హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసే 115 మంది అభ్యర్థులను పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించడంతో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పటాకులు కాల్చి, మిఠాయిలు పంచుకొనారు. సీఎం కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం అభ్యర్థులను ప్రకటిస్తారని తెలిసి రాష్ట్రం నలుమూలల నుంచి నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హైదరాబాద్ చేరుకోవడంతో ఉదయం నుంచే తెలంగాణ భవన్ వద్ద కోలాహలం నెలకొన్నది. అధినేత అభ్యర్థులను ప్రకటించగానే బయట సంబురాలు మొదలయ్యాయి. సీఎం ప్రసంగం పూర్తయిన తర్వాత కార్యకర్తలు పెద్ద ఎత్తున పటాకులు కాల్చుతూ, మిఠాయిలు పంచుతూ ఆనందం వ్యక్తం చేశారు. టికెట్ ఖరారైన అభ్యర్థులు సైతం సంబరాల్లో భాగస్వాములయ్యారు. నియోజకవర్గ కేంద్రా లు, ఎమ్యెల్యే క్యాంపు కార్యాలయాలు, జిల్లాకేంద్రాల్లోని పార్టీ కార్యాలయాల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. ఎన్నికలకు మూడు నెలల ముందుగానే అభ్యర్థులను ప్రకటించం తో గులాబీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపినట్టయ్యింది.