BRS NRI South Africa | బీఆర్ఎస్ మానకొండూర్ ఎమ్మెల్యే అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు మద్దతుగా ఆదివారం బీఆర్ఎస్ ఎన్నారై సౌత్ ఆఫ్రికా శాఖ ప్రచారం చేసింది. బీఆర్ఎస్ సౌత్ ఆఫ్రికా శాఖ అధ్యక్షులు గుర్రాల నాగరాజు ఆదేశాల మేరకు .. బీఆర్ఎస్ ఎన్నారై సౌత్ ఆఫ్రికా శాఖ సెక్రటరీ జనరల్ మేడసాని నరేందర్ రెడ్డి, మిగతా కార్యవర్గ సభ్యులతో కలిసి గడప గడపకు ప్రచారం చేశారు. ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ కరీంనగర్ కార్పొరేషన్లో విలీనం అయిన తర్వాత అల్గునూర్ అభివృద్ధికి చిరునామాగా మారిందన్నారు.
ఒక వైపు కేబుల్ బ్రిడ్జి, మరోవైపు రివర్ ఫ్రంట్, తిమ్మాపూర్ వరకు నాలుగు వరుసల రోడ్డు, సెంట్రల్ లైటింగ్‌తో ధగధగా మెరిసిపోతూ కరీంనగర్‌కు స్వాగత తోరణంలా మారిందని మేడసాని నరేందర్ రెడ్డి అన్నారు. కార్పొరేషన్లో విలీనమైన తర్వాత ఇక్కడ భూములకు డిమాండ్ చాలా పెరిగిందని గుర్తు చేశారు. షోరూంలు, ఫుడ్ కోర్టులు అనేకం వచ్చాయన్నారు. రానున్న రోజుల్లో రివర్ ఫ్రంట్ పూర్తయితే ఇక్కడ అభివృద్ధి కనీవినీ ఎరుగని రీతిలో ఉంటుందని పేర్కొన్నారు.
కల్లబొల్లి మాటలు చెప్పుకొంటూ వస్తున్న కాంగ్రెస్ నాయకులను నమ్మవద్దని మేడసాని నరేందర్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందాయని, ఇదే క్రమంలో ఇక్కడి కాంగ్రెస్ నాయకులకూ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేశామని, అదీ సీఎం కేసీఆర్ గొప్పతనమని కొనియాడారు. నెల 30న కారు గుర్తుపై ఓటు వేసి రసమయిని మూడోసారి ఎమ్మెల్యేగా ఆశీర్వదించాలని కోరారు.