బీఆర్ఎస్ రజతోత్సవ కార్యక్రమాలను సంవత్సరం పొడవునా నిర్వహించాలని అనుకున్నాం. అందులో మొదటిది డాలస్. తరువాత లండన్‌లో, సౌత్ ఆఫ్రికాలో, గల్ఫ్‌లో, మలేషియా ఇలా పలు ప్రాంతాల్లో నిర్వహిస్తాం.
Mahesh Bigala | హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): డాలస్ సభను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్నట్టు బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్నారై విభాగం కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాల పేర్కొన్నారు. అమెరికాలోని డాలస్ నగరంలోని డాక్టర్ పెప్పర్ ఎరినాలో జూన్ 1న బీఆర్ఎస్ రజతోత్సవ, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో విదేశాల్లో ఉన్న తెలంగాణ బిడ్డల భవిష్యత్ కార్యాచరణకు డాలస్ మీటింగ్ దోహదం చేస్తుందని, ఇదొక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యే ఈ మీటింగ్‌కు మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, మాజీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పలువురు పార్టీ నేతలు హాజరవుతారని చెప్పారు. బీఆర్ఎస్ రజతోత్సవంలో భాగంగా నిర్వహిస్తున్న డాలస్ మీటింగ్ విశేషాలు, ఏర్పాట్లపై ఆయన ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
నమస్తే తెలంగాణ: డాలస్ మీటింగ్‌కు బీఆర్ఎస్ గ్లోబల్ సెల్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు కనిపిస్తున్నది. అందుకు ఏవైనా ప్రత్యేక కారాణాలున్నాయా?
మహేశ్ బిగాల: ప్రాధాన్యం అంటూ ప్రత్యేకంగా ఏమీలేదు. బీఆర్ఎస్ పార్టీ గ్లోబల్ వింగ్ తొలిసారిగా తెలంగాణ బయట అదీ అమెరికాలో నిర్వహిస్తున్న పెద్ద మీటింగ్ కావడంతో మాలో మాకు కొత్త ఉత్సాహం వస్తున్నది. ఇప్పటిదాకా మేం అకేషనల్లీ గ్యాదరింగ్స్ చేశాం. ఇది పెద్ద మీటింగ్. బీఆర్ఎస్ పార్టీకి అనేక విభాగాలున్నాయి. అందులో ఒకటి గ్లోబల్ వింగ్. మిగతా వింగ్‌లు వాటివాటి సందర్భాల్లో కార్యక్రమాలను నిర్వహిస్తాయి. ఆ మాటకొస్తే మేమూ కొన్ని తెలంగాణలో చేస్తాం. మరికొన్ని మేము ఉంటున్న దేశాల్లో చేస్తాం. పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను సంవత్సరం పొడవునా నిర్వహించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించిన నేపథ్యంలో, ఎన్నారై వింగ్ కూడా సంవత్సరం పొడవునా కార్యక్రమాలను నిర్వహించాలనుకున్నాం. ఇదే విషయాన్ని పార్టీ అధినేత కేసీఆర్‌కు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు చెప్పాం. వారు సరేనన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్నవాళ్లం అనేక విధాలుగా ప్రయత్నాలు చేశాం. సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణే కాకుండా తెలంగాణ అభివృద్ధి జరగాలని కలలుకన్నాం. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర సాధన ఉద్యమంలో భావగస్వామ్యం అయ్యాం. పదేండ్ల కేసీఆర్ పాలనలో అన్ని రంగాల్లో తెలంగాణ ప్రగతిని సాధించింది. ప్రస్తుతం తెలంగాణలో మళ్లీ పూర్వ పరిస్థితులే కనిపిస్తున్నాయనే ఆందోళన నెలకొన్నది.
ఇటువంటి సమయంలో మరోసారి మన తెలంగాణ బాగు కోసం మనం ఏంచేయాలన్నదే మా ఆలోచన. ఇది ఒక్క బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్న ఎన్నారై విభాగమే కాకుండా అన్ని వేదికల్లో ఉన్న తెలంగాణ బిడ్డలది. తెలంగాణ మళ్లీ ఇబ్బందులకు గురికావద్దన్నదే మా ఆలోచన. కన్నపేగును కష్టపెట్టకుండా ఉండేందుకు మాకు మేముగా ఏం చేయాలి? అని ఆలోచిస్తున్నాం. మా తరువాతి తరం ఆగం కావద్దన్నదే మా ఆలోచన. అందుకోసం ఒక ఉమ్మడి కార్యాచరణ రూపొందించాలని భావిస్తున్నాం. అందుకోసం డాలస్ మీటింగ్‌ను ప్రతిష్ఠాత్మకంగా చూస్తున్నాం.
నమస్తే తెలంగాణ: మీటింగ్ ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి? ఫీడ్‌బ్యాక్ ఎలా ఉన్నది?
