంలోకి రావడం కోసం అలవికాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రజాపాలన పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను,420 హామీలను ఎప్పటికప్పుడు ప్రజలకు వివరిస్తూ ముందుకు వెళ్ళాలి. రాబోయే రోజుల్లో మళ్లీ తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ను తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. తెలంగాణకు కేసీఆర్ పాలననే శ్రీరామరక్ష అని ప్రజలను చైతన్యం చేయండి అని మర్రి జనార్ధన్ రెడ్డి సూచించారు.
ఈ కార్యక్రమంలో అచ్చంపేట మాజీ మున్సిపాలిటీ చైర్మన్స్ నర్సింహా గౌడ్, తులసి రామ్, మాజీ ఎంపీపీలు కరుణాకర్ రావు, పర్వతాలు, పార్టీ సీనియర్ నాయకులు బండపల్లి వెంకటయ్య, కేటీ తిరుపతయ్య, అమీనొద్దీన్, పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.