Harish Rao | హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు స్ట్రాంగ్ లీడర్ కావాలా? రాంగ్ లీడర్ కావాలా? అనేది ప్రజలు, మేధావులు ఆలోచించాలని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు సూచించారు. రాబోయే ఎన్నికల్లో ఎవరెన్ని ట్రిక్స్ చేసినా హ్యాట్రిక్ కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు. దేశంలో ధాన్యం, డాక్టర్ల ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉన్నదని చెప్పారు. శుక్రవారం తెలంగాణ భవన్లో మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ ఆధర్యంలో మంత్రి హరీశ్‌రావు సమక్షంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) రాష్ట్ర అధ్యక్షుడు బీఎన్ రావు బీఆర్ఎస్ లో చేరారు. హరీశ్‌రావు ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వివిధ జిల్లాలకు చెందిన ఐఎంఏ అధ్యక్షులు, 70 మంది డాక్టర్లు గులాబీ కండువాలు కప్పుకొన్నారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. నాడు ఎంబీబీఎస్ చదవాలంటే విదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని, నేడు తెలంగాణలో ఉంటూనే ఎంబీబీఎస్ చదివే అవకాశం దక్కిందని చెప్పారు. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ చొప్పున ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణేనని స్పష్టంచేశారు. మన రాష్ట్ర విధానాన్ని చూసి కేంద్రం ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ విధానాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. ప్రజలకు మంచి చేసే పనులు పత్రికల్లో ఎకువగా కనిపించవు.. కానీ, ఎదుటి వారిని తిడితే వార్తల్లో ఎకువ ప్రాధాన్యం ఇస్తారని అన్నారు. రాష్ట్రానికి పేపర్ లీడర్ కావాలా? ప్రాపర్ లీడర్ కావాలా? అనేది ప్రజలు ఆలోచించుకోవాలని సూచించారు.
నాడు బెంగాల్ ఆచరిస్తే.. దేశం అనుసరిస్తుంది అనేవారని, దాన్ని తిరగరాసి తెలంగాణ ఆచరిస్తే, దేశం అనుసరిస్తుంది అనేంతగా రాష్ట్రం అభివృద్ధి చెందిందని హరీశ్‌రావు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం బీసీలు, విశ్వకర్మలకు లక్ష ఆర్థిక సాయం పథకం అమలు చేస్తే.. దాన్ని కేంద్రం కాపీ కొట్టి ‘విశ్వకర్మ యోజన’ అని ప్రారంభించిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం లక్ష ఆర్థిక సాయంగా ఇస్తే, కేంద్రం మాత్రం అప్పు రూపంలో ఇస్తున్నదని తెలిపారు. కల్యాణలక్ష్మి అంటే ఆర్థిక సాయం మాత్రమే కాదని, బాల్య వివాహాలను పూర్తిగా తగ్గించి సామాజిక గుణాత్మక మార్పును తీసుకొచ్చిన బృహత్తర పథకమని పేర్కొన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో 2014లో 30శాతం ప్రసవాలు జరిగితే, నేడు 72.8 శాతం జరుగుతున్నాయని చెప్పారు. టీడీపీ నేత చంద్రబాబు ఇటీవల ఓ మంచి మాట మాట్లాడారని, తెలంగాణలో ఎకరం అమ్మితే ఏపీలో వంద ఎకరాలు కొనొచ్చని అన్నారని గుర్తుచేశారు. అందుకే తెలంగాణ స్ట్రాంగ్ లీడర్ చేతిలో ఉండాలని, రాంగ్ లీడర్ చేతిలో పెట్టొద్దని కోరారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మె ల్సీలు ఎం శ్రీనివాస్‌రెడ్డి, నారదాసు లక్ష్మణ్రా వు, బీఆర్ఎస్ నాయకుడు భూపతిరెడ్డి పాల్గొన్నారు. బీఆర్ఎస్లో చేరిన వారిలో రాంమోహన్, శ్రీధర్, పృథ్వీధర్, సంపత్‌రావు, అరుణ్, కృష్ణదాస్, వంశీ, రాములు, రాజ్‌కుమార్, చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు బీఎన్ రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో జీవన ప్రమాణాలు పెంచాలనే తపన కేసీఆర్‌లో ఉన్నదని చెప్పారు. కేసీఆర్ విజన్‌తో తెలంగాణ రాష్ట్రం దేశానికి దిక్సూచిగా నిలిచిందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్లో చేరుతున్నానని స్పష్టంచేశారు. కేసీఆర్‌కు తాను పెద్ద అభిమానినని తెలిపారు.