మహేశ్ బిగాల: రెస్పాన్స్ చాలా బాగున్నది. స్వచ్ఛందంగా ఎవరికివారు పాల్గొనేందుకు ఉత్సాహం చూపుతున్నరు. అయితే, ముందు చిన్న హాల్లో సభ పెట్టాలనుకున్నాం. అమెరికాలో ఆయా స్టేట్స్లో ఉన్న తెలంగాణ బిడ్డల నుంచి వస్తున్న రెస్పాన్స్‌ను చూసి వేదికను మార్చాం. డాలస్‌లోని డాక్టర్ పెప్పర్ ఎరినాను ఫైనల్ చేశాం. అమెరికాలోని దాదాపు అన్ని స్టేట్స్లో ఉన్న మనవాళ్లు రావడానికి ఆసక్తి చూపుతున్నారు. మీటింగ్‌కు వచ్చేవాళ్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఒక్క వాట్సాప్ మెసేజ్ పెడితే ఒక్కరోజులోనే ఐదారువేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మీటింగ్‌కు వచ్చేవాళ్ల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. సన్నాహక సమావేశాలు కూడా అన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తున్నాం.
యూఎస్ఏ బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్నారై సెల్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ మహేశ్ తన్నీరుతోపాటు స్థానికంగా ఉన్నవాళ్లతో కలిసి సమన్వయం చేస్తున్నాం. కళ, సాంస్కృతిక రంగాలకు చెందిన ప్రముఖులు తెలంగాణ నుంచి వస్తున్నారు. గోరటి వెంకన్న, రసమయి బాలకిషన్, మధుప్రియ, రేలారే గంగ తదితరులు హాజరవుతున్నారు.
బతుకమ్మ, కోలాటంతోపాటు చేనేత వస్ర్తాలను ప్రమోట్ చేసే కార్యక్రమాల ప్రదర్శన ఉంటుంది. తెలంగాణతల్లి విగ్రహం, అమరవీరుల స్థూపం నమూనాను మీటింగ్ ప్రాంగణంలో ఏర్పాటుచేస్తున్నాం. తెలంగాణ నుంచి వచ్చే కళాకారులతోపాటు అమెరికాలోని వారు కూడా తమ కళను ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నారు. ఒక్కమాటలో చెప్పాల్నంటే డాలస్‌లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను వెల్లువలా ప్రదర్శించేందుకు అనేకమంది ఉత్సాహం చూపుతున్నారు. వారి కోసం ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించాం.
నమస్తే తెలంగాణ: డాలస్ మీటింగ్‌కు ఎవరెవరు హాజరవుతున్నారు?
మహేశ్ బిగాల: తెలంగాణ వాళ్లే కాకుండా అనేకమంది తెలుగువాళ్లు మీటింగ్‌కు రావడానికి ఆసక్తి చూపుతున్నారు. తానా, ఆటాల్లోని తెలంగాణ వాళ్లు, ఏ సంస్థల్లోనూ సభ్యులు కాని వాళ్లు, లోకల్ ఆర్గనైజేషన్స్‌లో భాగస్వామ్యులైనవాళ్లు వస్తున్నారు.
నమస్తే తెలంగాణ: పార్టీ రజతోత్సవాలను డాలస్తో పాటు మరెక్కడైనా ప్లాన్ చేశారా?
మహేశ్ బిగాల: రజతోత్సవాల నేపథ్యంలో సంవత్సరం పొడవునా కార్యక్రమాలు నిర్వహించాలని అనుకున్నాం. అందులో మొదటిది డాలస్. తరువాత యూరప్ దేశాల్లో ఉన్న బీఆర్ఎస్ ఎన్నారై విభాగం కోసం లండన్‌లో, ఆస్ట్రేలియా, ఆఫ్రికా దేశాల్లో ఉన్నవారి కోసం సౌత్ ఆఫ్రికాలో, గల్ఫ్‌దేశాల్లో ఉన్నవారి కోసం గల్ఫ్‌లో, మలేషియా ఇలా పలు ప్రాంతాల్లో నిర్వహించాలని అనుకుంటున్నాం.
నమస్తే తెలంగాణ: పార్టీ ఎన్నారై విభాగంతోపాటు తెలంగాణ నుంచి నాయకులెవరైనా వస్తున్నారా?
మహేశ్ బిగాల: డాలస్ మీటింగ్‌కు ముఖ్యఅతిథిగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్నారు. పార్టీ రజతోత్సవాల మీటింగ్‌ను మొదటిసారి బయటి దేశంలో నిర్వహిస్తున్నాం కాబట్టి, మాకు సహాయం చేసేందుకు, సన్నాహక సమావేశాలను సమన్వయం చేసేందుకు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు ఇలా దాదాపు 25 నుంచి 30 మంది వరకు వస్తామని చెప్పారు. ఇప్పటికే కొంతమంది వచ్చారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు బాల సుమన్, గాదరి కిశోర్, క్రాంతికిరణ్ చంటి, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్దిరెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు తదితరులు వస్తున్నారు. వీరిలో కొందరు ఇప్పటికే వచ్చి మాకు సహకారం అందిస్తున్నారు.