హనుమకొండ, సెప్టెంబర్ 30: బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్‌ను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యే సవాల్‌ను స్వీకరించి హనుమకొండ నయీంనగర్ నాలా అభివృద్ధి పనులను బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులతో కలిసి శాంతియుతంగా పరిశీలిస్తుండగా.. కాంగ్రెస్ శ్రేణులు ఒక్కసారిగా ‘జై నాయిని రాజేందర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డికి అడ్డెవడు’ అంటూ నినాదాలు చేస్తూ.. బీఆర్ఎస్ శ్రేణుల వైపు దూసుకురావడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్‌తోపాటు పార్టీ కార్యకర్తలపై జులుం ప్రదర్శించారు.
కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యాన్ని వ్యతిరేకిస్తూ దాస్యం అక్కడే నిరసన తెలుపగా.. పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి హనుమకొండ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి సొంత పూచీకత్తుపై వదిలారు. తన 30 ఏండ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి గూండాల సంస్కృతిని ఎన్నడూ చూడలేదని, తెలంగాణలో కాంగ్రెస్ సర్కారుది ప్రజా పాలన కాదని, ప్రతీకార పాలనని దాస్యం ధ్వజమెత్తారు.
పాలన చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నదని విమర్శించారు. తమపై దాడి చేసిన వారిని వదిలిపెట్టి పోలీసులు తమనే అక్రమంగా అరెస్ట్ చేయడం శోచనీయమని పేర్కొన్నారు. దమ్ముంటే పెద్దమ్మగడ్డ శ్మశానవాటిక గోడ కూల్చిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించి, వెంటనే కూల్చిన గోడను నిర్మించి దళితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి సవాలును స్వీకరిస్తూ.. హనుమకొండలోని నయీంనగర్ బ్రిడ్జిని పరిశీలించేందుకు దాస్యం వినయ్‌భాస్కర్ ఆధ్వర్యంలో వెళ్లిన బీఆర్ఎస్ శ్రేణులపై కాంగ్రెస్ నాయకులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి తెలిపారు. ప్రశాంతంగా ఉన్న హనుమకొండలో స్వయంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డినే అత్యుత్సాహం ప్రదిర్శిస్తూ శాంతిభద్రతల సమస్య సృష్టిస్తున్నారని ఆరోపించారు. 9 నెలల కాంగ్రెస్ పాలనలో 2 నెలలు ఎన్నికల కోడ్‌కే పోయిందని, అప్పుడే ప్రపోజల్, టెండర్లు, నిధుల మంజూరు పనులు పూర్తి అయ్యాయా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరైన నిధులతో మాత్రమే ఎమ్మెల్యే తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాడని, ఒకసారి నిధులు మంజూరయ్యాక ఆ స్థానంలో ఎవరున్నా పనులు పూర్తిచేస్తారని తెలిపారు.